ప్రాజెక్టులు కళకళ
- గోదావరి, కృష్ణా ప్రాజెక్టుల్లోకి భారీగా నీటి ప్రవాహాలు
- జూరాల, ఎస్సారెస్పీ, సింగూరుకు పోటెత్తుతున్న వరద
- జూరాలకు 85 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
- శ్రీశైలంలో 164 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ
- నిండుకుండలా సింగూరు.. 3 గేట్లు ఎత్తివేత
- ఎస్సారెస్పీలో 56.6 టీఎంసీల నీరు
- పూర్తిగా నిండిన ఎల్లంపల్లి, కడెం
- శుక్రవారం ఒక్కరోజే అలుగుపారిన 3 వేలకుపైగా చెరువులు
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలతో గోదావరి, కృష్ణా ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఇటు రాష్ట్రంలో, అటు ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుల్లోకి భారీగా ప్రవాహాలు వచ్చి చేరుతున్నాయి. ఇప్పటికే కర్ణాటకలోని ఆలమట్టి, నారాయణపూర్ పూర్తిగా నిండాయి. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా కిందకు వదులుతుండడంతో ఆ నీరంతా జూరాల వైపు పరుగులు పెడుతోంది. ఇప్పటికే జూరాల నుంచి 41 వేల క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి వదులుతున్నారు. ఇక గోదావరి బేసిన్‌లోని ఎస్సారెస్పీ, సింగూరుకు భారీగా ప్రవాహాలు వస్తున్నాయి. సింగూరు నిండు కుండను తలపిస్తోంది.
జూరాలకు వరదే వరద
జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ఎగువన ఆలమట్టి, నారాయణపూర్ నుంచి నీటిని దిగువకు వదిలేస్తుండటం, జూరాల పరీవాహక ప్రాంతంలోనూ విసృ్తతంగా వర్షాలు కురుస్తుండటంతో శుక్రవారం సాయంత్రానికి ప్రాజెక్టులోకి 85 వేల క్యూసెక్కుల మేర ప్రవాహం వస్తోంది. ఇక్కడ్నుంచి పవర్‌హౌజ్‌కు 40 వేల క్యూసెక్కులు, నెట్టెంపాడుకు 750 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 310 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి శ్రీశైలానికి కూడా భారీగా వరద వస్తోంది. ఇక్కడ్నుంచి ఏపీ, తెలంగాణ మొత్తంగా 9,243 క్యూసెక్కుల నీటిని వివిధ ప్రాజెక్టుల అవసరాలకు విడుదల చేస్తున్నాయి. శ్రీశైలంలో 215.8 టీఎంసీల పూర్తిస్థాయి నిల్వకుగాను ప్రస్తుతం 164.75 టీఎంసీల నీరుంది. ఇక్కడ్నుంచి నాగార్జునసాగర్‌కు 9,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో ప్రస్తుతం సాగర్‌లో నీటి లభ్యత 139.26 టీఎంసీలకు చేరింది.
సింగూరులో 22 టీఎంసీల నిల్వ
గోదావరి బేసిన్‌లోని శ్రీరాంసాగర్, సింగూరు, క డెం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లో ఆశాజనక పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని కొమురంభీం ప్రాజెక్టు, నీల్వాయి, సాత్నాలతోపాటు ఖమ్మంలోని తాలిపేరు, కిన్నెరసాని వంటి మధ్యతరహా ప్రాజెక్టుల్లోకి భారీగా ప్రవాహాలు కొనసాగుతున్నాయి. పూర్తిగా అడుగంటిన సింగూరుకు ప్రస్తుత వర్షాలు పెద్ద ఊరటనిచ్చాయి. సింగూరులోకి 74 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 29.9 టీఎంసీలు కాగా ప్రస్తుతం 22.09 టీఎంసీల నిల్వ ఉంది.
శుక్రవారం రాత్రి మూడు గేట్లు ఎత్తి కిందకు నీటిని వదులుతున్నారు. ఇక ఎస్సారెస్పీకి 54 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 14 వేల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది. ప్రాజెక్టు సామర్థ్యం 90.31 టీఎంసీలు కాగా ప్రస్తుతం 56.6 టీఎంసీల నిల్వ ఉంది. కాగా ఇప్పటికే ఎల్లంపల్లి, కడెం ప్రాజెక్టులు పూర్తిస్థాయి మట్టాలకు చేరాయి. వీటికి కూడా వరద వస్తుండడంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. గోదావరి బేసిన్ పరిధిలోని చెరువులకు కూడా భారీగా నీరు వచ్చి చేరుతోంది. శుక్రవారం ఒక్క రోజే 3 వేలకు పైగా చెరువులు అలుగు పారినట్లు నీటిపారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి.