బౌద్ధం బలంగా ఉన్న దేశాలలో రాముణ్ణి, రావణుణ్ణి ఇప్పటికీ బౌద్ధులు గానే పరిగణిస్తారు. వేల సంవత్సరాలుగా అక్కడ ప్రచారంలో ఉన్న సాహిత్య ప్రభావం అక్కడి ప్రజల మీద ఉంది. ఇతర దేశాలలో మనువాదుల ప్రభావం లేదు కాబట్టి, మార్పులకు లోను కాని మూల రచనలే అక్కడ కొనసాగుతున్నాయి.
బౌద్ధుల ‘వైఫల్య సూత్రా’లలో ‘లంకావతార’ అనే ఒక పేరు తటస్థ పడుతుంది. అందులో బుద్ధుడు బౌద్ధ రాజు రావణుడికి ఉపదేశం ఇస్తాడు. అలాగే ‘దశరథ’ జాతక కథ అనేది మరొకటి ఉంది. ఈ రెండు కథలను జోడించి, సీతాపహరణం రావణుడితో చేయించి బ్రాహ్మణ వాదులు ఒక కొత్త కథకు రూపకల్పన చేశారని పరిశీలకులు చెబుతున్నారు. ఐదవ శతాబ్దంలో బుద్ధ ఘోషుడు ఈ సీతాపహరణాన్ని తన రచనలో వ్యతిరేకించాడని కూడా చెబు తారు.
విష్ణువు, ఈశ్వరుడు, వ్యాసుడు, ఇంద్రుడు, బలి, వరుణుడు వంటి పేర్లన్నీ ఇప్పటికీ బ్రాహ్మణ సమా జంలో చలామణిలో ఉన్నాయి. అయితే ఈ పదాలు ఎక్క డివి? అని ప్రశ్నించుకుంటే – ఇవన్నీ పాలి, ప్రాకృత భాషల సమ్మేళనంతో మహా యానంలో ఏర్పడ్డవి. సంస్కృతం ఒక భాషగా అప్పటికి పూర్తిగా రూపుదిద్దుకోని సమ యంలో బ్రాహ్మణవాదులు పాలి, ప్రాకృత భాషా పదాల మిశ్రమాన్ని తమ సంస్కృత భాషలోకి స్వీకరించి వ్యవహా రంలోకి తెచ్చారు. అందువల్ల, సంస్కృతం – బౌద్ధ హైబ్రిడ్ సంస్కృతం (బీహెచ్‌ఎస్)గా నిలిచిపోయింది.
దేశం ముస్లింల పాలనలో ఉన్నప్పుడు, బ్రాహ్మణా ర్యులు బౌద్ధ సాహిత్యాన్ని మార్చి తమ బౌద్ధ హైబ్రిడ్ సంస్కృత భాషలో అమోఘంగా తిరగరాసుకున్నారు. పాలి, ప్రాకృతాలు ముడి భాషలైతే అందులోంచి సంస్కరించబడిందే సంస్కృతమని భారతీయ పరిశోధకులు తేల్చి చెప్పారు. తమ పొట్ట కూటి కోసం బోధిసత్వుడి పేర్లు మార్చి, హిందూ దేవీ దేవతలకు ఆపాదించుకుని, తమకు లెక్కలేనంత మంది దేవతలున్నారని ఒక భ్రమ కల్పించారు.
మహాయాన్ ‘వైపుల్య సుత్తం’లో భగవాన్ బుద్ధుడికి అనేకానేక పేర్లున్నాయి. ‘లలిత్ విస్తార్’ అనే గ్రంథంలో బుద్ధుడికి ఒక పెద్ద పేర్ల పట్టికే ఉంది. అలాగే, ‘మహా వస్తు’ అనే గ్రంథంలో పేర్ల జాబితా మరింత పెరిగి వంద దాటింది. ఎలాగైతే ఒక వస్తువుకు ఉన్న ఆకృతి, ఉపయో గాలను బట్టి, వేరు వేరు పేర్లతో పిలవబడుతుందో... అలాగే, బుద్ధుడి అనుయాయులు ఆయనను అనేక పేర్లతో పిలుచుకున్నారు.
