► బ్యాంకుల వద్ద ఖాతాదారుల పాట్లు
► ఏటీఎంల ముందు ఫీట్లు
పాత నోట్ల స్థానంలో కొత్త నోట్లను పొందడంలో ప్రజలకు రెండోరోజూ కరెన్సీ కష్టాలు తప్పలేదు. ఏటీఎంలపై ఆశలు పెట్టుకున్న ప్రజలకు నిరాశ తప్పలేదు. -సాక్షి ప్రతినిధి, చెన్నై
సాక్షి ప్రతినిధి, చెన్నై: నల్లకుబేరులను దెబ్బతీసేందుకు రూ.500, రూ.1000 నోట్లను కేంద్రం అకస్మాత్తుగా రద్దు చేయడంతో సాధారణ ప్రజానీకం పడరాని పాట్లు పడుతోంది. పాత కరెన్సీ మార్పిడికి మరో 40 రోజులు మాత్రమే గడువు ఉండడంతో రెండోరోజైన శుక్రవారం కూడా బ్యాంకుల వద్ద ఖాతాదారులు బారులు తీరారు. ఏటీఎంలు శుక్రవారం నుంచి యథావిధిగా పనిచేస్తాయని కేంద్రం ప్రకటించడంతో ఊపిరిపీల్చుకున్న జనానికి నిరాశే మిగిలింది. కొత్త కరెన్సీ నింపే పనులు పూర్తికాకపోవడంతో అనేక ఏటీఎంలు తెరుచుకోలేదు. మరికొన్ని చోట్ల ఏటీఎంలు పనిచేయకుండా మొరాయించాయి. ఉదయం 10 గంటల నుంచి ఏటీఎంలు పనిచేస్తాయని ప్రకటించినా 8 గంటల నుంచే ప్రజలు క్యూ కట్టారు.
అయితే అనేక ఏటీఎంలు అసలు తెరుచుకోకపోవడంతో క్యూకట్టిన ప్రజలు మళ్లీ బ్యాంకులవైపు పరుగులు తీశారు. పనిచేసిన ఏటీఎంల నుంచి కేవలం రూ.2వేలు మాత్రమే డ్రా చేసుకోవచ్చనే నిబంధనతో ప్రజల చికాకుపడ్డారు. బ్యాంకుల వద్ద ఖాతాదారులు ఎక్కువ సిబ్బంది తక్కువ కావడంతో గంటల తరబడి క్యూలో నిల్చుకోకతప్పలేదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు మాత్రం రిటైరైన తమ ఉద్యోగులను తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకున్నారు. దీంతో స్టేట్ బ్యాంకుల వద్ద జనం రద్దీ త్వరగా తగ్గుముఖం పడుతోంది. అలాగే కరెన్సీ మార్పిడిలో తొలిరోజైన గురువారం నాడు ప్రజలకు సేవలు అందించలేక పోయిన తపాలా శాఖలో రెండో రోజు కూడా అదే పరిస్థితి కొనసాగింది.
తపాలశాఖను నమ్ముకున్న వారంతా విసిగి వేశారి బ్యాంకుల వైపు మళ్లారు. కొన్ని బ్యాంకుల్లో కొత్త రూ.500 కరెన్సీ లేదంటూ రూ.2000 నోట్లను మాత్రమే ఇచ్చారు. రూ.100, రూ.50నోట్లయినా ఇవ్వండని ప్రజలు అనేక చోట్ల బతిమాలుకున్నారు. పాత నోట్లు చెల్లకపోవడం టాస్మాక్‌లో మద్యం దుకాణాల అమ్మకాలపై ప్రభావం చూపింది. ఈ రెండు రోజుల్లో రూ.25 కోట్ల మేర వ్యాపారం పడిపోయింది.
వడ్డీ వ్యాపారుల తెలివి:కట్టలు కట్టలుగా కరెన్సీ పెట్టుకునే వడ్డీ వ్యాపారులు కేంద్రం నిర్ణయంతో కుంగిపోయారు. తమ వద్ద నున్న భారీ నగదును మార్చుకునేందుకు తమ తెలివితేటలు ప్రదర్శించారు. పేదలకు వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడం ద్వారా తమ వద్దనున్న పాత కరెన్సీ నోట్లను కరిగించారు. అప్పుచెల్లించే స్తోమత ఉందా లేదా అనేక అలోచనను పక్కన పెట్టి ఇలా రూ.లక్ష వరకు దారాళంగా రుణాలను అందజేశారు.
కరెన్సీ కష్టాలు
Published Sat, Nov 12 2016 3:35 AM | Last Updated on Sat, Sep 22 2018 7:53 PM
Advertisement