ఉత్తరప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బ్రాహ్మణ ఓటర్లను బుజ్జగించే పనిలో అటు బహుజన్ సమాజ్ పార్టీ, ఇటు సమాజ్‌వాదీ పార్టీ తలమునకలవుతున్నాయి. కానీ, గత అసెంబ్లీ ఎన్నికల్లో బ్రాహ్మణ ఓటర్లు ఓటు వేయని కారణంగా ఈ రెండు పార్టీలూ ఓడిపోలేదు. కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బ్రాహ్మణ వర్గాన్ని బుజ్జగించడానికి యూపీ వ్యాప్తంగా బ్రాహ్మణ సమ్మేళనాలను నిర్వహిస్తామంటూ బీఎస్పీ ప్రకటించగా, తర్వాత ఎస్పీ కూడా దానికి వంతపాడింది. మరి తమను తాము కొత్తగా ఆవిష్కరించుకుంటున్న క్రమంలో ఇన్నాళ్ళూ ఈ పార్టీలు ప్రబోధిస్తూ వచ్చిన సామాజిక న్యాయం, సెక్యులరిజం సిద్ధాంతాల గతేమిటి అనేది ప్రశ్న. మొత్తం మీద, ఎస్పీ, బీఎస్పీలు తమ రాజకీయాలను సరైన దిశలో నడిపించడానికి బదులుగా సైద్ధాంతిక విలువలను పక్కనబెడుతున్నాయి. ఈ సరికొత్త బుజ్జగింపు యూపీ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందనేది ఆసక్తికరం.
ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ 2018 నవంబర్ 20న ‘బ్రాహ్మణ పితృస్వామ్యాన్ని తుదముట్టించండి’ అనే పోస్టర్ పట్టుకుని తీవ్ర వివాదాన్ని రేకెత్తించారు. దాన్ని చూడగానే కాంగ్రెస్ నేత మనీష్ తివారీ ఆగ్రహోదగ్రులయ్యారు. తివారీ ఆగ్రహం వెనుక సారం లేనప్పటికీ సరిగ్గా మూడేళ్ల తర్వాత ఉత్తరప్రదేశ్‌లో మండల్ రాజకీయాల పతాక ధారులు బీఎస్పీ, ఎస్పీలు తన ప్రకటనను సీరియస్‌గా తీసుకుంటారని తివారీ అసలు ఊహించి ఉండరు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బ్రాహ్మణ కమ్యూనిటీని బుజ్జగించడానికి యూపీ వ్యాప్తంగా బ్రాహ్మణ సమ్మేళనాలను నిర్వహిస్తామంటూ బీఎస్పీ ప్రకటించగా, తర్వాత సమాజ్ వాదీ పార్టీ కూడా దానికి వంతపాడింది. ఈ మార్పు అనేక ప్రశ్నల్ని లేవనెత్తింది. బీఎస్పీ, ఎస్పీ వంటి మండల్ రిజర్వేషన్ల అనుకూల పార్టీలను తమ రాజకీయాలను పునర్నిర్వచించుకునేలా బీజేపీ ఒత్తిడి పెడుతోందా? తమను తాము కొత్తగా ఆవిష్కరించుంటున్న క్రమంలో ఇన్నాళ్లు ఈ పార్టీలు ప్రబోధిస్తూ వచ్చిన సామాజిక న్యాయం, సెక్యులరిజం సిద్ధాంతాల గతేమిటి అనేది ప్రశ్న. ఇలాంటి మౌలిక పరివర్తనతో ఈ పార్టీలు ఎన్నికల్లో ప్రయోజనం సాధిస్తాయా అన్నదీ ప్రశ్నే.
2019 లోక్ సభ ఎన్నికల పోలింగ్ అనంతరం లోక్‌నీతి–సీఎస్‌డీఎస్ నిర్వహించిన సర్వే ప్రకారం యూపీలో 72 శాతం యాదవేతరులు, కొయిరి–కుర్మీ ఓబీసీలు బీజేపీకే ఓటు వేసినట్లు తేలింది. వీరిలో 18 శాతం మంది మాత్రమే ఘట్‌బంధన్ కూటమికి ఓట్లేశారు. దిగువ తరగతి ఓబీసీలు, దళితులలో ఇంత మౌలిక మార్పు ఆశ్చర్యం గొలుపుతుంది. ఎందుకంటే బీజేపీలో వారి ప్రాతినిధ్యం కనీస స్థాయిలోకూడా లేదు. ఉత్తరప్రదేశ్‌లో 44.9 శాతం అగ్రకులాలు, 19.7 శాతం ఓబీసీలు గత యూపీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేశారు.
