ఏమిటీ డ్రామాలు? | Gajendra Singh Shekhawat Comments On Telangana CM KCR | Sakshi
Sakshi News home page

ఏమిటీ డ్రామాలు?

Published Fri, Nov 12 2021 4:17 AM | Last Updated on Fri, Nov 12 2021 7:26 AM

Gajendra Singh Shekhawat Comments On Telangana CM KCR - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలకు సంబంధించి కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటు అంశం కోర్టు పరిధిలో ఉండగా జరిగిన ఆలస్యానికి కేంద్రం ఎలా బాధ్యత వహిస్తుందని జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ప్రశ్నించారు. దీనిపై 2015లో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు సుప్రీంకోర్టు గత నెల 6న అనుమతి ఇచ్చిన తర్వాతే ట్రిబ్యునల్‌ విషయంలో కేంద్రం పాత్ర ప్రారంభమైందని షెకావత్‌ స్పష్టత ఇచ్చారు. ఈ జాప్యానికి తెలంగాణ ప్రభుత్వం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడమే కారణమని, అలాంటప్పుడు కేంద్రాన్ని ఎలా తప్పుబడతారని ప్రశ్నించారు. దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాంతో కలసి షెకావత్‌ మీడియాతో మాట్లాడారు.

2 రోజులని చెప్పి 8 నెలలకు..
కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రిగా తాను బాధ్యతలు స్వీకరించిన తరువాత చొరవ తీసుకుని గతేడాది అక్టోబర్‌ 6న అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహించినట్లు షెకావత్‌ తెలిపారు. ఆ సందర్భంగా కేసీఆర్‌ కొత్త ట్రిబ్యునల్‌ ప్రస్తావన తీసుకురాగా ఆ విషయం కోర్టు పరిధిలో ఉందని గుర్తు చేయడంతో 2 రోజుల్లో పిటిషన్‌ ఉపసంహరణకు దరఖాస్తు చేసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. అయితే 7–8 నెలల తర్వాత తెలంగాణ ప్రభుత్వం పిటిషన్‌ వెనక్కి తీసుకుంటామని సుప్రీంకోర్టులో దరఖాస్తు చేసుకుందని చెప్పారు. ఇందుకు న్యాయస్థానం అంగీకరించిన తర్వాతే ట్రిబ్యునల్‌ ఏర్పాటుకు సంబంధించి కేంద్రం నిర్వర్తించాల్సిన కార్యక్రమం మొదలైందని తెలిపారు.

చర్చించాకే బోర్డుల పరిధిపై నిర్ణయం...
విభజన చట్టం ప్రకారం కృష్ణా, గోదావరి బోర్డులు ఏర్పడినప్పటికీ పరిధి నోటిఫై చేయని కారణంగా ఇన్నాళ్లూ అధికారంలేని సంస్థలుగానే ఉండిపోయాయని షెకావత్‌ పేర్కొన్నారు. గతేడాది అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో రెండు బోర్డుల పరిధి నోటిఫై ప్రక్రియ ప్రారంభించేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరించారని తెలిపారు. ఆ తర్వాత ఇరు రాష్ట్ర ప్రభుత్వాలతో సుదీర్ఘ చర్చల తర్వాతే బోర్డుల పరిధిని నిర్ణయించామని వివరించారు. కానీ ఇప్పుడు హఠాత్తుగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇలా వ్యాఖ్యానించడం పెద్ద డ్రామాలా కనిపిస్తోందని షెకావత్‌ విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సీఎం హోదాలో రాష్ట్రాన్ని పాలించే వ్యక్తి ఈ విధంగా మాట్లాడటం తగదన్నారు. ఇరు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే బోర్డులను నోటిఫై చేసినప్పటికీ ఇదంతా ఒక డ్రామా అని కేసీఆర్‌ మాట్లాడటం ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యవస్థపై విధ్వంసకరమైన దాడి చేయడమేనని చెప్పారు. నూతన ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలా? లేక ఉన్న ట్రిబ్యునల్‌కే బాధ్యత అప్పగించాలా? అనే అంశంపై న్యాయశాఖ తన అభిప్రాయాన్ని వెల్లడించాక ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. 

ఏవో కొన్ని కాగితాలు పంపుతున్నారు..
బోర్డులు సమర్థంగా పనిచేసేలా రెండు రాష్ట్రాలు తమ బాధ్యతలను నిర్వర్తించాలని షెకావత్‌ కోరారు. విద్యుత్‌ ప్రాజెక్ట్‌ల నిర్వహణ విషయంలో ఎలాంటి గందరగోళం లేదని, నోటిఫికేషన్‌లో పూర్తి స్పష్టత ఉందన్నారు. నోటిఫికేషన్‌ ప్రకారం ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించడం, అనుమతులు లేని ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్‌లను వెంటనే బోర్డుల ద్వారా సీడబ్ల్యూసీకి అందించాలని, మూలనిధి డిపాజిట్‌ చేయాలని, మానవ వనరులు, మౌలిక వసతుల కల్పనపై దృష్టిపెట్టాలని సూచించారు. నోటిఫికేషన్‌ కటాఫ్‌ తేదీని వాయిదా వేయాల్సిన అవసరం లేదన్నారు. అయితే డీపీఆర్‌ల పేరుతో ప్రాజెక్టులకు సంబంధించి ఏవో కొన్ని కాగితాలను పంపడం సరికాదని, నిర్దిష్ట ఫార్మాట్‌లో ఇవ్వాలని సూచించారు. నోటిఫికేషన్‌లో వెలిగొండ ప్రాజెక్టు పేరులో వచ్చిన తప్పుని సవరించాలంటే ప్రక్రియ పార్లమెంట్‌లో జరగాలని, ఇది ఇప్పటికీ అనుమతులు లేని ప్రాజెక్టుల జాబితాలోనే ఉందని షెకావత్‌ పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement