Buddhists
-
బౌద్ధాన్ని కలిపేసుకున్నారు!
బౌద్ధం బలంగా ఉన్న దేశాలలో రాముణ్ణి, రావణుణ్ణి ఇప్పటికీ బౌద్ధులు గానే పరిగణిస్తారు. వేల సంవత్సరాలుగా అక్కడ ప్రచారంలో ఉన్న సాహిత్య ప్రభావం అక్కడి ప్రజల మీద ఉంది. ఇతర దేశాలలో మనువాదుల ప్రభావం లేదు కాబట్టి, మార్పులకు లోను కాని మూల రచనలే అక్కడ కొనసాగుతున్నాయి. బౌద్ధుల ‘వైఫల్య సూత్రా’లలో ‘లంకావతార’ అనే ఒక పేరు తటస్థ పడుతుంది. అందులో బుద్ధుడు బౌద్ధ రాజు రావణుడికి ఉపదేశం ఇస్తాడు. అలాగే ‘దశరథ’ జాతక కథ అనేది మరొకటి ఉంది. ఈ రెండు కథలను జోడించి, సీతాపహరణం రావణుడితో చేయించి బ్రాహ్మణ వాదులు ఒక కొత్త కథకు రూపకల్పన చేశారని పరిశీలకులు చెబుతున్నారు. ఐదవ శతాబ్దంలో బుద్ధ ఘోషుడు ఈ సీతాపహరణాన్ని తన రచనలో వ్యతిరేకించాడని కూడా చెబు తారు. విష్ణువు, ఈశ్వరుడు, వ్యాసుడు, ఇంద్రుడు, బలి, వరుణుడు వంటి పేర్లన్నీ ఇప్పటికీ బ్రాహ్మణ సమా జంలో చలామణిలో ఉన్నాయి. అయితే ఈ పదాలు ఎక్క డివి? అని ప్రశ్నించుకుంటే – ఇవన్నీ పాలి, ప్రాకృత భాషల సమ్మేళనంతో మహా యానంలో ఏర్పడ్డవి. సంస్కృతం ఒక భాషగా అప్పటికి పూర్తిగా రూపుదిద్దుకోని సమ యంలో బ్రాహ్మణవాదులు పాలి, ప్రాకృత భాషా పదాల మిశ్రమాన్ని తమ సంస్కృత భాషలోకి స్వీకరించి వ్యవహా రంలోకి తెచ్చారు. అందువల్ల, సంస్కృతం – బౌద్ధ హైబ్రిడ్ సంస్కృతం (బీహెచ్ఎస్)గా నిలిచిపోయింది. దేశం ముస్లింల పాలనలో ఉన్నప్పుడు, బ్రాహ్మణా ర్యులు బౌద్ధ సాహిత్యాన్ని మార్చి తమ బౌద్ధ హైబ్రిడ్ సంస్కృత భాషలో అమోఘంగా తిరగరాసుకున్నారు. పాలి, ప్రాకృతాలు ముడి భాషలైతే అందులోంచి సంస్కరించబడిందే సంస్కృతమని భారతీయ పరిశోధకులు తేల్చి చెప్పారు. తమ పొట్ట కూటి కోసం బోధిసత్వుడి పేర్లు మార్చి, హిందూ దేవీ దేవతలకు ఆపాదించుకుని, తమకు లెక్కలేనంత మంది దేవతలున్నారని ఒక భ్రమ కల్పించారు. మహాయాన్ ‘వైపుల్య సుత్తం’లో భగవాన్ బుద్ధుడికి అనేకానేక పేర్లున్నాయి. ‘లలిత్ విస్తార్’ అనే గ్రంథంలో బుద్ధుడికి ఒక పెద్ద పేర్ల పట్టికే ఉంది. అలాగే, ‘మహా వస్తు’ అనే గ్రంథంలో పేర్ల జాబితా మరింత పెరిగి వంద దాటింది. ఎలాగైతే ఒక వస్తువుకు ఉన్న ఆకృతి, ఉపయో గాలను బట్టి, వేరు వేరు పేర్లతో పిలవబడుతుందో... అలాగే, బుద్ధుడి అనుయాయులు ఆయనను అనేక పేర్లతో పిలుచుకున్నారు. ‘లంకావతార్’ సూత్రంలో కొందరు ఆయనను ‘తథాగతుడు’ అని పిలిస్తే, మరికొందరు ‘స్వయంభూ నాయక్’ అనీ, ‘వినాయక్’ అనీ, ‘పరిణా యక్’ అనీ, బుద్ధుడు, రుషీ, వృషమ్, బ్రాహ్మణ, విష్ణు, ఈశ్వర్, ప్రథాన కపిల్, భూతాంత్, రామ్, వ్యాస్, శుక్ర్, ఇంద్ర్, బలి, వరుణ వంటి అనేక పేర్లతో పిలుచుకునే వారు. అనిరోధానుప్పాదం, శూన్యత, సత్యం, ధర్మధాతు, నిర్వాణ్ – అని కూడా అన్నారు. బుద్ధుణ్ణి దశావతారాలలో తొమ్మిదో అవతారంగా చేర్చుకుని, ఆయన గురించి వాస్తవాలు దాచేసి, బ్రాహ్మణా ర్యులు అబద్ధాలు ప్రచారం చేశారు. బుద్ధుడు ఇల్లువిడిచి వెళ్లి చెట్టుకింద ధ్యానముద్రలో ఉండగా ‘నాగ ముచిళిందు’డనే నాగుపాము వచ్చి, పడగ విప్పి ఆయనకు నీడ నిచ్చింది వంటి కల్పనలు ప్రచారం చేశారు. నాగుపాము అనేది కల్పన. అక్కడ వాస్తవమేమంటే, నాగజాతి ఆదివా సులు బుద్ధుని బోధనలకు ఆకర్షితులయ్యారు. ఆయన వెన్నంటే రక్షణగా