‘లంకావతార్’ సూత్రంలో కొందరు ఆయనను ‘తథాగతుడు’ అని పిలిస్తే, మరికొందరు ‘స్వయంభూ నాయక్’ అనీ, ‘వినాయక్’ అనీ, ‘పరిణా యక్’ అనీ, బుద్ధుడు, రుషీ, వృషమ్, బ్రాహ్మణ, విష్ణు, ఈశ్వర్, ప్రథాన కపిల్, భూతాంత్, రామ్, వ్యాస్, శుక్ర్, ఇంద్ర్, బలి, వరుణ వంటి అనేక పేర్లతో పిలుచుకునే వారు. అనిరోధానుప్పాదం, శూన్యత, సత్యం, ధర్మధాతు, నిర్వాణ్ – అని కూడా అన్నారు.
బుద్ధుణ్ణి దశావతారాలలో తొమ్మిదో అవతారంగా చేర్చుకుని, ఆయన గురించి వాస్తవాలు దాచేసి, బ్రాహ్మణా ర్యులు అబద్ధాలు ప్రచారం చేశారు. బుద్ధుడు ఇల్లువిడిచి వెళ్లి చెట్టుకింద ధ్యానముద్రలో ఉండగా ‘నాగ ముచిళిందు’డనే నాగుపాము వచ్చి, పడగ విప్పి ఆయనకు నీడ నిచ్చింది వంటి కల్పనలు ప్రచారం చేశారు. నాగుపాము అనేది కల్పన. అక్కడ వాస్తవమేమంటే, నాగజాతి ఆదివా సులు బుద్ధుని బోధనలకు ఆకర్షితులయ్యారు. ఆయన వెన్నంటే రక్షణగా ఉండేవారు.
బుద్ధావతారానికి ముందున్న ఎనిమిది అవతారాలలో అభూత కల్పనలున్నట్టే, బుద్ధుడి నిజ జీవితాన్ని కూడా కల్పనలతో నింపేశారు. బుద్ధుడు ఒక చారిత్రక పురుషుడు. ఈ నేల మీద వాస్తవంగా తిరిగిన ఒక మహానుభావుడు. ఇది చాలా సున్నితమైన అంశం. అర్థం చేసుకోవడానికి అవగాహన కొంచెం పెంచుకోవాల్సి ఉంటుంది. వైదిక ధర్మాన్ని విశ్వసించే మునులు, రుషులు చేసే తపస్సుకూ, బుద్ధుడు చేసిన ధ్యానానికీ చాలా తేడా ఉంది.
వైదికులు చేసే తపస్సు దైవాన్ని తలపోస్తూ చేసేది. దైవాన్ని విశ్వసించని బుద్ధుడు చేసింది తనలోకి తాను చేసిన ప్రయాణం! సమాజ హితం కోరి చేసిన తీవ్రమైన ఆలోచన. మనిషి జీవితంలో నైతికత ప్రాధాన్యత గురించిన అంతర్మథనం. ఈ లోకంలోని దుఃఖాన్ని పోగొట్టడమెలాగా? అని తీవ్రంగా మథనపడటం. జాగ్రత్తగా అవలోకిస్తేగానీ,రెండు ధర్మాల మధ్య తేడా ఏమిటో బోధపడదు.
బుద్ధుణ్ణి ‘భగవాన్’ అని ఎందుకు పిలుచుకుంటారూ? అనే అనుమానం చాలామందికి వస్తుంది. బౌద్ధ ధమ్మం ప్రకారం భగవాన్ అంటే పరిపూర్ణతను సాధించినవాడు అని అర్థం. ఆ పదాన్ని కూడా కాపీ కొట్టి వైదిక ప్రచారకులు వాడుకున్నారు. ఉనికిలో లేని ఒక శూన్యాన్ని దేవుడిగా భావించి, పిలుచుకున్నారు.
సర్వాంతర్యామి, జగద్రక్షకుడు లాంటి అర్థాలు చెప్పి, కొన్ని శతాబ్దాలుగా జనాన్ని నమ్మిస్తూ వస్తున్నారు. కనపడని ‘దేవుణ్ణి’ బ్రాహ్మణార్యులు భగవాన్ అంటే, ఒకప్పుడు ఈ నేల మీద జీవించిన ఒక మహా మానవుణ్ణి బౌద్ధులు భగవాన్ – పరిపూర్ణతను సాధించిన వాడా అని గౌరవించుకుంటున్నారు. ఆ తేడాను మనం గమనించాలి.
డా‘‘ దేవరాజు మహారాజు
వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత, జీవశాస్త్రవేత్త
Comments
Please login to add a commentAdd a comment