
గోదావరి పరుగులు... కృష్ణమ్మ ఉరకలు
గోదావరి బేసిన్‌లో అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత
- ఎస్సారెస్పీ, ఎల్లంపల్లికి 3.50 లక్షల క్యూసెక్కులకు పైగా వరద
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలతో గోదావరి పరుగులు పెడుతోంది. కృష్ణమ్మ ఉరకలు వేస్తోంది. గోదావరి బేసిన్‌లోని అన్ని ప్రధాన ప్రాజెక్టుల్లోకి ప్రవాహాలు కొనసాగుతుండటం తో అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు ఉప్పొంగుతున్నాయి.మంగళవారం భద్రాచలం వద్ద రికార్డు స్థాయిలో వరద వచ్చే అవకాశం ఉంది. దీంతో నదీ తీర ప్రాంత గ్రామాలను, లోతట్టు ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఇక శ్రీశైలం రిజర్వాయర్‌లోకి భారీ ఎత్తున వరద వస్తుండటంతో నీటినిల్వ 192.53 టీఎంసీలకు చేరుకుంది. సోమవారం అర్ధరాత్రి లేదా మంగళవారం ఉదయం అధికారులు శ్రీశైలం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు.
గోదావరి ఉగ్రరూపం: గోదావరి బేసిన్‌లో శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, నిజాంసాగర్, సింగూరు వంటి భారీ, మధ్య తరహా ప్రాజెక్టులన్నీ నిండటంతో ఆదివారమే ప్రభుత్వం ఆ ప్రాజెక్టుల గేట్లు ఎత్తింది. మహారాష్ట్రలోని విష్ణుపురి ప్రాజెక్టు గేట్లను ఆ రాష్ట్రం ఎత్తడంతో ఎస్సారెస్పీకి సోమవారం సాయంత్రం 4 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా అధికారులు దిగువకు వదులుతున్నారు. ఇక ఎల్లంపల్లికి 3.63 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండటంతో 3.70 లక్షల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇక సింగూరుకు లక్ష క్యూసెక్కుల మేర ఇన్‌ఫ్లో ఉండగా, 80 వేల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది.
ఈ నీరంతా నిజాంసాగర్‌కే చేరుతుండటం, దీనికి స్థానిక ప్రవాహాలు జత కావడంతో నిజాంసాగర్‌కు 1.85 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో ప్రాజెక్టు నుంచి 99 వేల క్యూసెక్కుల నీటిని వదిలేస్తున్నారు. మరోవైపు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు వంటి ఉప నదులు ఉప్పొంగుతోండటంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం సోమవారం సాయంత్రానికి 27.5 అడుగులకు చేరింది. ఇక ధవళేశ్వరం బ్యారేజీకి 2.42 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా.. డెల్టాకు విడుదల చేయగా మిగిలిన 2.41 లక్షల క్యూసెక్కుల (20.3 టీఎంసీలు)ను సముద్రంలోకి వదులుతున్నారు. ఈ ఏడాది జూన్ 1 నుంచి ఇప్పటి వరకూ 2,139.4 టీఎంసీల గోదావరి జలాలు కడలి పాలయ్యాయి.
నిండేందుకు సిద్ధంగా శ్రీశైలం: మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలతో సోమవారం కృష్ణా నదికి వరద మరింత పెరిగింది. ఆలమట్టి, నారాయణపూర్ నుంచి భారీ ఎత్తున నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో జూరాలకు 1.40 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. 1.42 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. దాంతో శ్రీశైలం రిజర్వాయర్‌లోకి 1.40 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. సోమవారం సాయంత్రానికి నీటి నిల్వ 192.53 టీఎంసీలకు చేరుకుంది. మరో 23.27 టీఎంసీలు వస్తే.. శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిగా నిండుతుంది. శ్రీశైలం ఎడమ, కుడి గట్టు విద్యుదుత్పత్తి కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 77,673 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఇందులో 74,148 క్యూసెక్కులు చేరుతుండటంతో నాగార్జున సాగర్‌లో నీటి నిల్వ 147.46 టీఎంసీలకు చేరుకుంది. సాగర్ నిండాలంటే మరో 164.59 టీఎంసీలు అవసరం. భారీ స్థాయిలో వరద వస్తేనే ఇది నిండే అవకాశం ఉంటుంది.