ఉండేవారు. బుద్ధావతారానికి ముందున్న ఎనిమిది అవతారాలలో అభూత కల్పనలున్నట్టే, బుద్ధుడి నిజ జీవితాన్ని కూడా కల్పనలతో నింపేశారు. బుద్ధుడు ఒక చారిత్రక పురుషుడు. ఈ నేల మీద వాస్తవంగా తిరిగిన ఒక మహానుభావుడు. ఇది చాలా సున్నితమైన అంశం. అర్థం చేసుకోవడానికి అవగాహన కొంచెం పెంచుకోవాల్సి ఉంటుంది. వైదిక ధర్మాన్ని విశ్వసించే మునులు, రుషులు చేసే తపస్సుకూ, బుద్ధుడు చేసిన ధ్యానానికీ చాలా తేడా ఉంది. వైదికులు చేసే తపస్సు దైవాన్ని తలపోస్తూ చేసేది. దైవాన్ని విశ్వసించని బుద్ధుడు చేసింది తనలోకి తాను చేసిన ప్రయాణం! సమాజ హితం కోరి చేసిన తీవ్రమైన ఆలోచన. మనిషి జీవితంలో నైతికత ప్రాధాన్యత గురించిన అంతర్మథనం. ఈ లోకంలోని దుఃఖాన్ని పోగొట్టడమెలాగా? అని తీవ్రంగా మథనపడటం. జాగ్రత్తగా అవలోకిస్తేగానీ,రెండు ధర్మాల మధ్య తేడా ఏమిటో బోధపడదు. బుద్ధుణ్ణి ‘భగవాన్’ అని ఎందుకు పిలుచుకుంటారూ? అనే అనుమానం చాలామందికి వస్తుంది. బౌద్ధ ధమ్మం ప్రకారం భగవాన్ అంటే పరిపూర్ణతను సాధించినవాడు అని అర్థం. ఆ పదాన్ని కూడా కాపీ కొట్టి వైదిక ప్రచారకులు వాడుకున్నారు. ఉనికిలో లేని ఒక శూన్యాన్ని దేవుడిగా భావించి, పిలుచుకున్నారు. సర్వాంతర్యామి, జగద్రక్షకుడు లాంటి అర్థాలు చెప్పి, కొన్ని శతాబ్దాలుగా జనాన్ని నమ్మిస్తూ వస్తున్నారు. కనపడని ‘దేవుణ్ణి’ బ్రాహ్మణార్యులు భగవాన్ అంటే, ఒకప్పుడు ఈ నేల మీద జీవించిన ఒక మహా మానవుణ్ణి బౌద్ధులు భగవాన్ – పరిపూర్ణతను సాధించిన వాడా అని గౌరవించుకుంటున్నారు. ఆ తేడాను మనం గమనించాలి. డా‘‘ దేవరాజు మహారాజు వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత, జీవశాస్త్రవేత్త -
కుంగ్ ఫూ నన్స్
హిమాలయాల్లో గ్రామాల వెంట ఎర్రటి దుస్తుల్లో తిరిగే బౌద్ధ సన్యాసినులు కనిపిస్తారు. వీరు కొండ ప్రాంత ప్రజలకు కోవిడ్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రచారం చేస్తారు. సహాయం అందిస్తారు. వ్యాధిగ్రస్తుల వైద్యానికి సాయం చేస్తారు. అవసరమైతే రక్షణగా నిలుస్తారు. వీరు కుంగ్ ఫూ నన్స్. గతంలో కేవలం బౌద్ధ స్త్రీ సేవాదళంగా ఉండేవారు. ఇప్పుడు కుంగ్ ఫూ కూడా నేర్చి తమను తాము రక్షించుకోవడమే కాదు ఏ చెడు పైన అయినా పంచ్ విసరడానికి సిద్ధంగా ఉంటారు. కోవిడ్–19 మీద ప్రభుత్వాలు పోరాటం చేస్తున్నాయి. స్వచ్ఛంద సంస్థలు, పోలీసులు, ఆరోగ్య సిబ్బంది అందరూ పోరాటం చేస్తున్నారు. అయితే హిమాలయ పర్వత ప్రాంతాలలో దాదాపు 800 మంది బౌద్ధ మహిళా భిక్షువులు కూడా పోరాటం చేస్తున్నారని చాలా కొద్దిమందికే తెలుసు. ఈ బౌద్ధ మహిళా భిక్షువులను ‘కుంగ్ ఫూ నన్స్’ అంటారు. ఎందుకంటే వీరికి కుంగ్ ఫూ వచ్చు కాబట్టి. కావి రంగు బట్టల్లో, శిరో ముండనం చేసుకుని, గంటల తరబడి చేసిన ధ్యానం వల్ల వచ్చిన ప్రశాంత వదనాలతో ఈ మహిళా భిక్షువులు ‘సాటి మనిషిని ప్రేమించుటకే జీవించు’ అనే బౌద్ధ తత్వాన్ని సాధన చేస్తుంటారు. ప్రస్తుతం కోవిడ్ రోజుల్లో ప్రజలను చైతన్యవంతం చేయడానికి హిమాలయ పర్వత సానువుల్లో వీరు తిరుగుతూ ఉంటే మంచు మీద పూసిన ఎర్రపూల వలే కనిపిస్తారు దూరం నుంచి. 