ముగ్గురు తపాలా అధికారులపై సీబీఐ కేసు | CBI case against three officials of the postal | Sakshi
Sakshi News home page

ముగ్గురు తపాలా అధికారులపై సీబీఐ కేసు

Published Tue, Nov 29 2016 2:47 AM | Last Updated on Sat, Sep 22 2018 7:51 PM

ముగ్గురు తపాలా అధికారులపై సీబీఐ కేసు - Sakshi

ముగ్గురు తపాలా అధికారులపై సీబీఐ కేసు

రూ.36 లక్షలు అక్రమ మార్పిడి జరిగినట్లు గుర్తింపు
- నల్లధనాన్ని వైట్ చేసే ప్రయత్నం
- సాధారణ ప్రజలు మార్చుకున్నట్లుగా రికార్డులు సృష్టించే యత్నం
- గుర్తించాల్సిన వారిలో మరికొందరు ప్రభుత్వోద్యోగులు
 
 సాక్షి, హైదరాబాద్: నోట్ల మార్పిడిలో అక్రమాలకు పాల్పడిన ముగ్గురు తపాలా శాఖ ఉద్యోగులపై సీబీఐ కేసు నమోదు చేసింది. కమీషన్లకు కక్కుర్తిపడి రూ.36 లక్షల మేర అక్రమంగా మార్పిడి చేసినట్లు గుర్తించింది. పోస్టాఫీసులపై గురువారం దాడులు చేసిన అధికారులు.. ప్రాథమిక విచారణ పూర్తరుున తర్వాత శుక్రవారమే కేసు (ఆర్సీ నం.24 (ఎ)/2016) నమోదు చేసినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందులో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్ (ఎస్‌ఎస్‌పీఓఎస్) సుధీర్‌బాబు, హిమాయత్‌నగర్ సబ్ పోస్టుమాస్టర్ జి.రేవతి, ఎస్‌ఎస్‌పీఓఎస్ కార్యాలయంలో ఆఫీస్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జి.రవితేజ నిందితులుగా ఉన్నారు. వీరిపై కుట్ర, మోసం, నమ్మక ద్రోహం, ప్రభుత్వ ఉద్యోగి ద్వారా నమ్మక ద్రోహం, ఖాతాలు/పుస్తకాలను తారుమారు చేయడం తదితర ఆరోపణలను నమోదు చేశారు. ఇక ఈ వ్యవహారంలో మరికొందరు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ప్రమేయమున్నట్లు అనుమానిస్తున్నామని సీబీఐ అధికారులు పేర్కొన్నారు. ఎవరికి సంబంధించిన నగదును ఈ రకంగా అక్రమ మార్పిడి చేశారనే దానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

 నోట్లు ఇచ్చే దగ్గరే..
 పాత నోట్ల మార్పిడి ప్రక్రియలో భాగంగా.. హైదరాబాద్‌లో జీపీఓలోని పోస్టల్ ట్రెజరీ కార్యాలయం సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ (ఎస్‌ఎస్‌పీఓఎస్)కు రోజూ కొంత మొత్తంలో కొత్త రూ.2 వేల నోట్లను మంజూరు చేసింది. అందులో భాగంగా హిమాయత్‌నగర్ సబ్ పోస్టాఫీస్‌కు ఈ నెల 11న రూ.70 లక్షలు కేటారుుంచింది. ఆ మరుసటి రోజు ఎస్‌ఎస్‌పీఓఎస్‌లో పనిచేస్తున్న రవితేజకు 11 సబ్ పోస్టాఫీసులకు బట్వాడా చేయడానికి మొత్తం రూ.1.59 కోట్లు (హిమాయత్‌నగర్ పోస్టాఫీసుకు కేటారుుంచిన రూ.70 లక్షలు సహా) కొత్త రూ.2 వేల నోట్లు అందించారు. అరుుతే ఎస్‌ఎస్‌పీఓఎస్‌గా పనిచేస్తున్న సుధీర్‌బాబు రూ.36 లక్షల విలువైన పాత రూ.1,000, రూ.500 నోట్లను రవితేజకు ఇచ్చి, వాటిని హిమాయత్‌నగర్ సబ్ పోస్ట్‌మాస్టర్‌కు ఇవ్వాలని సూచించారు. ఈ రూ.36 లక్షల విలువకు సరిపడా కొత్త రూ.2 వేల నోట్లను రవితేజ నుంచి తీసుకున్నారు. అదేరోజు హిమాయత్‌నగర్ సబ్ పోస్టాఫీసుకు వెళ్లిన రవితేజ... రూ.36 లక్షల పాతనోట్లు, రూ.34 లక్షల విలువైన కొత్త నోట్లను సబ్ పోస్ట్‌మాస్టర్ రేవతికి అందించారు. అప్పటికే సుధీర్‌బాబు ఫోన్ ద్వారా రేవతితో మాట్లాడడంతో.. ఆమె ఆ పాత, కొత్త నగదును తీసుకున్నారు. ఈ సందర్భంలో క్యాష్ ట్రెజరీ పుస్తకంలో సంతకం చేసిన రేవతి ‘ఫోన్ ద్వారా ఎస్‌ఎస్‌పీఓఎస్ ఇచ్చిన ఆదేశాల మేరకు నగదు తీసుకుంటున్నాను’అని రాశారు.

 రికార్డులు సృష్టించే యత్నం..
 సుధీర్‌బాబు ద్వారా వచ్చిన పాత నోట్లను సాధారణ ప్రజల నుంచే తీసుకున్నట్లుగా రికార్డులు రూపొందించడానికి పోస్టల్ అధికారులు సిద్ధమయ్యారు. 12వ తేదీ నాటికి ‘మార్పిడి’కోసం వచ్చిన మొత్తం రూ.74,73,500 సొమ్ముకుగాను.. కేవలం రూ.36,28,000 మార్చినట్లుగా 987 రసీదులు మాత్రమే సిద్ధమయ్యారుు. మిగతా రూ.38,45,500 మార్పిడికి సంబంధించి ఎలాంటి రసీదులు లేవు. ఈ వ్యవహారంపై సీబీఐకి సమాచారం అందడంతో... గురువారం పోస్టల్ విజిలెన్‌‌స అధికారులతో కలసి ఆకస్మిక దాడులు చేశారు. కమీషన్లు తీసుకుని కొందరు పెద్దలకు చెందిన నల్లధనాన్ని పోస్టల్ అధికారులు తెల్లధనంగా మార్చినట్లు గుర్తించారు. దీంతో సుధీర్‌బాబు, రేవతి, రవితేజలపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(2) రెడ్‌విత్ 13(1)(డీ), ఐపీసీలోని 120బీ, 406, 409, 420, 477ఎ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. సుధీర్‌బాబు మార్చిన రూ.36 లక్షలు ఎవరివనే అంశంపై సీబీఐ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దీని మూలాలు తేలిన తర్వాత సంబంధిత వ్యక్తుల్నీ ఈ కేసులో నిందితులుగా చేర్చనున్నారు.
 
 చాలా పోస్టాఫీసుల్లో గోల్‌మాల్!
 రాష్ట్రంలోని చాలా పోస్టాఫీసుల్లో కరెన్సీ మార్పిడి అవకతవకలు జరిగినట్లు బహిర్గతమవుతోంది. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు అధికారులు, సిబ్బంది కమీషన్లకు కక్కుర్తి పడి నల్ల ధనికులకు సహకారం అందించినట్లు వెల్లడవుతోంది. ఈ అక్రమాలకు సంబంధించి హైదరాబాద్‌లో ముగ్గురు తపాలా అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇక కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట, బొప్పాపూర్ ఉప తపాలా కార్యాలయాల్లోనూ అవకతవకలు జరిగి నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఇక హైదరాబాద్ సిటీ రీజియన్ పరిధిలోని పలు పోస్టాఫీసుల్లో సీబీఐ సోదాలు కొనసాగుతూనే ఉన్నారుు. వరంగల్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని మరిన్ని పోస్టాఫీసుల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నారుు. గ్రామీణ ప్రాంతాల్లోనూ తపాలా సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement