హైదరాబాద్: తపాలా కార్యాలయాల్లోనూ ఏటీఎంలు అందుబాటులోకి వచ్చా యి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)- పోస్టల్ శాఖ సంయుక్తంగా పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) ప్రాజెక్టు పేరుతో చోటా ఏటిఏంలను తపాలా కార్యాలయాల్లో ఏర్పాటు చేసింది. సాధారణ ఏటీఎంల తరహాలోనే అన్ని బ్యాంకుల డెబిట్ కార్డులు ఇందులో చెల్లుబాటవుతాయి. ఏటీఎంలు అందుబాటులో లేని గ్రామీణ ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా ఉపయోగపడే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా 108 తపాలా కార్యాలయాల్లో చోటా ఏటీఎం సర్వీసులను ప్రారంభించిన పోస్టల్ డిపార్ట్‌మెంట్ మరో 2,467 చోట్ల వీటిని ప్రారంభిస్తోంది. తురంత్ (వెంటనే) పేరుతో పిలిచే ఈ కొత్త విధానాన్ని హైదరాబాద్ అబిడ్స్‌లోని జీపీఓలో తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ సుధాకర్, ఎస్‌బీఐ డిప్యూటీ ఎండీ సీఆర్ శశి కుమార్‌లు శనివారం ప్రారంభించారు.
రూ.100 నుంచి రూ.1,000 వరకు...
సాధారణ ఏటీఎంలా కాకుండా కార్డు స్వైపింగ్ ద్వారా ఈ చోటా ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. నిర్ధారిత తపాలా కార్యాలయంలో హ్యాండ్ హెల్డ్ కంప్యూటర్ తరహాలో చేతిలో ఇమిడిపోయే చిన్న యంత్రం ఉంటుంది. అందులో బ్యాంకు డెబిట్ కార్డు స్వైప్ చేసే వెసులుబాటు ఉంటుంది. కార్డు స్వైప్ చేసి డ్రా చేసుకోవాల్సిన డబ్బు వివరాలను అందులో నమోదు చేస్తే అక్కడి సిబ్బంది అంతమొత్తం అందజేస్తారు. ఈ విధానం ద్వారా రోజుకు గరిష్టంగా 1,000 వరకు డ్రా చేసుకోవచ్చు.
తపాలా కార్యాలయాల్లో చోటా ఏటీఎంలు
Published Sun, Jul 5 2015 12:40 AM | Last Updated on Tue, Sep 18 2018 8:18 PM
Advertisement