2015 నుంచి వార్తల్లోకి బౌద్ధంలోని అనేక శాఖలలో మహిళా భిక్షువులకు ప్రవేశం లేదు. కాని స్త్రీలకు చదువు అబ్బకపోవడం, వారికి సహాయకులు లేకపోవడం, మార్గదర్శకుల లేమి... ఇవన్నీ గమనించిన ‘ద్రుక్పా’ అనే బౌద్ధ శాఖ స్త్రీలకు ప్రత్యేకంగా ప్రవేశం కల్పించింది. అందుకే వీరిని ద్రుక్పా బౌద్ధులు అంటారు. వీరు ప్రధానంగా శాంతి కొరకు, సేవ కొరకు పని చేయాల్సి వచ్చినా వీరికి వ్యాయామం నిషిద్ధమే అయినా 2015లో వచ్చిన వీరి గురువు వీరికి కుంగ్ ఫూ నేర్చుకునే అనుమతిని ఇచ్చాడు. దానికి కారణం పర్వత ప్రాంతాలలో అమాయక ఆడపిల్లలు ట్రాఫికింగ్ కు గురి కావడం వల్లే. ‘మీరూ నేర్చుకోండి... ఆడ³ల్లలకూ నేర్పండి’ అని లడాక్‌లో ఉన్న వీరి ప్రధాన కార్యాలయం ఆదేశం ఇవ్వగానే ఈ నన్స్ కుంగ్ ఫూ నేర్చుకుని భారత్–నేపార్ సరిహద్దుల్లోని గ్రామాల్లో ఆడపిల్లలకు కుంగ్ ఫూ నేర్పడం మొదలుపెట్టారు. ఇది అంతర్జాతీయ మీడియా ను ఆకర్షించి మెచ్చుకోళ్లు వచ్చాయి. వీరి మంచి పనికి సహాయం కూడా అందసాగింది. ‘మేము కుంగ్ ఫూ నేర్చుకోవడం ఇతర బుద్ధిస్ట్ శాఖలకు నచ్చదు. మా పని ప్రార్థించడం, వంట చేయడం, శుభ్రం చేయడం అని భావిస్తారు. కాని మేము సేవతో పాటు రక్షణకు కూడా కట్టుబడ్డాం. జనం మమ్మల్ని మెచ్చుకుంటున్నారు’ అని అంటారు వీరు. వీరి అందరి పేర్ల చివర ‘జిగ్మే’ అని పెట్టుకుంటారు. జిగ్మే అంటే భయం లేనిది అని అర్థం. సహాయమే మతం ‘ఇతరులకు సహాయం చేయడమే మా మతం’ అంటారు కుంగ్‌ఫూ నన్స్. ప్రస్తుతం భారతదేశంలో అంటే టిబెట్ చుట్టుపక్కల 8 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వయసు ఉన్న 800 మంది కుంగ్ ఫూ నన్స్ ఉన్నారు. కోవిడ్ సమయంలో లాక్డౌన్ వల్ల ప్రజలు పడే ఇబ్బందులు వీరు గమనించారు. ‘ప్రకృతి మాత కాలుష్యం నుంచి బయటపడేందుకు చేసిన ప్రయత్నంలా అనిపించింది ఇది. అయితే ప్రజల కష్టాలను మేము చూడలేకపోయాం. సహాయం కోసం ఎదురు చూడటం కంటే మనమే సహాయంగా మారాలని అనుకున్నాం’ అని ఈ నన్స్ అన్నారు. లాక్డౌన్ సమయంలో లాక్డౌన్ తర్వాత కూడా వీరు సరిహద్దు గ్రామాల వెంట ఉన్న దాదాపు 2000 కుటుంబాలను వీరు రేషన్ అందించారు. దేశ విదేశాల నుంచి అందిన విరాళాలు ఇందుకు సాయపడ్డాయి. పరిశీలకులు గమనించింది ఏమిటంటే హిమాయాల పొడవున ఆహారం లేక అలమటించిన పశువులకు కుంగ్ ఫూ నన్‌లు మేత ఏర్పాటు చేశారు. లేకుంటే అనాథ పశువులు ఎన్నో ఇప్పటికి చనిపోయి ఉండేవి. చైతన్యం... సాధనం కోవిడ్ ఎంత ప్రమాదమో కుంగ్ ఫూ నన్‌లకు అర్థమైంది. కాని కొండ ప్రాంత ప్రజలకు దాని తీవ్రత అర్థం కాదు. ‘మేము వారికి పదే పదే చైతన్యం కలిగించాల్సి వచ్చింది. వారికి అది కేవలం జలుబు అనే అభిప్రాయం ఉంది. కాని వారికి భౌతిక దూరం గురించి, మాస్కుల గురించి చెప్పాం. వాటిని మేము కుట్టి పంచాం. దాని బారిన పడ్డ వారికి వైద్య సహాయం అందేలా చూశాం’ అంటారు ఈ కుంగ్ ఫూ నన్‌లు. కోవిడ్ ప్రచారంలో దిగాక వీరికి స్త్రీల ఇతర సమస్యలు కూడా తెలిసి వచ్చాయి. ‘శానిటరీ నాప్కిన్స్ సమస్య తీవ్రంగా ఉంది. హిమాయాల స్త్రీలకు వీటిని అందుబాటులోకి తేవడానికి పని మొదలుపెడతాం’ అంటున్నారు వారు. స్త్రీల శక్తి అపారం. యుద్ధ విద్యలు నేర్చిన స్త్రీల శక్తి మరింత దృఢం. ఈ దృఢమైన సేవ స్త్రీలకు తప్పక మేలు చేస్తుంది. సహాయక చర్యలు చేపట్టిన కుంగ్‌ఫూ నన్స్ కుంగ్‌ఫూ సాధన – సాక్షి ఫ్యామిలీ -
మత ఘర్షణల నుంచి రాజకీయాల వైపు...
కొలంబో : ముస్లిం వ్యతిరేక అల్లర్లు చెలరేగి మత ఘర్షణలకు దారి తీయగా, ఎమర్జెన్సీ తర్వాత శ్రీలంకలో ప్రస్తుతం పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది. అయితే ఘర్షణలకు కారణమైన సంస్థ ఇప్పుడు అనూహ్య నిర్ణయం తీసుకుంది. (ఘర్షణలకు కారణం ఏంటంటే...) మహసన్ బాలకాయ అనే సంస్థ ముస్లింలకు వ్యతిరేకంగా ఉపన్యాసాలు, వీడియోలు పోస్టు చేయటంతో అల్లర్లకు చెలరేగాయి. ఆ సంస్థే త్వరలో రాజకీయ అరంగ్రేటం చేయనున్నట్లు ప్రకటించింది. ‘సింహళీయుల గౌరవాన్ని కాపాడే రాజకీయ పార్టీలు ఇప్పటిదాకా లేవు. అందుకే మిగతా సింహళ సంస్థలను కలుపుకుని మహసన్ బాలకాయ పేరిట పార్టీని స్థాపించబోతున్నాం. ఇప్పటికే ఎన్నికల అధికారికి పార్టీ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాం’ అని సంస్థ అధికార ప్రతినిధి ఒకరు మీడియాకు వెల్లడించారు. కాగా, మహసన్ బాలకాయ సంస్థపై మత ఘర్షలతోపాటు ముస్లింలకు చెందిన స్థలాలను కబ్జా చేసిందంటూ పలు కేసులు ఉన్నాయి. క్యాండీ జిల్లాలో 70 శాతం ఉన్న సింహళ బౌద్ధులకు, 10 శాతం ఉన్న ముస్లింలకు మధ్య మార్చి6వ తేదీన అల్లర్లు చెలరేగటం.. అవి మిగతా ప్రాంతాలకు కూడా విస్తరించటంతో ఎమర్జెన్సీని విధించింది శ్రీలంక ప్రభుత్వం. చివరకు పరిస్థితి సర్దుమణగటంతో మార్చి 18న అత్యవసర పరిస్థితిని ఎత్తేసినట్లు ప్రకటించింది. -
శ్రీలంకలో ఎమర్జెన్సీ ; అసలు కారణమేంటి?
భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్‌ల మధ్య టీ20 సిరీస్ క్రికెట్ పోటీలు ప్రారంభమైన తరుణంలోనే.. శ్రీలంక ప్రభుత్వం దేశంలో పది రోజులపాటు అత్యవసర పరిస్థితిని(ఎమర్జెన్సీ) ప్రకటించింది. దేశంలో పలుచోట్ల బౌద్ధులకు, ముస్లింలకు మధ్య అల్లర్లు చెలరేగడంతో ఈ నిర్ణయం తీసుకుంది. శ్రీలంకలో ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణలకు నూరేళ్లకు పైగా నేపథ్యం ఉంది. మత కల్లోలాలకు కేంద్రస్థానంగా నిలిచిన మధ్య శ్రీలంక నగరం కాండీ సింహళ బౌద్ధులకు పుణ్యస్థలం. 1915లో మొదటిసారి దేశంలో ముస్లింలకూ, మెజారిటీ బౌద్ధులకు మధ్య భారీ స్థాయిలో ఘర్షణలు జరిగాయి. రెండు కోట్ల పది లక్షల జనాభా ఉన్న ఈ ద్వీపంలో 70 శాతానికి పైగా సింహళ బౌద్ధులుండగా, ముస్లింల సంఖ్య పది శాతం. బౌద్ధ జాతీయవాదం శ్రీలంకలో బౌద్ధమత ఆధిపత్యం సాధించడానికి జరిగిన ప్రయత్నాల్లో మొదటి నుంచీ ప్రధాన పాత్ర పోషించింది బౌద్ధ సన్యాసులే. ఐరోపా వలస పాలకులు, క్రైస్తవ మత ప్రచారకులు శ్రీలంక ఉనికిని, రూపురేఖలను మార్చేస్తారనే భయాందోళనలు 19వ శతాబ్దంలో వ్యాపించాయి. బౌద్ధ భిక్షువులు థేరవాద బౌద్ధధర్మం పునరుద్ధరణకు నడుంబిగించారు. తర్వాత దేశంలో ఇంగ్లిష్‌కు బదులు సింహళాన్నే ప్రధాన భాషగా చేయాలనే ఉద్యమం మొదలైంది. ఫలితంగా బౌద్ధ జాతీయవాదం బలపడింది. దేశానికి 1948లో స్వాతంత్య్రం వచ్చాక రాజ్యాంగంలో బౌద్ధ ధర్మానికి ప్రత్యేక స్థానం కల్పించారు. గత పదేళ్లలో రాజకీయ పంథాను ఎంచుకున్న బౌద్ధ సన్యాసులు ముస్లింలను లక్ష్యంగా చేసుకుని విద్వేష ప్రచారం సాగిస్తున్నారు. కొన్ని నెలలుగా దేశంలో ముస్లింలతో ఘర్షణ పడుతున్న బౌద్ధ తీవ్రవాద సంస్థ బోడు బాల సేన (బీబీఎస్) కాండీ నగరంలో ముస్లిం వ్యతిరేక ప్రచారంతో మత ఉద్రిక్తలకు కారణమైంది. బాల సేన చేసిన ముస్లిం వ్యతిరేక ప్రచారం ఫలితంగా 2014లో దేశ నైరుతి ప్రాంతంలోని కాలుతారా జిల్లాలోని నాలుగు పట్టణాల్లో బౌద్ధులకూ, ముస్లింలకు మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ దాడుల్లో నలుగురు మరణించగా, 80 మంది గాయపడ్డారు. ముస్లింల దుకాణాలు, ఇళ్లు, వ్యాపార సంస్థలపై దాడులు జరిగాయి. కిందటి జూన్‌లో, తర్వాత నవంబర్‌లో దక్షిణ కోస్తా పట్టణం గింతోటాలో సామాజిక మాధ్యమాల ద్వారా విస్తరించిన పుకార్ల ఫలితంగా రెండు వర్గాల మధ్య కొట్లాటలు జరిగాయి. మయన్మార్నుంచి సైనికులు, బౌద్ధ మత తీవ్రవాదుల వేధింపులు తట్టకోలేక శ్రీలంకకు శరణార్థులుగా వచ్చిన రొహింగ్యా ముస్లింలకు ఈ ప్రాంతంలో ఆశ్రయం కల్పించడాన్ని బీబీఎస్వ్యతిరేకిస్తోంది. కొంతకాలం క్రితం ఐక్యరాజ్యసమితి కొలంబోలో రొహింగ్యాల కోసం నడుపుతున్న సహాయ కేంద్రంపై బౌద్ధ సన్యాసులు దాడిచేశారు. కొలంబోలో బాల సేన స్థాపన రాజధాని కొలంబోలోని సంబుద్ధ జయంతి మందిర అనే బౌద్ధ సాంస్కృతిక కేంద్రం నుంచి పనిచేస్తున్న బోడు బాల సేనను 2012లో కిరమా విమలజోతి, గలగోద అత్తే జ్ఞానసార అనే ఇద్దరు బౌద్ధ భిక్షువులు స్థాపించారు. దేశంలో సింహళ జాతిని, బౌద్ధ ధర్మాన్ని కాపాడడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు సేన ప్రచారం చేస్తోంది.బురఖాలు ధరించడం లంక ముస్లిం మహిళల్లో కొత్త సంప్రదాయంగా మారింది. దాదాపు 20 లక్షల మంది ముస్లింలు పశ్చిమాసియా దేశాల్లో పనిచేస్తున్న కారణంగా వారి ఆదాయాలు చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగాయి. గతంలో లేని ముస్లిం వేషధారణ కనిపించడంతో బీబీఎస్వంటి బౌద్ధ తీవ్రవాద సంస్థలు బురఖాలు నిషేధించాలంటూ ఉద్యమిస్తున్నాయి. - సాక్షి నాలెడ్జ్సెంటర్ -
సాగర్‌లో బౌద్ధ మతస్థుల సందడి
నాగార్జునసాగర్: అంతర్జాతీయ బౌద్ధ వారసత్వ ఉత్సవాల్లో భాగంగా శనివారం నాగార్జున సాగర్ కు బౌద్ధ మతస్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. 17 దేశాలకు చెందిన ముప్పై మంది బౌద్ధ బిక్ష్యవులు ఈరోజు సాగర్‌ను సందర్శించారు. స్థానిక బుద్ధభవనం, నాగార్జున కొండను సందర్శించుకొని తన్మయత్వానికి గురయ్యారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పర్యాటక కార్యక్రమాలను కొనియాడారు. -
నాగార్జున కొండను సందర్శించిన శ్రీలంక బౌద్ధులు
గుంటూరు: శ్రీలంకకి చెందిన 48మంది, కాశ్మీర్‌లోని లడాక్‌కు చెందిన 8మంది బౌద్ధుల బృందం నాగార్జునకొండను శనివారం సందర్శించింది. వీరు కొండపై ఉన్న మ్యూజియంలోని పురాతన శిలాఫలకాలను, లోహపు పాత్రలను, బుద్ధుని కాలం నాటి పాలరాతి విగ్రహాన్ని ఆసక్తిగా తిలకించారు. వివిధ విభాగాల్లోని మ్యూజియంలో రాతిబండలపై చెక్కి ఉన్న కళారూపాలను ఆసక్తిగా వీక్షించారు. కొండపై దలైలామా నాటిన బోధి మొక్క వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత పునర్నిర్మిత మహాస్థూపం, స్నానఘట్టం, ఆశ్వమేధ యజ్ఞశాలను చూశారు. -
బుద్ధం శరణం గచ్చామి
బుద్ధుడు అక్కడ తనను తాను శోధించుకున్నాడు. శరీరాన్ని శుష్కింపచేసుకున్నాడు. దాని వల్ల ఫలితం లేదని గ్రహించాడు. చివరకు జ్ఞానోదయమై అష్టాంగ మార్గాన్ని ప్రతిపాదించాడు. అదే బుద్ధ గయ. గయకు అతి సమీపంలో ఉన్న ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం. బుద్ధగయ, సారనాథ్, కుశీనగర్, లుంబిని ఈ నాలుగూ బుద్ధుడు జీవించిన ప్రదేశాలు. కనుక ఇవి బౌద్ధులకు పవిత్రమైన స్థలాలు. వీటిలో గయ- బుద్ధుడికి జ్ఞానోదయం కలిగించిన చోటు. బోధిచెట్టు కింద జ్ఞానోదయం కలిగింది కాబట్టి ఆ ప్రాంతం ‘బుద్ధగయ’ అయ్యింది. అందుకే బౌద్ధులు ఈ ప్రాంతాన్ని జ్ఞానం పెంపొందించుకునే ప్రదేశంగా, పవిత్రస్థలిగా భావిస్తారు. హిందువులకు ప్రయాగ, కురుక్షేత్రం, కాశీతో పాటు గయ కూడా పుణ్యక్షేత్రమే. ఈ క్షేత్రాలను జీవితంలో ఒక్కసారైనా దర్శిస్తే ముక్తి కలుగుతుందని ప్రతీతి. ప్రయాగలో శిరోముండనం చేయించుకుని, కురుక్షేత్రంలో తర్పణం వదిలి, గయలో పిండప్రాదానం చేసి, కాశీలో ప్రాణత్యాగం చేయడం వల్ల జన్మరాహిత్యం కలుగుతుందని పురాణ ప్రతీతి. పితృదేవతారాధనకు, పిండప్రదానాలకు ప్రసిద్ధి చెందినది గయ. ఆ విధంగా అటు బౌద్ధులకు, ఇటు హిందువులకు పరమపవిత్రమైంది. గయ బీహార్‌లోని గయ జిల్లాలో ఉంది. పాట్నా నుండి 100 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాద్ నుంచి సుమారు 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్షేత్రం ఇది. ప్రశాంతతకు నెలవు బోధ్‌గయ గయ మగధ సామ్రాజ్యంలో ఒక భాగం. పాటలీపుత్రను రాజధానిగా చేసుకుని మౌర్యులు ఈ సామాజ్య్రాన్ని పాలించారు. వీరి కాలంలో నలందా విశ్వవిద్యాలయం ప్రజలను విజ్ఞానవంతులను చేయడంలో ముందున్నది. ఇప్పటికీ ఇక్కడ గల 108 విహారాలలో 10 వేల మంది బౌద్ధసన్యాసులు, 2 వేల మంది అధ్యాపకులు ఉన్నారు. అసలు ‘బీహార్’ అన్న పేరే ‘విహార్’ నుంచి వచ్చింది. బౌద్ధ విహారాల తావు బీహార్. వీటిలో శ్రేష్టమైనదిగా గయకు 11 కిలోమీటర్ల బోధ్‌గయ ఉంది. ఇక్కడే మహాబోధ పేరుతో గౌతమబుద్ధుడి ఆలయం ఉంది. ఈ ఆలయం అత్యంత ప్రాచీనమైనదిగా ప్రపంచ వారసత్వ సంపదలలో ఒకటిగా యునెస్కో ప్రకటించింది. ఆ విధంగా ఈ చారిత్రక కట్టడాన్ని కనులారా దర్శించాలని చాలా మంది పర్యాటకులు ఉత్సుకత చూపిస్తారు. ఇక్కడ బౌద్ధ సన్యాసులు ఎక్కువ. మన పొరుగు దేశాలైన భూటాన్, బంగ్లాదేశ్, చైనా, జపాన్, మయన్మార్, శ్రీలంక, థాయ్‌లాండ్, టిబెట్ నుంచి ఎక్కువగా వస్తూ ముదురు ఎరుపువస్త్రాలు ధరించి వేల సంఖ్యలో ప్రార్థనలు జరుపుతారు. వీరి కోసం నడిచే ప్రత్యేక సంస్థల విడిది కేంద్రాలలో బయట వారికి కూడా గదులు దొరుకుతాయి. కాని వాటిలో జంతు హింస నిషిద్ధం కనుక మస్కిటోకాయిల్స్ వంటివి కూడా వాడకూడదు. దోమతెరలు ఉంటాయి. వాటినే ఉపయోగించాలి. అనువైన కాలం ఏ కాలంలోనైనా ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చు. అయితే డిసెంబర్ నుంచి మార్చి మధ్యలో ఇంకా బాగుంటుంది. ఆ సమయంలో బోధిగయను మన దేశస్తులే కాకుండా విదేశాల నుంచి బౌద్ధ సన్యాసులు చాలామంది సందర్శిస్తుంటారు. అన్నిరకాల భాషలోనూ ఇక్కడ ప్రార్థనలు జరుపుతారు. - స్వజన్, ఇండియా టూరిజమ్, భువనేశ్వర్ చేయాల్సినవి ►బౌద్ధారామాలను సందర్శిస్తూ నాటి చారిత్రకవైభవాన్ని తెలుసుకోవచ్చు. ►షాపింగ్ చేయాలంటే ఇక్కడి స్థానిక కుందన్ బజార్లో వస్తువులు సరసమైన ధరలకు లభిస్తాయి. ►పిండప్రదానాలకు ప్రతీతి. ►ఆలయాలు, ఆరామాలు సందర్శనకు చెప్పులు, షూస్ వేసుకెళ్లవద్దు. ►అక్కడి ప్రశాంతతను చెడగొట్టవద్దు. ►స్థూపాలను, కొండల్లాంటి ప్రదేశాలను ఎక్కకూడదు. ఇలా చేరుకోవచ్చు బోధ్‌గయను దేశంలోని ముఖ్యపట్టణాల నుంచి రైలు, రోడ్డు, విమాన మార్గాల ద్వారా చేరుకోవచ్చు. ఇది బీహార్ రాజధాని పాట్నాకు 110 కిలోమీటర్ల దూరం ఉంది. బీహార్ రాష్ట్ర పర్యాటకశాఖ ఇక్కడకు పాట్నా నుంచి మెర్సిడెస్ బెంజ్ బస్సు సదుపాయాలను కల్పిస్తోంది. పాట్నా నుంచి బోధ్గయకు 2 గంటలలో చేరుకోవచ్చు. ట్యాక్సీ సదుపాయాలు కూడా ఉన్నాయి. గయలో రైల్వే స్టేషన్ ఉంది. ఈ స్టేషన్ నుంచి బోధ్‌గయ 16 కి.మీ దూరం. ఆటోలు విస్తారం. విమానమార్గం: బోధ్‌గయలోనే అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇక్కడ నుంచి శ్రీలంక, జపాన్, చైనా, నేపాల్, మయన్మార్, థాయ్‌లాండ్, ఇతర దేశాలకు రాకపోకలు ఉన్నాయి. అలాగే పాట్నా ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ఇక్కడ నుంచి డొమెస్టిక్ ఫ్లైట్ల ద్వారా గయ చేరుకోవచ్చు. రాంచీ ఎయిర్పోర్ట్ నుంచి ఆరు గంటల ప్రయాణం. -
తొలి సాంఘిక తెలుగు కావ్యం బసవ పురాణం
పూర్వ సాహిత్యం తెలుగువారి సాంస్కృతిక చరిత్రలో పాల్కురికి సోమనాథుడు సాధించ ప్రయత్నించిన సంస్కరణ చాలా ప్రభావపూరితమైనది. శక్తిమంతమైనది. బసవేశ్వరుని చరిత్రను పురాణంగా నిర్మించిన ప్రథమాంధ్ర వీరశైవ కవిగా మాత్రమే కాక సామాజిక స్పృహతో సాహిత్యాన్ని సృష్టించిన భక్తి ఉద్యమకవిగా తెలంగాణ కవిగా కూడా అతడి స్థానం విశిష్టమైనది. పాల్కురికి (1160-1240) ‘శివకవి త్రయం’ అనబడే ముగ్గురు కవుల్లో మల్లికార్జున పండితారాధ్యుడు, నన్నెచోడుడుల కంటే కూడా ప్రధానమైనవాడు. వీరశైవాన్ని ప్రచారం చేసిన కవుల్లో ప్రథముడు. పాల్కురికి కాలానికి సాంస్కృతికంగా బౌద్ధం, జైనం బలహీన స్థితిలో ఉన్నాయి. జైనులు, బౌద్ధులు రంగం నుంచి తప్పుకున్న తర్వాత బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ఎదిరించే కర్తవ్యాన్ని అందుకొని వీరశైవం ముందుకు వచ్చింది. ఇందుకు కర్నాటకలో కూడలి సంగమ క్షేత్రాన్ని స్థావరంగా చేసుకొని వీరశైవాన్ని ప్రచారం చేసిన బసవేశ్వరుడు (1134-1196) మూలపురుషుడిగా నిలిచాడు. బ్రాహ్మణుల ఇంట జన్మించిన బసవేశ్వరుడు బాల్యంలోనే వైదిక క్రతువులను, పుట్టుక ఆధారంగా మనుషులకు సిద్ధం చేసి పెట్టిన వివక్షను ఏవగించుకున్నాడు. ‘మనుషులంతా ఒక్కటే. కులాలు ఉపకులాలు లేవు’ అని ఆయన చేసిన తిరుగుబాటు ప్రజల గుండెలను తాకి ప్రతిధ్వనించడమే కాక తెలుగు నేలకి కూడా చేరి వరంగల్లు ప్రాంతంలో ఉన్న పాల్కురికి సోమనాథుడిని ప్రభావితం చేసింది. ఆయన బసవేశ్వరుడ్ని రెండవ శంకరుడన్నాడు. ఆ ఆరాధనతో బసవన్న కథను బసవపురాణం పేరుతో తెలుగులో మొట్టమొదటి దేశిపురాణంగా లిఖించాడు. బసవపురాణం- పురాణం మాత్రమేకాక ఏడు అశ్వాసాల స్వతంత్ర చారిత్రక కావ్యం కూడా. భక్తిరసం, వీరరసం ఇందులో ప్రధానమైనవి. బసవని అవతరణం, సంస్కారోత్సవాలు, ప్రబోధాలు, లింగైక్యం అనే ముఖ్య అశ్వాసాల్లో మనం తెలుసుకోవాల్సిన చరిత్ర కనిపిస్తుంది. నడుమ భక్తజన కథలు ఉంటాయి. పాల్కురికి వర్ణించిన భక్తుల్లో శిశుభక్తులు, స్త్రీ భక్తులు, ముగ్ధభక్తులు, మొండి భక్తులు, ప్రౌఢభక్తులు ఉన్నారు. వీరిలో వివిధ వర్ణాలకు చెందిన వారు ఉన్నారు. బసవనికి సమకాలికులైన అల్లమ ప్రభు, మడివాలు మాచయ్య, సిద్ధరామయ్య వంటి అనేకులున్నారు. రుద్ర పశుపతి, గొడగూచి, బెజ్జ మహాదేవి వంటి ముగ్ధభక్తులు ఉన్నారు. వీరశైవం ప్రబోధించి ఆచరించిన స్త్రీ పురుష సమానత్వాన్ని, కులరాహిత్యాన్ని పాల్కురికి తన రచనలో తీక్షణంగా చిత్రిక పట్టి ఆ దిశలో సంస్కరణ కోసం గట్టిగా కృషి చేశాడు. పాల్కురికి సామాజిక దృక్పథంలో ద్యోతకమయ్యే సంఘ సంస్కరణాభిలాష బసవేశ్వరుడు చెప్పిందే. బసవేశ్వరుడు ప్రతిపాదించిన విధుల్లో ముఖ్యమైనవి- వర్ణాశ్రమ ధర్మాల మీద తిరుగుబాటు; జంగమాపూజకు ప్రాధాన్యం; స్త్రీలకి పురుషులతో సమానంగా మోక్షసాధన మార్గాన్ని ఎన్నుకొనే స్వేచ్ఛ; స్థావర మూర్తుల పూజపట్ల వైముఖ్యం... జంగమ పూజకు ప్రాధాన్యం; పుట్టుక