ఏటీఎం కేంద్రాల వద్ద వృద్ధులే టార్గెట్
కార్డు మార్చి నగదు స్వాహా
వారంలో ఒకే ఏటీఎంలో రెండు నేరాలు
విజయవాడ (వన్‌టౌన్) : కేటుగాళ్లు కళ్లు ఇప్పుడు ఏటీఎంలపై పడ్డాయి. ఏటీఎంలపై సరైన అవగాహన లేని వృద్ధులను, కంటిచూపు తక్కువగా ఉన్నవారిని అనుసరించి వారి కార్డులను కాజేస్తున్న సంఘటనలు వన్‌టౌన్‌లోని ఏటీఎం కేంద్రాల వద్ద వారం రోజుల్లో రెండు సంఘటనలు చోటు చేసుకున్నాయి.
నిత్యం రద్దీగా ఉండే కేజీ మార్కెట్ సెంటర్‌లోనే నగరంలో 24 గంటలూ జనసంచారం కనిపించే ప్రాంతాల్లో కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్ ఒకటి. ఈ సెంటర్‌లో భారతీయ స్టేట్ బ్యాంక్ విజయవాడ మెయి న్ బ్రాంచి ఉంది. దీని ప్రాంగణంలోనే ‘ఈ-కార్నర్’ పేరుతో డబ్బులు డ్రా చేయటానికి, డిపాజిట్ చేయటానికి, పాస్‌బుక్‌లో నమోదుకు పలు యంత్రాలను ఆ బ్యాంక్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఇక్కడ నిత్యం ఖాతాదారులు బారులు తీరి కనిపిస్తారు. అటువంటి కేంద్రంలో ఈ నెల 4న కానూరు షిర్డినగర్‌కు చెందిన ఆలపాటి సాంబశివరావు అనే వృద్ధుడు ఏటీఎం కార్డును చూపించి పక్కనే ఉన్న యువకుడితో సాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఆ యువకుడు సాయం చేస్తున్నట్లు నటించి వృద్ధుడి దగ్గర ఏటీఎం కార్డు మార్చివేసి మరొకటి అతని చేతిలో పెట్టాడు. డబ్బులు రావడం లేదు. బ్యాంక్‌లో కలవమని సూచించి అక్కడి నుంచి పలాయనం చిత్తగించాడు.
అయితే కొద్ది నిమిషాల్లో ఆ వృద్ధుడి ఫోన్‌కు రెండు సార్లుగా రూ.40 వేలు డ్రా అయినట్లు మెసేజ్‌లు వచ్చాయి. అలాగే ఈ నెల 7న కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలానికి చెందిన టి.కృష్ణ అనే వృద్ధుడు పనిపై నగరానికి వచ్చాడు. ఇదే ఈ-కార్నర్‌లోకి వెళ్లి డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఆ క్రమంలో పక్కనే ఉన్న యువకుడి సాయం కోరాడు. మునుపటిలాగే కార్డు మార్చి మరో కార్డును యువకుడు వృద్ధు డి చేతిలో పెట్టి పరారయ్యాడు. కొద్దిసేపటికీ రూ.20 వేలు డ్రా చేసినట్లు మెసేజ్‌లు వచ్చాయి. గతం లో బ్యాంక్‌లో రిటైర్డ్ రైల్వే ఉద్యోగి పెన్షన్ తీసుకోవటానికి వచ్చిన సందర్భంలోనూ పక్కన ఉన్న యువకుడు నగదు చోరి చేసి ఉడాయించిన సంఘటనలు ఉన్నాయి.
చోద్యం చూస్తున్న అధికారులు
ఏటీఎంల వద్ద నేరాలు జరుగుతుంటే బ్యాంక్ అధికారులతోపాటు పోలీసు వర్గాలు చోద్యం చూస్తున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ-కార్నర్‌లో సెక్యూరిటీ గార్డ్ ఉన్నా ఈ విధమైన సంఘటన జరగటంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఒక నేరం జరిగి రెండు రోజులు గడవక ముందే అదే తరహా సంఘటన మరొకటి జరగటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంత కీలకమైన ప్రాంతంలోని ఏటీఎంల వద్ద పటిష్ట చర్యలు చేపట్టకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు.