బుద్ధం శరణం గచ్చామి
బుద్ధుడు అక్కడ తనను తాను శోధించుకున్నాడు.
శరీరాన్ని శుష్కింపచేసుకున్నాడు. దాని వల్ల ఫలితం లేదని గ్రహించాడు.
చివరకు జ్ఞానోదయమై అష్టాంగ మార్గాన్ని ప్రతిపాదించాడు.
అదే బుద్ధ గయ. గయకు అతి సమీపంలో ఉన్న ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం.
బుద్ధగయ, సారనాథ్, కుశీనగర్, లుంబిని ఈ నాలుగూ బుద్ధుడు జీవించిన ప్రదేశాలు. కనుక ఇవి బౌద్ధులకు పవిత్రమైన స్థలాలు. వీటిలో గయ- బుద్ధుడికి జ్ఞానోదయం కలిగించిన చోటు. బోధిచెట్టు కింద జ్ఞానోదయం కలిగింది కాబట్టి ఆ ప్రాంతం ‘బుద్ధగయ’ అయ్యింది. అందుకే బౌద్ధులు ఈ ప్రాంతాన్ని జ్ఞానం పెంపొందించుకునే ప్రదేశంగా, పవిత్రస్థలిగా భావిస్తారు.
హిందువులకు ప్రయాగ, కురుక్షేత్రం, కాశీతో పాటు గయ కూడా పుణ్యక్షేత్రమే. ఈ క్షేత్రాలను జీవితంలో ఒక్కసారైనా దర్శిస్తే ముక్తి కలుగుతుందని ప్రతీతి. ప్రయాగలో శిరోముండనం చేయించుకుని, కురుక్షేత్రంలో తర్పణం వదిలి, గయలో పిండప్రాదానం చేసి, కాశీలో ప్రాణత్యాగం చేయడం వల్ల జన్మరాహిత్యం కలుగుతుందని పురాణ ప్రతీతి. పితృదేవతారాధనకు, పిండప్రదానాలకు ప్రసిద్ధి చెందినది గయ. ఆ విధంగా అటు బౌద్ధులకు, ఇటు హిందువులకు పరమపవిత్రమైంది. గయ బీహార్‌లోని గయ జిల్లాలో ఉంది. పాట్నా నుండి 100 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాద్ నుంచి సుమారు 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్షేత్రం ఇది.
ప్రశాంతతకు నెలవు బోధ్‌గయ
గయ మగధ సామ్రాజ్యంలో ఒక భాగం. పాటలీపుత్రను రాజధానిగా చేసుకుని మౌర్యులు ఈ సామాజ్య్రాన్ని పాలించారు. వీరి కాలంలో నలందా విశ్వవిద్యాలయం ప్రజలను విజ్ఞానవంతులను చేయడంలో ముందున్నది. ఇప్పటికీ ఇక్కడ గల 108 విహారాలలో 10 వేల మంది బౌద్ధసన్యాసులు, 2 వేల మంది అధ్యాపకులు ఉన్నారు. అసలు ‘బీహార్’ అన్న పేరే ‘విహార్’ నుంచి వచ్చింది. బౌద్ధ విహారాల తావు బీహార్. వీటిలో శ్రేష్టమైనదిగా గయకు 11 కిలోమీటర్ల బోధ్‌గయ ఉంది. ఇక్కడే మహాబోధ పేరుతో గౌతమబుద్ధుడి ఆలయం ఉంది. ఈ ఆలయం అత్యంత ప్రాచీనమైనదిగా ప్రపంచ వారసత్వ సంపదలలో ఒకటిగా యునెస్కో ప్రకటించింది. ఆ విధంగా ఈ చారిత్రక కట్టడాన్ని కనులారా దర్శించాలని చాలా మంది పర్యాటకులు ఉత్సుకత చూపిస్తారు. ఇక్కడ బౌద్ధ సన్యాసులు ఎక్కువ. మన పొరుగు దేశాలైన భూటాన్, బంగ్లాదేశ్, చైనా, జపాన్, మయన్మార్, శ్రీలంక, థాయ్‌లాండ్, టిబెట్ నుంచి ఎక్కువగా వస్తూ ముదురు ఎరుపువస్త్రాలు ధరించి వేల సంఖ్యలో ప్రార్థనలు జరుపుతారు. వీరి కోసం నడిచే ప్రత్యేక సంస్థల విడిది కేంద్రాలలో బయట వారికి కూడా గదులు దొరుకుతాయి. కాని వాటిలో జంతు హింస నిషిద్ధం కనుక మస్కిటోకాయిల్స్ వంటివి కూడా వాడకూడదు. దోమతెరలు ఉంటాయి. వాటినే ఉపయోగించాలి.
అనువైన కాలం
ఏ కాలంలోనైనా ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చు. అయితే డిసెంబర్ నుంచి మార్చి మధ్యలో ఇంకా బాగుంటుంది. ఆ సమయంలో బోధిగయను మన దేశస్తులే కాకుండా విదేశాల నుంచి బౌద్ధ సన్యాసులు చాలామంది సందర్శిస్తుంటారు. అన్నిరకాల భాషలోనూ ఇక్కడ ప్రార్థనలు జరుపుతారు.
- స్వజన్, ఇండియా టూరిజమ్, భువనేశ్వర్
చేయాల్సినవి
►బౌద్ధారామాలను సందర్శిస్తూ నాటి చారిత్రకవైభవాన్ని తెలుసుకోవచ్చు.
►షాపింగ్ చేయాలంటే ఇక్కడి స్థానిక కుందన్ బజార్‌లో వస్తువులు సరసమైన ధరలకు లభిస్తాయి.
►పిండప్రదానాలకు ప్రతీతి.
►ఆలయాలు, ఆరామాలు సందర్శనకు చెప్పులు, షూస్ వేసుకెళ్లవద్దు.
►అక్కడి ప్రశాంతతను చెడగొట్టవద్దు.
►స్థూపాలను, కొండల్లాంటి ప్రదేశాలను ఎక్కకూడదు.
ఇలా చేరుకోవచ్చు
బోధ్‌గయను దేశంలోని ముఖ్యపట్టణాల నుంచి రైలు, రోడ్డు, విమాన మార్గాల ద్వారా చేరుకోవచ్చు. ఇది బీహార్ రాజధాని పాట్నాకు 110 కిలోమీటర్ల దూరం ఉంది. బీహార్ రాష్ట్ర పర్యాటకశాఖ ఇక్కడకు పాట్నా నుంచి మెర్సిడెస్ బెంజ్ బస్సు సదుపాయాలను కల్పిస్తోంది. పాట్నా నుంచి బోధ్‌గయకు 2 గంటలలో చేరుకోవచ్చు. ట్యాక్సీ సదుపాయాలు కూడా ఉన్నాయి. గయలో రైల్వే స్టేషన్ ఉంది. ఈ స్టేషన్ నుంచి బోధ్‌గయ 16 కి.మీ దూరం. ఆటోలు విస్తారం.
విమానమార్గం: బోధ్‌గయలోనే అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇక్కడ నుంచి శ్రీలంక, జపాన్, చైనా, నేపాల్, మయన్మార్, థాయ్‌లాండ్, ఇతర దేశాలకు రాకపోకలు ఉన్నాయి. అలాగే పాట్నా ఎయిర్‌పోర్ట్ కూడా ఉంది. ఇక్కడ నుంచి డొమెస్టిక్ ఫ్లైట్ల ద్వారా గయ చేరుకోవచ్చు. రాంచీ ఎయిర్‌పోర్ట్ నుంచి ఆరు గంటల ప్రయాణం.