ముప్పుతిప్పలు పెట్టి... మూడంతస్తులు దూకి! | The company on fraud cases in four states | Sakshi
Sakshi News home page

ముప్పుతిప్పలు పెట్టి... మూడంతస్తులు దూకి!

Published Sat, Jun 18 2016 12:03 AM | Last Updated on Mon, Sep 4 2017 2:44 AM

ముప్పుతిప్పలు పెట్టి... మూడంతస్తులు దూకి!

ముప్పుతిప్పలు పెట్టి... మూడంతస్తులు దూకి!

‘ఆర్సీఐ సుదీప్’ అరెస్టులో సీసీఎస్ చాకచక్యం
ఈ సంస్థ మోసాలపై నాలుగు రాష్ట్రాల్లో కేసులు



సిటీబ్యూరో:  ఏటీఎం కేంద్రాల్లో పెట్టాల్సిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు (ఎస్‌బీఐ) చెందిన రూ.9.98 కోట్ల గోల్‌మాల్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఆర్సీఐ సంస్థ డెరైక్టర్ సుదీప్‌కుమార్‌ను హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు ముంబైలో చాకచక్యంగా పట్టుకున్నారు.  డీసీపీ అవినాష్ మహంతి శుక్రవారం ఈ వివరాలు వెల్లడించారు. ఈ స్కామ్‌కు సంబంధించి పోలీసులు గత నెల్లోనే ఆర్సీఐ సంస్థ కస్టోడియన్లు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ఆర్సీఐ సంస్థకు హైదరాబాద్‌కు చెందిన సుదీప్‌కుమార్, పవన్ కుమార్ గుప్తా డెరైక్టర్లుగా ఉన్నారు. నగరంలోని 116 ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రాల్లో డబ్బు నింపే బాధ్యతల్ని ఆర్సీఐ క్యాష్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 2013 నవంబర్ 15న ఎఫ్‌ఎస్‌ఎస్ సంస్థ నుంచి సబ్-కాంట్రాక్ట్ తీసుకుంది. ఆర్సీఐలో జి.నాగరాజును ఆపరేషన్స్ విభాగం మేనేజర్‌గా, కె.లోకేశ్వర్‌రెడ్డి, కర్రె అజయ్‌కుమార్, జి.ప్రవీణ్‌కుమార్, ఆర్.పండు, నర్సింగ్‌రావుల్ని కస్టోడియన్లుగా పని చేస్తున్నారు. దీని కార్యాలయం మహేంద్రాహిల్స్ త్రిమూర్తి కాలనీలో ఉంది. ఆర్సీఐ సంస్థ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో ఉద్యోగుల జీతాల చెల్లింపు, వాహనాల నిర్వహణకూ నగదు లేకుండా పోయింది. దీంతో దాదాపు ఏడాది క్రితం సుదీప్‌తో పాటు సంస్థకు చెందిన గిరిరాజు తమ ఉద్యోగుల్ని దారి తప్పించారు. ఏటీఎం కేంద్రాల్లో నింపాల్సిన నగదులో రూ. 2.15 కోట్లను తెప్పించుకుని వాడుకున్నారు. దీన్ని అదునుగా చేసుకున్న ఆపరేషన్స్ మేనేజర్, కస్టోడియన్లు రూ.7.83 కోట్లను స్వాహా చేశారు.

 
చాకచక్యంగా పట్టుకున్న  సీసీఎస్ పోలీస్...

గతనెల్లో ఎనిమిది మంది నిందితుల్ని అరెస్టు చేసిన సీసీఎస్ పోలీసులు సుదీప్, గిరిరాజ్ కోసం గాలించారు. ముంబైలో వీరు ఉన్నట్లు సమాచారం అందుకున్న ఏసీపీ జోగయ్య ఇన్‌స్పెక్టర్ కిరణ్‌కుమార్ నేతృత్వంలోని బృందాన్ని దాదాపు వారం క్రితం అక్కడకు పంపారు. ఐదు రోజుల పాటు క్షుణ్ణంగా గాలించిన ఈ స్పెషల్ టీమ్ తన మాజీ ఉద్యోగినికి చెందిన ఫ్లాట్‌లో సుదీప్‌కుమార్ తలదాచుకున్నట్లు గుర్తించారు. గురువారం సీసీఎస్ బృందం ఓ అపార్ట్‌మెంట్ మూడో అంతస్తులో ఉన్న ఈ ఫ్లాట్‌పై దాడి చేశారు. ముందే వ్యూహాత్మకంగా వ్యవహరించిన పోలీసులు అపార్ట్‌మెంట్ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని అధ్యయనం చేశారు. పారిపోవడానికి ఆస్కారం ఉన్న ప్రాంతాలను గుర్తించి కొందరు సిబ్బందితో అక్కడ కాపుకాయించారు. తాను ఉన్న ఫ్లాట్ వద్దకు పోలీసులు రావడం గుర్తించిన సుదీప్‌కుమార్ ఎంతకీ తలుపు తీయలేదు. పోలీసులు ఆ ప్రయత్నాల్లో ఉండగా... ఫ్లాట్ వెనుక ఉన్న కిటికీ నుంచి బయటకు వచ్చాడు. అక్కడ నుంచి రెండో అంతస్తులోకి, అట్నుంచి మొదటి అంతస్తులోకి దిగిన సుదీప్... వెనుక వైపు గోడ దూకి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అప్పటికే కాపుకాసి ఉన్న సీసీఎస్ పోలీసులు గమనించి అదుపులోకి తీసుకున్నారు. ఇతడిచ్చిన సమాచారంతో మరో నిందితుడు గిరిరాజ్‌ను పట్టుకున్నారు.

 

 జ్యుడీషియల్ రిమాండ్‌కు గిరిరాజ్
ఇద్దరు నిందితుల్నీ ముంబై కోర్టులో హాజరుపరిచిన సీసీఎస్ పోలీసులు ప్రిజనర్స్ ట్రాన్సిట్ (పీటీ) వారెంట్‌పై శుక్రవారం హైదరాబాద్ తీసుకువచ్చారు. వైద్య పరీక్షల అనంతరం గిరిరాజ్‌ను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. సుదీప్‌ను న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు సోమవారం వరకు గడువు ఉండటంతో లోతుగా విచారిస్తున్నారు. ఆర్సీఐ యాజమాన్యంపై మహారాష్ట్ర, బీహార్, మధ్యప్రదేశ్, కర్ణాటకల్లోనూ కేసులు ఉన్నాయి. అయితే అక్కడ సిబ్బందిని బలి పశువుల్ని చేసిన యాజమాన్యం తప్పించుకుంది. ముంబైలో నమోదైన కేసులో సుదీప్ నిందితుడిగా ఉన్నా... అక్కడి పోలీసులకు చిక్కలేదు. సీసీఎస్ విచారణలో ఈ నిందితుడు నగదు స్వాహాలో పవన్‌గుప్తాదే కీలక పాత్ర అని, సొమ్ము అతడి దగ్గరే ఉందని చెప్పాడని తెలిసింది. ‘ఆర్సీఐ సంస్థపై అనేక రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయి. సుదీప్, గిరిరాజ్‌ల అరెస్టు, కేసుల్లో వారి ప్రమేయంపై ఆయా అధికారులకు సమాచారం ఇస్తాం’ అని డీసీపీ అవినాష్ మహంతి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement