ఏటీఎం నుంచి నకిలీ కొత్త కరెన్సీ నోటు!
ఏటీఎం నుంచి నకిలీ కొత్త కరెన్సీ నోటు!
Published Wed, Dec 14 2016 5:57 PM | Last Updated on Mon, Sep 4 2017 10:44 PM
పాట్నా: నకిలీ నోట్లను, బ్లాక్మనీని నిర్మూలిస్తామంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన పాత నోట్ల రద్దు ప్రక్రియ ఏ మేరకు అనుకున్న లక్ష్యాన్ని చేధించగలదనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందేహాలకు ఆజ్యం పోస్తూ భారీ మొత్తంలో కొత్త కరెన్సీ నోట్లు ఐటీ రైడ్స్లో దొరకడం, అక్కడక్కడా నకిలీ కొత్త నోట్లు వెలుగులోకి రావడం జరుగుతోంది. తాజాగా స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఏటీఎం నుంచి నకిలీ కొత్త రూ.2000 కరెన్సీ నోటు బయటికి వచ్చినట్టు తెలిసింది. ఎస్బీఐ ఏటీఎంలో నగదు డ్రా చేసుకున్న సీతామహ్రి జిల్లా లంగ్మా ప్రాంతానికి చెందిన పంకజ్ కుమార్ అనే వ్యవసాయదారుడికి అచ్చం ఒరిజినల్ నోటు మాదిరి నకిలీ కొత్త రూ.2000 నోట్లు డ్రా అయినట్టు తెలిసింది. వేరే వ్యక్తికి ఈ నోటును అందించినప్పుడు ఇది నకిలీ నోటని అతను తిరస్కరించడంతో ఆశ్చర్యానికి గురైనట్టు పంకజ్ తెలిపాడు.
వెంటనే మంగళవారం బ్యాంకుకి వెళ్లి ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నాడు. అదేవిధంగా డుమ్రా పోలీసు స్టేషన్లోనూ దీనిపై ఫిర్యాదుచేసినట్టు చెప్పాడు. పంకజ్ ఫిర్యాదు మేరకు దీనిపై విచారణ కొనసాగిస్తున్నామని డుమ్రా పీఎస్ విజయ్ బహదూర్ సింగ్ తెలిపారు. ఎక్కడైతే పంకజ్ నకిలీ నోటు విత్డ్రా చేసుకున్నాడో ఆ ఏటీఎం ఖజానా ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తుందని ఎస్బీఐ చీఫ్ మేనేజర్ సుధాంశు కుమార్ రావు తెలిపారు. ఏటిఎం ఖజానా లోపల కరెన్సీని ప్రైవేట్ సంస్థ అధికారులు సమక్షంలో బ్యాంకు అధికారులు తనిఖీ చేస్తారని ఆయన చెప్పారు. ఆ సమయంలోనే వాటికి సీల్ కూడా వేస్తామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏటీఎం నుంచి నకిలీ నోటు విత్డ్రా అయ్యేందుకు ఆస్కారం ఉండదని పేర్కొంటూ ఈ విషయాన్ని రావు తోసిపుచ్చారు.
Advertisement
Advertisement