
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు తొలిదశ సవరించిన అంచనా వ్యయాన్ని ఖరారు చేయడమే అజెండాగా గురువారం ఢిల్లీలో కేంద్రం కీలక సమావేశం ఏర్పాటుచేసింది. కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఆ శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ కుశ్వీందర్‌సింగ్ వోరా, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో శివ్‌నందన్‌కుమార్, రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి తదితరులు పాల్గొననున్నారు.
పోలవరం ప్రాజెక్టు తొలిదశ సవరించిన అంచనా వ్యయం రూ.16,952.07 కోట్లతో రూపొందించిన ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం పీపీఏకి అందజేసింది. దీనిపై ఈనెల 25న సీడబ్ల్యూసీ, పీపీఏ అధికారులతో కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను క్షుణ్ణంగా అధ్యయనం చేసి త్వరితగతిన నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
తొలిదశ 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలో ముంపునకు గురయ్యే గ్రామాల నిర్వాసితులకు పునరావాసం కల్పించడం, భూసేకరణ, ప్రధాన డ్యామ్, కుడి, ఎడమ కాలువల్లో మిగిలిన పనుల పూర్తికి అయ్యే వ్యయంపై సమీక్షించిన సీడబ్ల్యూసీ, పీపీఏ అధికారులు.. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనతో ఏకీభవిస్తూ కేంద్ర జల్‌శక్తి శాఖకు నివేదిక ఇచ్చినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. ఈ నివేదిక ఆధారంగా పోలవరం తొలిదశ అంచనా వ్యయాన్ని ఖరారు చేసి కేంద్ర మంత్రిమండలికి పంపేందుకు కేంద్ర జల్‌శక్తి శాఖ సిద్ధమైంది. కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేస్తే తొలిదశ సవరించిన అంచనా వ్యయం మేరకు పోలవరానికి నిధుల విడుదలకు మార్గం సుగమం అవుతుంది.
ఇది కూడా చదవండి: రుతుపవనాల్లో కదలిక
Comments
Please login to add a commentAdd a comment