సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ఈసీఆర్‌ఎఫ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యాం పునాది డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని ఎలా చేపట్టాలనే అంశంపై చర్చించడానికి కేంద్ర జల్‌శక్తి శాఖ ప్రత్యేక కార్యదర్శి పంకజ్‌కుమార్ సోమవారం ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.
కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ కుశ్వీందర్‌సింగ్ వోరా, డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ (డీడీఆర్పీ) చైర్మన్ ఏబీ పాండ్య, సీఎస్‌ఎంఆర్‌ఎస్ (సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్) డైరెక్టర్ ఆర్.చిత్ర, వ్యాప్కోస్ సీఈఓ అమన్ శర్మ, పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సీఈఓ శివ్‌నందన్‌కుమార్, ఎన్‌హెచ్‌పీసీ (నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్) మాజీ ఈడీ ఎస్‌ఎల్ కపిల్, రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డిలతోపాటు ప్రధాన కాంట్రాక్టు సంస్థ మేఘా, సబ్ కాంట్రాక్టు సంస్థలు బావర్, కెల్లర్ సంస్థ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు.
డయాఫ్రమ్ వాల్ పరిస్థితిపై పీపీఏ సభ్య కార్యదర్శి రఘురాం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ గ్యాప్–2లో నిర్మించిన పునాది డయాఫ్రమ్ వాల్ గోదావరి వరదల ఉధృతికి 30 శాతం దెబ్బతిందని ఎన్‌హెచ్‌పీసీ తేల్చింది. దెబ్బతిన్న చోట్ల ‘యూ’ ఆకారంతో కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించి.. పాత దానితో అనుసంధానం చేస్తే సరిపోతుందని డీడీఆర్పీ, సీడబ్ల్యూసీలు తేల్చాయి.
కానీ.. పోలవరం ప్రాజెక్టు పురోగతిపై ఈనెల 3న కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నిర్వహించిన సమావేశంలో సీడబ్ల్యూసీ, డీడీఆర్పీ చేసిన ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సీడబ్ల్యూసీ, డీడీఆర్పీ ప్రతిపాదన మేరకు డయాఫ్రమ్ వాల్‌ను సరిదిద్దితే.. పూర్తి సామర్థ్యం మేరకు ఊట నీటికి అడ్డుకట్ట వేసే అవకాశాలు తక్కువని నిపుణులు అభిప్రాయపడ్డారు.
దీనిపై షెకావత్ స్పందిస్తూ.. పోలవరం ప్రాజెక్టు భద్రత అత్యంత ప్రధానమని, ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ గ్యాప్–2లో 1,396 మీటర్ల పొడవునా పాత దానికి ఎగువన కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని సూచించారు. అప్పుడు రెండు డయాఫ్రమ్ వాల్‌లు ఉన్నట్లవుతుందని.. డ్యామ్‌కు పూర్తిస్థాయిలో భద్రత ఉంటుందన్నారు. కొత్త డయాఫ్రమ్ వాల్‌పై సీడబ్ల్యూసీ, పీపీఏ, ఎన్‌హెచ్‌పీసీ, వ్యాప్కోస్, సీఎస్‌ఆర్‌ఎంఎస్, డీడీఆర్పీ, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో చర్చించి సోమవారంలోగా నివేదిక ఇవ్వాలని పంకజ్‌కుమార్‌ను మంత్రి ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment