ముంబై: పట్టణ ప్రాంతాల్లో ఖాతాదారులు బ్యాంకింగ్ లావాదేవీల కోసం డిజిటల్ విధానాలవైపు మళ్లుతుండటంతో ఏటీఎంలు, బ్యాంకు శాఖల అవసరం క్రమంగా తగ్గుతోంది. దీంతో పభ్రుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ) కూడా వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా వీటిని తగ్గించుకోవడంపై దృష్టి పెడుతున్నాయి. ఏటీఎంలు, శాఖల ఏర్పాటు, నిర్వహణ భారం తడిసి మోపెడవుతుండటం ఇందుకు కారణం. గడిచిన ఏడాది కాలంలో టాప్ 10 ప్రభుత్వ రంగ బ్యాంకులు సుమారు 5,500 ఏటీఎంలు, 600 పైచిలుకు శాఖలను మూసివేసినట్లు ఆయా బ్యాంకుల త్రైమాసిక ఆర్థిక ఫలితాల నివేదికల ద్వారా తెలుస్తోంది. ఓవైపు పెరిగిపోతున్న మొండిబాకీలు, మరోవైపు రుణ వృద్ధి లేకపోవడం వంటి అంశాలతో లాభాలు సాధించడానికి పీఎస్‌బీలు నానా తంటాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
అత్యధికంగా ఎస్‌బీఐ..
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాŠంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) గతేడాది జూన్ నుంచి ఈ ఏడాది జూన్ మధ్య కాలంలో 420 శాఖలు, 768 ఏటీఎంలను మూసివేసింది. ఇక విలీనమైన బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయా, దేనా బ్యాంక్‌లు ఇదే వ్యవధిలో మొత్తం 40 శాఖలు, 274 ఏటీఎంలను మూసివేశాయి. ఇలా బ్రాంచీలను, ఏటీఎంలను తగ్గించుకున్న పీఎస్‌బీల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్ మొదలైనవి కూడా ఉన్నాయి. పది బ్యాంకుల్లో తొమ్మిది బ్యాంకులు ఏటీఎంలను తగ్గించుకోగా, ఆరు బ్యాంకులు శాఖలను కూడా తగ్గించుకున్నాయి. ఈ వ్యవధిలో ఒక్క ఇండియన్ బ్యాంక్ మాత్రమే ఏటీఎంలు, శాఖల నెట్‌వర్క్‌ను పెంచుకున్నట్లు తెలుస్తోంది.
ఎక్కువగా..నగరాల్లోనే...:
మూసివేతల ధోరణి ఎక్కువగా నగరాల్లోనే కనిపిస్తోంది. పెద్ద పట్టణాలు, నగరాల్లో బ్యాంకింగ్ నెట్‌వర్క్ విస్తృతంగా ఉండటం, ఖాతాదారులు కూడా డిజిటల్ లావాదేవీల నిర్వహణకు అలవాటు పడుతుండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ‘ప్రభుత్వ రంగ బ్యాంకుల ఏటీఎంలు, శాఖల మూసివేత ఎక్కువగా మెట్రో నగరాల్లోనే ఉంటోందే తప్ప గ్రామీణ ప్రాంతాలు, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఇలాంటి ధోరణులు లేవు‘ అని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ పల్లవ్ మహాపాత్ర తెలిపారు. ‘ఇది డిమాండ్‌పరమైన అంశం. తీవ్రమైన పోటీ ఉన్న మెట్రోల్లోనే అసంఖ్యాకంగా శాఖలు, ఏటీఎంలు ఎందుకు ఏర్పాటు చేయాలి. మెట్రో నగరాల్లో ఏదైనా ఏటీఎం వినియోగం చాలా తక్కువగా ఉంటే దాన్ని కొనసాగించాల్సిన అవసరం ఏం ఉంది‘ అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు, ఇది లాభదాయకతతో ముడిపడి ఉన్న విషయంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈడీ ఎన్ దామోదరన్ పేర్కొన్నారు. ‘ఏటీఎంలు, శాఖల మూసివేత అన్నది ఎక్కువగా వ్యాపారపరమైన లాభదాయకత అంశానికి సంబంధించినది. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా శాఖలు, ఏటీఎంల క్రమబద్ధీకరణ ప్రక్రియ కొనసాగుతుంది‘ అని ఇటీవల బ్యాంకు ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా ఆయన తెలిపారు.
బ్యాంక్ ఆఫ్ ఇండియా గతేడాది 36 శాఖలు, 1,269 ఏటీఎంలను మూసివేసింది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. క్రమంగా కస్టమర్లు డిజిటల్ మాధ్యమాల ద్వారా బ్యాంకింగ్ లావాదేవీలకు అలవాటుపడే కొద్దీ ఏటీఎంలు, శాఖల అవసరం చాలా మటుకు తగ్గిపోతుందని ప్రభుత్వ రంగ బ్యాంకుకు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కొన్నాళ్లు పోతే గ్రామీణ ప్రాంతాల్లో ఖాతాదారులు కూడా డిజిటల్ బాట పడితే.. ఆయా ప్రాంతాల్లో కూడా శాఖలు, ఏటీఎంలపరమైన వ్యయాలను బ్యాంకులు తగ్గించుకుంటాయని పేర్కొన్నారు. డిజిటల్ మాధ్యమంతో పోలిస్తే వీటిపై పెట్టుబడుల భారం భారీగా ఉంటోంది కాబట్టి ఖాతాదారుల బ్యాంకింగ్ అలవాట్లు మారే కొద్దీ .. ఇలాంటి మూసివేతలు సాధారణ ట్రెండ్‌గా మారే అవకాశం ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.
ప్రైవేట్ విస్తరణ..
ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ ఏటీఎంలు, శాఖలను మూసివేస్తుండగా .. మరోవైపు ప్రైవేట్ బ్యాంకులు మాత్రం క్రమంగా తమ నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నాయి. గత ఏడాది వ్యవధిలో యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి దిగ్గజాలన్నీ తమ బ్యాంకింగ్ నెట్‌వర్క్‌ను విస్తరించాయి. అయితే, రిజర్వ్ బ్యాంక్ గణాంకాల చూస్తే ఇవన్నీ కూడా ఎక్కువగా ప్రధాన నగరాల్లోనే ఏటీఎంలు ఏర్పాటు చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే విషయంలో ఈ బ్యాంకుల ఏటీఎంలు చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతీ అయిదు ఏటీఎంలలో ప్రభుత్వ రంగ బ్యాంకు ఏటీఎం ఒకటి ఉంటుండగా, ప్రైవేట్ రంగ బ్యాంకుల విషయం తీసుకుంటే ప్రతి పదింటిలో ఒకటి మాత్రమే ఉంటోంది.
Comments
Please login to add a commentAdd a comment