కుత్బుల్లాపూర్: ఐచ్చికంగా ఉండాల్సిన విధి విధానాలను బలవంతంగా వినియోగదారులపై రుద్దుతున్నారు బ్యాంక్ అధికారులు. తమ టార్గెట్లు చేరుకునేందుకు ఖాతాదారులను పావులుగా వాడుకుంటున్నారు. తమ అకౌంట్‌లో డబ్బులు డిపాజిట్ చేయాలన్నా సరే గ్రీన్ కార్డు లేదా ఏటీఎం కార్డు ఉండాల్సిందేనంటూ ఖాతాదారులకు చుక్కలు చూపిస్తున్నారు. కుత్బుల్లాపూర్ పరిధి సుచిత్ర రోడ్డులో ఉన్న ఎస్‌బీఐ బ్యాంక్ (కుత్బుల్లాపూర్ శాఖ)లో ఖాతాదారులు ఎదుర్కొంటున్న సమస్య ఇది.
కార్డు ఉటేనే డిపాజిట్ల స్వీకరణ
సాధారణంగా బ్యాంకుల్లో ‘గ్రీన్ చానల్’ పేరిట పేపర్ వినియోగం తగ్గించేందుకు డిపాజిట్ కౌంటర్ల వద్ద స్వైపింగ్ మెషిన్లు ఏర్పాటు చేసి తద్వారా డిపాజిట్‌లు స్వీకరిస్తున్నారు. ఒక వేళ కార్డు లేకపోతే సంబంధిత ఫామ్ మీద వివరాలు రాసి డిపాజిట్‌కు అనుమతిస్తారు. అయితే ఈ ఎస్‌బీఐ బ్రాంచ్‌లో మాత్రం ఇందుకు విరుద్ధంగా సాగుతోంది. ఫారం నింపి డబ్బులు ఇస్తే తీసుకోమంటూ బ్యాంక్ అధికారులు తిరస్కరిస్తున్నారు. ఏటీఎం కార్డు లేకపోతే బ్యాంక్ వారు జారీ చేస్తున్న గ్రీన్ కార్డుతో మాత్రమే డిపాజిట్లు స్వీకరిస్తామని తేల్చిచెబుతున్నారు. దీంతో నిరక్షరాశులు, నిరుపేదలైన ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రూ.20కు గ్రీన్ కార్డు..
ఖాతాదారు తన ఏటీఎం కార్డును మరిచిపోయి బ్యాంక్‌కు వస్తే బయట ఉన్న సీడీఎం(క్యాష్ డిపాజిట్ మెషిన్)లో వేసుకోవాలని సూచిస్తున్నారు. లేకపోతే రూ.20 చెల్లించి ఎస్‌బీఐ ‘గ్రీన్ రెమిట్ కార్డు’ తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. ఇక వినియోగదారులు తిరిగి వెళ్లి ఏటీఎం కార్డు తీసుకురాలేక రూ.20 చెల్లించి గ్రీన్ కార్డును తీసుకుని డిపాజిట్లు చేసుకుంటున్నారు. ఈ రెండు పద్ధతుల్లో తప్ప ఇతర పద్ధతుల్లో ఇక్కడి అధికారులు ఏ మాత్రం క్యాష్ డిపాజిట్లను స్వీకరించడం లేదు. గ్రీన్ కార్డు ఆవశ్యకతను, దాని ఉపయోగాలను సానుకూలంగా ఖాతాదారులకు వివరించాల్సిన సిబ్బంది ఇలా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని బలవంతంగా గ్రీన్‌కార్డులను అంటగడుతున్నారని పలువురు ఖాతాదారులు వాపోతున్నారు. పైగా బ్యాంక్ ఆవరణలో గ్రీన్ కార్డు లేదా ఏటీఎం కార్డు ద్వారానే డిపాజిట్ స్వీకరిస్తామని ఎక్కడా నోటీసు కూడా పెట్టకపోవడంతో చాలా మంది ఖాతాదారులు కార్డు లేకుండానే బ్యాంక్‌కు రావడం, సంబంధిత అధికారులతో వాదులాడడం, లేదా బతిమిలాడడం సర్వసాధారణమైంది.
ఇక్కడ అందరూ చదువుకున్న వారే.. కార్డు తెచ్చుకోవాల్సిందే..
ఈ విషయమై సంబంధిత బ్యాంక్ ఉన్నతాధికారిని ఖాతాదారులు సంప్రదించగా జనవరి 1వ తేదీ నుంచి పేపర్ లెస్ డిపాజిట్లను తీసుకుంటున్నామని, ఇది తమ బ్యాంక్‌లో తప్పనిసరని చెప్పుకొచ్చారు. మరి కార్డులు తీసుకురాని వారి పరిస్థితి ఏమిటని అడగ్గా ‘ఇది పట్టణ ప్రాంతం.. అందరూ చదుకున్న వాళ్లే ఉంటారు. కార్డు తెచ్చుకోకపోతే మేమేమీ చేయలేమంటూ’ స్పష్టం చేశారు. మరో అధికారి స్పందిస్తూ అత్యవసర సమయంలో మాత్రమే డిపాజిట్ స్లిప్‌లను అనుమతిస్తామని కొంచెం వెసలుబాటు మాటలు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment