అంచనాలు పెంచినా అలసత్వమే
గత నెలతోనే ముగిసిన నిర్మాణ గడువు
జూన్ నాటికే పూర్తి చేస్తామన్న సీఎం, మంత్రి
వచ్చే ఏడాది జూన్ వరకు గడువు పొడిగింపు
కర్నూలు సిటి:
నిర్ణీత గడువులోపు ప్రాజెక్టులను పూర్తి చేయకపోతే కాంట్రాక్టు ఏజెన్సీలను బ్లాక్ లిస్టులో పెడతామని ముఖ్యమంత్రి హెచ్చరిస్తున్నా పురోగతి కరువయింది. ఈ ఏడాది జూన్ నాటికి గాలేరు-నగరి పనులు పూర్తి చేసి గండికోటకు కృష్ణా జలాలను తరలిస్తామని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇటీవల జిల్లా పర్యటనలో ప్రకటించినా.. మాటలకే పరిమితమయింది.
మాటలకు.. చేతలకు పొంతన లేని పరిస్థితి చూస్తే ప్రాజెక్టులను అనుకున్న గడువులోపు పూర్తి చేయడం అసాధ్యమనే విషయం ఇట్టే అర్థమవుతుంది. గాలేరు-నగరి సుజల స్రవంతి నిర్మాణ పనుల గడువు గత నెలతో ముగిసింది. మరోసారి గడువు పెంపునకు హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన స్టేట్ లెవెల్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమోద ముద్ర వేసి ప్రభుత్వానికి పంపగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
లక్ష్యం..
శ్రీశైలం బ్యాక్ వాటర్ తరలింపుతో కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం.
ఇప్పుడెక్కడ..
రూ.2155.45 కోట్లతో ఫేజ్-1 పనులను పది ప్యాకేజీలుగా విభజించి ప్రారంభించారు. ఇటీవల రూ.2800.89 కోట్లకు అంచనాలు పెంచారు. గత నెలతో గడువు ముగియగా.. మరో ఏడాది పొడిగించారు.
ప్యాకేజీల వారీగా పనుల తీరుతెన్నులివీ
- 24వ ప్యాకేజీ: మే నెలతో గడువు ముగిసింది. వచ్చే ఏడాది జూన్ 30 వరకు గడువు కావాలని కాంట్రాక్టర్ కోరారు. పోతిరెడ్డిపాడు వద్ద బానకచర్ల వరకు చేపట్టిన కాల్వ విస్తరణ పనులు 94.13 శాతం పూర్తయ్యాయి.
- 25 ప్యాకేజీ: బానకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వద్ద ఎస్‌ఆర్‌బీసీ కాల్వను విస్తరించి సామర్థ్యం మేరకు అదనపు గేట్ల పనులు 90 శాతం పూర్తి కావచ్చాయి. అంచనా వ్యయం రూ.186.8 కోట్ల నుంచి 372.90.95 కోట్లకు చేరుకుంది. ఇందులో 167.16 కోట్లు ఖర్చు చేశారు. గత నెల 30తో గడువు ముగియగా.. వచ్చే ఏడాది జూన్ 30 వరకు గడువు కోరారు.
- 26 ప్యాకేజి: ప్రధాన కాల్వ 25.076 కి.మీ నుంచి 56.775 కి.మీ వరకు విస్తరణ పనుల అంచనా వ్యయం రూ.257.85 కోట్ల నుంచి రూ.584 కోట్లకు పెంచారు. సుమారు రూ.300 కోట్లు ఖర్చు చేసి 76.20 శాతం పని చేశారు. గతనెల 30తో గడువు ముగిసింది. వచ్చే ఏడాది జూన్ 30 వరకు గడువును ప్రతిపాదించారు.