ప్రధానంగా అగ్రకులాల ఆధిపత్యం కొనసాగుతున్న బీజేపీకి దిగువ తరగతి ఓబీసీల, దళితుల ఓట్లు తరలిపోవడం ఎలా అర్థం చేసుకోవాలి? దీనికి ప్రధాన కారణం ఉంది. మండల్ రాజకీయాలు యూపీలోని దిగువ తరగతి ఓబీసీలకు, దళితులకు భౌతికపరంగా (ఉద్యోగాలు, విద్య), రాజకీయపరంగా (రాజకీయ ప్రాతినిధ్యం, గుర్తింపు) ఎలాంటి ప్రయోజనాలు కలిగించలేదు. పలుకుబడిన కొన్ని బీసీ, ఓబీసీ కులాలకు మాత్రమే ప్రయోజనాలు సిద్ధించాయి.
ఉదాహరణకు, 2017 అక్టోబర్‌లో నియమించిన కమిషన్ కేంద్ర స్థాయిలో ఓబీసీలో ఉప వర్గీకరణకు సంబంధించిన సమస్యను అధ్యయనం చేసింది. యూనివర్సిటీలు, ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఎంలు, ఏఐఐఎమ్‌లతోపాటు కేంద్ర ఉన్నత విద్యా సంస్థల్లో ఓబీసీల ప్రవేశంపై గత మూడేళ్ల డేటాను చూస్తే 97 శాతం ఓబీసీ కోటా ప్రయోజనాలు ఓబీసీల్లోని 25 శాతం ఉప–కులాలకు మాత్రమే అందాయి. మొత్తం 983 ఓబీసీ కమ్యూనిటీలకు (ఓబీసీల్లో 37 శాతం) ఉద్యోగాలు, అడ్మిషన్లలో సున్నా ప్రాతినిధ్యం దక్కింది. పైగా, ఓబీసీల్లో 10 కమ్యూనిటీలు మాత్రమే 24.95 శాతం ఉద్యోగాలు, అడ్మిషన్లు పొందాయి.
అంటే రిజర్వేషన్లు రెండంచుల కత్తిలాగా పనిచేసినట్లు కనిపిస్తోంది. అగ్రకులాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా దిగువ కులాలను ఐక్యం చేయడంలో రిజర్వేషన్లు ఒక సాధనంగా పనిచేసినప్పటికీ, అదే సమయంలో రిజర్వేషన్ల ప్రయోజనాలు ఇంత అసమానంగా పంపిణీ కావడంతో ఒక విస్తృతస్థాయి సంఘీభావం, సామూహిక కార్యాచరణ దిగువకులాల్లో లోపించింది. అదే సమయంలో ఏక జాతి సిద్ధాంతాన్ని బలంగా ప్రబోధించే బీజేపీ వైపు దీర్ఘకాలిక ఆలోచన లేకుండా ఓబీసీల్లో విశ్వాసం పెరగడానికి కూడా ఇదే కారణం. దిగువ కులాలు చీలిపోవడం, బీజేపీ దూకుడుగా వ్యవహరించడం అనేవి మండల్ రాజకీయాలను ద్వంద్వ సంక్షోభంలోకి నెట్టివేశాయి.
కుల రాజకీయాల గుణపాఠాలు
దిగువ తరగతి ఓబీసీల, దళితుల ఆందోళనలు నిజమైనవే అయినప్పటికీ బీఎస్పీ, ఎస్పీ నాయకత్వం వీరి సమస్యలను చిత్తశుద్ధితో పరిశీలించడంపై నిర్లక్ష్యం వహించాయి. పైగా వారి సమస్యలను కనీ సంగా గుర్తించడంలో కూడా ఈ రెండు పార్టీలు విఫలమయ్యాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఘోర పరాజయానికి కారణాలను సమీక్షించుకోవడంలో కూడా ఈ రెండు పార్టీలు వెనుకబడ్డాయి. పైగా ప్రతి ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీల వ్యూహాల్లో తీవ్రమైన మార్పులు చోటు చేసుకుంటూ వచ్చాయి. ఉదాహరణకు 2017 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ అభివృద్ధి సాధనను తన నినాదంగా తీసుకొచ్చింది. ఎక్స్‌ప్రెస్ రహదారులు, మెట్రోలు, ల్యాప్‌టాప్‌ల పంపిణీ వంటివి తన ప్రభుత్వ ఘనతగా ప్రచారం చేసుకుంది. కానీ 2019 లోక్ సభ ఎన్నికల సమయానికి సామాజిక న్యాయం వైపు దిశ మార్చి మహాపరివర్తనకు అదొక్కటే మార్గమని ఢంకా భజాయించింది. కానీ ఆ రెండు ఎన్నికల్లోనూ ఎస్పీ ఘోర వైఫల్యం చవిచూసింది.
అదే సమయంలో బీఎస్పీ సైతం ముస్లిం ఓటర్లను గెల్చుకోవడానికి ప్రయత్నించి 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 100 టికెట్లను ముస్లింల పరం చేసింది. ఇది కూడా పనిచేయలేదు. కానీ ఇప్పుడు కూడా ఆ పార్టీ బ్రాహ్మణులను బుజ్జగించడం అనే ప్రయోగం చేస్తోంది. అంటే అభివృద్ది పంథా కానీ మండల్ శైలి రాజకీయాలు కానీ ఈ రెండు పార్టీలకు ప్రయోజనాలు కలిగించలేకపోయాయని స్పష్టమవుతోంది. మరోవైపున బీజేపీ నిస్సందేహంగానే కుల ప్రాతిపదికన ఓటర్ల సమీకరణను పునర్నిర్వచించి, ఓబీసీల్లో కొన్ని సెక్షన్లను మరికొన్ని సెక్షన్లకు వ్యతిరేకంగా నిలిపింది. ఇన్నాళ్లూ తమకు మద్దతు పలికిన వర్గాలను తిరిగి గెల్చుకునే ప్రయత్నం చేపట్టడానికి బదులుగా ఎస్పీ, బీఎస్పీలు తాజాగా బ్రాహ్మణులను బుజ్జగించే పనిలో పడిపోయాయి.
తమ రాజకీయాలకు కొత్తదనం తీసుకొచ్చే క్రమంలో ఈ రెండు పార్టీలు దళిత బహుజన రాజకీయాలు, సామాజిక న్యాయం, సెక్యులరిజం మౌలిక సూత్రాలకు భిన్న మార్గంలో పయనిస్తున్నాయి. అందుకే సామాజిక న్యాయం, ఉనికిలో ఉన్న కోటాలను అమలు చేయకపోవడం, నీట్ పరీక్షల్లో ఓబీసీ రిజర్వేషన్లను తిరస్కరించడం, కులాలవారీ జనగణనకు ప్రభుత్వ తిరస్కరణ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలుపర్చడం వంటి అనేక కీలక సమస్యలపై ఈ రెండు పార్టీలు ఎలాంటి స్ఫూర్తిదాయకమైన పోరాటాలను చేపట్టలేకపోయాయి.
పైగా, అయోధ్యలో బీఎస్పీ నిర్వహించిన బ్రాహ్మణ్ సమ్మేళనం బీజేపీకీ, బీఎస్పీకి మధ్య తేడా లేకుండా చేసింది. ఆ సమ్మేళనంలో బీఎస్పీ ‘జై శ్రీరాం’ అని నినదించడమే కాకుండా పాలక బీజేపీ కంటే రామాలయాన్ని వేగంగా నిర్మిస్తానని శపథం చేసింది కూడా. యూపీలో ఇటీవలి సంవత్సరాల్లో కులపరమైన అత్యాచారాలు, అణచివేత పెరుగుతున్నప్పటికీ బీఎస్పీ తన మౌలిక విలువలతో రాజీపడుతున్నట్లు కనిపిస్తోంది. మొత్తం మీద, ఏస్పీ, బీఎస్పీలు తమ రాజకీయాలను సరైన దిశలో నడిపించడానికి బదులుగా సైద్ధాంతిక విలువలను పక్కనబెడుతున్నాయి. బిహార్‌లో ముస్లింలు మజ్లిస్ పార్టీ వైపు తరలిపోవడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ పార్టీలు ఇకపై ముస్లిం ఓట్లను గంపగుత్తగా ఆకర్షించడం కూడా సాధ్యం కాదు.
పంకజ్ కుమార్
వ్యాసకర్త పీహెచ్‌డి స్కాలర్, సెంటర్ ఫర్ పొలిటికల్ స్టడీస్,జేఎన్‌యూ
Comments
Please login to add a commentAdd a comment