కారణంగా సంక్రమించిన అస్పృశ్యతని ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకించడం; సమానత్వాన్ని పాటించడం; పంచవిధ సూతకాలలో నాలుగింటిని కూడా తిరస్కరించడం (ఇవి పురుడు, ఉచ్చిష్టం, బహిష్టూ, చావు సందర్భాలలో పాటించే అశౌచాలు); ఉపనయన సంస్కారాన్ని తిరస్కరించడం; మరణించినవారికి చేసే శ్రాద్ధ కర్మల నిరసన; మద్యమాంసాల విసర్జన.... పాల్కురికి తన కావ్యంలో ఈ విధివిధానాలకి అత్యంత ప్రాధాన్యం ఇచ్చాడు. ఉదాహరణకి సిరియాళుడి కథలో శివుడు హలాయుధునితో సంవాదం చేస్తూ సుతుని చంపి ఆ మాంసంతో విందు చేశానని అంటే హలాయుధుడు వెటకారంగా- ‘శివ! శివ! యిది యేమి చెప్పెదవయ్య శివుడేమి నరుల భక్షింప రక్కసుడె? శిశువు సద్భక్తుని సిరియాళునంబి పశువరింపగ జంపభక్తి హీనుండె?!’ ఇది మాంసాహార విసర్జన అనే నిబంధనని గాఢంగా ప్రజల్లో నాటడానికి చెప్పిన విషయమని అర్థమవుతూనే ఉంది. బసవేశ్వరుడి ప్రబోధాలకు అనుగుణంగా ‘ఎట్టి దుర్గతిని బుట్టిననేమి యెట్లును శివభక్తుడిల పవిత్రుండు’ అన్నాడు. మత ప్రచారానికి సంస్కృత భాష వాడాలనే ఆచారాన్ని సోమనాథుడు బద్దలు కొట్టాడు. నన్నయ భారతాంధ్రీకరణలో అధిక శాతం సంస్కృత పదాలు కనిపిస్తే అందుకు పూర్తి విరుద్ధంగా పాల్కురికి బసవపురాణంలో దేశీ ఛందస్సు, నానుడులు, జాతీయాలు, పలుకుబళ్లు ప్రాధాన్యం వహిస్తాయి. ద్విపద, రగడలే కాకుండా సోమనాథుడు ఇంకా సీసం, త్రిభంగి, తరువోజ, క్రౌంచ పదం, మయూరం, చతుర్విధ కందం, తిపాస కందం వంటి స్థానిక ఛందోరీతుల ప్రయోగం చేశాడు. ‘రగడ’ అనే ఛందోరీతిని సోమనాథుడే ప్రారంభించాడు. సీస పద్యాల్లో సోమన ప్రయోగం చేశాడు. శ్రీనాథుడికి సీస పద్య రచనలో మార్గదర్శనం చేసింది సోమన సీస పద్యాలే. అలాగే బద్దెన సుమతీ శతకం కంద పద్యాలకు మార్గం చూపింది సోమనాథుడి కంద పద్యాలే. భాషలో, పద ప్రయోగాల్లో సోమనాథుడు స్వేచ్ఛగా ప్రయోగాలు చేశాడు. వైరి సమాసాలు విరివిగా వాడాడు. వస్తువు మారినప్పుడు శైలి విధానాలు కూడా మారుతాయని చెప్పడానికి బసవపురాణం మంచి ఉదాహరణ. అయితే సోమనాథుడి బసవపురాణానికి ముందు ఛందశ్శాస్త్రం ఏదీ లేదని, అతని రచన తర్వాత వచ్చిన ఛందశ్శాస్త్రాలతో దాన్ని బేరీజు వేయడం తగదని అంటారు. పాల్కురికి వాడిన మాటలు గమనించదగ్గవి. గ్రూపులు కట్టడాన్ని గుంపిడటం, తక్కువగా గౌరవించటాన్ని సోల, చాలాకొద్ది సమయాన్ని గోరంతపొద్దు అన్నాడు. ఇక అసాధ్యం అనడానికి ‘కుంచాలతో మంచు కొలవటం’ అనే చక్కని జాతీయాన్ని ప్రయోగిస్తాడు. పుష్పవిల్లు, భూమితీరు, వేడి పయోధార వంటి ప్రయోగాలు అలవోకగా చేసినట్టుగా కనిపిస్తాయి. ప్రజలకు సూటిగా తన భావాలను ప్రసరింపజేయడానికి అనువైన శైలి, అభివ్యక్తి తీరుతెన్నులను సోమనాథుడు ఎంచుకున్నాడు. అదే సమయంలో సృజనాత్మకతకు పట్టం కట్టాడు. ఆ రకంగా పాల్కురికి సోమనాథుడు కావ్యగౌరవం కలిగిన బసవపురాణాన్ని ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా రచించి ప్రజాకవిగా నిలిచాడు. తెలంగాణలోని ఎక్కువ శూద్రకులాలు శైవ మతాన్ని ఆలింగనం చేసుకున్నారని చెప్పడానికి అనువైన పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయి. ఆ రకంగా సామాజిక విప్లవకారుడిగా సోమనాథుడు కనిపిస్తాడు. బసవపురాణం తెలుగు సమాజంలో సంఘసంస్కరణోద్యమ గ్రంథంగా నిలిచిపోతుంది. - కాసుల ప్రతాపరెడ్డి (ఇటీవల మెదక్ జిల్లా జోగిపేట డిగ్రీ కళాశాలలో పాల్కురికి సోమనాథుడిపై జరిగిన సదస్సులో సమర్పించిన పత్రంలో కొంత భాగం)