- 27వ ప్యాకేజీ: గోరుకల్లు రిజర్వాయర్ నుంచి 17 కి.మీ వరకు గాలేరు కాల్వ పనులు 82 శాతం చేపట్టారు. అంచనా వ్యయం రూ.290 కోట్ల నుంచి రూ.414 కోట్లకు చేరుకుంది. ఇందులో సుమారు రూ.340 కోట్లు ఖర్చు చేశారు. గత నెల 30తో గడువు ముగిసింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు గడువు కోరారు.
- 28, 28ఏ ప్యాకేజీలు: గాలేరు-నగరి కాల్వ 20వేల క్యుసెక్కుల సామర్థ్యం మేరకు 17 కి.మీ నుంచి 46 కి.మీ వరకు విస్తరణ పనులు, నిర్మాణాలు చేపట్టారు. అంచనా వ్యయం రూ.214 కోట్ల నుంచి రూ.340.45 కోట్లకు చేరుకోగా, 83 శాతం పనులు పూర్తయ్యాయి. గత నెల జూన్‌తో గడువు ముగిసింది. ఇందులో 28వ ప్యాకేజీ పనులకు వచ్చే ఏడాది జూన్ 30 వరకు, 28ఏ ప్యాకేజీకి సెప్టెంబర్ 30 వరకు గడువు పెంచాలని కోరారు.
- 29, 29ఏ ప్యాకేజీ: గాలేరు కాల్వ 46 కి.మీ నుంచి 57.70 కి.మీ వరకు విస్తరణ పనుల అంచనా వ్యయం రూ.229.39 కోట్ల నుంచి రూ.310.51 కోట్లకు పెరిగింది. ప్రధాన కాల్వ పనులు 93 శాతం, నిర్మాణ పనులు 72.85 శాతం పూర్తయ్యాయి. గత నెలతోనే గడువు ముగిసింది. 29వ ప్యాకేజీకి వచ్చే ఏడాది జూన్.. 29ఏ ప్యాకేజీకి సెప్టెంబర్ వరకు గడువు కోరారు.
- 30వ ప్యాకేజీ: అవుకు వద్ద రెండు సొరంగాలు ఒక్కోటి 10వేల క్యుసెక్కుల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ఫాల్ట్ జోన్‌లో కాంక్రీట్ పనులకు ఇటీవలే రీడిజైన్ సీఈ సీడీఓ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదన వెళ్లింది. రూ.519 కోట్ల అంచనాలో రూ.425 కోట్లు ఖర్చు చేశారు. పనులు 82 శాతం పూర్తి చేశారు. పనుల పూర్తికి వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు గడువు కోరారు.
- ఓసీ 50 ప్యాకేజీ: ఎస్‌ఆర్‌బీసీ 56 కి.మీ వద్ద 12 టీఎంసీల సామర్థ్యంతో గోరుకల్లు రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. ఇటీవల అంచనా వ్యయం రూ.448 కోట్ల నుంచి రూ.601 కోట్లకు చేరింది. 88 శాతం పనులు పూర్తి చేశారు. మిగిలిన పనులను పూర్తి చేసేందుకు వచ్చే ఏడాది జూన్ 30 వరకు గడువివ్వాలని ప్రతిపాదించారు.
నెలాఖరులోపు ప్రధాన కాల్వ పనులు పూర్తి చేస్తాం
గత నెలతోనే గాలేరు-నగరి నిర్మాణ గడువు ముగిసింది. ఇంకా కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి. వీటిని పూర్తి చేసేందుకు ప్రభుత్వం మరికొంత గడువు ఇచ్చింది. ప్రధాన కాల్వ పనులు ఈ నెల చివరి నాటికి పూర్తి చేస్తాం. గండికోటకు నీరు తీసుకెళ్లే ఉద్దేశంతో పనులు వేగంగా చేయిస్తున్నాం. 21,700 క్యుసెక్కుల స్థానంలో.. 10వేల క్యుసెక్కుల నీరు తీసుకెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందుల్లేవు.
- చిట్టిబాబు, సీఈ, కర్నూలు జల వనరుల శాఖ ప్రాజెక్ట్స్