ముంచెత్తిన వాన
రాష్ట్రవ్యాప్తంగా పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు అలుగు పోస్తున్న చెరువులు, కుంటలు
- పలు గ్రామాలకు రాకపోకలు బంద్
- నల్లగొండ జిల్లాలో పరవళ్లు తొక్కుతున్న మూసీ
- వందల ఎకరాల్లో పంట నష్టం
- బీబీనగర్- పోచంపల్లి మధ్య రాకపోకలు బంద్
- వరంగల్, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లోనూ వానలు
- వరంగల్ జిల్లాలో వాగు దాటుతూ యువకుడు గల్లంతు
సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. ప్రధాన రహదారులపైనా రాకపోకలు నిలిచిపోయాయి. వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. నల్లగొండ జిల్లాలో కుండపోత వానలతో మూసీ పరవళ్లు తొక్కుతోంది. పులిచింతల ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరుతుండడంతో ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. వరంగల్ జిల్లాలో వాగులో పడి ఓ యువకుడు గల్లంతయ్యాడు.
నల్లగొండ నిండా నీళ్లు
నల్లగొండ జిల్లాలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మూసీ నది పరవళ్లు తొక్కుతోంది. గురువారం కురిసిన భారీ వర్షానికి పలు పట్టణాల్లో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల ఇళ్లలోకి నీరు చేరింది. వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పిడుగురాళ్ల-గుంటూరు మధ్యలో రైల్వే ట్రాక్‌లు దెబ్బతినడంతో జిల్లా మీదుగా నడిచే అన్ని రైళ్లను రద్దు చేశారు. ఇక ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో డిండి ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరింది. మూసీ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పోచంపల్లి, బీబీనగర్ మధ్య.. పోచంపల్లి చెరువు అలుగుపోయడంతో రేవనపల్లి వైపు రాకపోకలు నిలిచిపోయాయి. కట్టంగూర్ మండలంలోని చెరువులు, కుంటలన్నీ అలుగుపోస్తున్నాయి. ఈదులూరు, ఆరెగూడెం, పందెనపల్లి గ్రామాల్లో వరి నీట మునిగింది. చిట్యాల మండలం చిన్నకాపర్తిలో మూడు ఇళ్లు కూలిపోయాయి. కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టు నుండి ఐదు గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. కేతేపల్లి-కొత్తపేట మధ్య మూసీ ప్రాజెక్టు కుడి కాల్వకు గండిపడింది. మేళ్లచెరువు మండలం వజినేపల్లి వద్ద ఉన్న పులిచింతల ప్రాజెక్టులోకి ఏకంగా మూడు లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరుతోంది. ప్రాజెక్టు ముంపు గ్రామాలైన చింతిర్యాల, రేబల్లె, అడ్లూరు, వెల్లటూరు, నెమలిపురి వాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు.
ఖమ్మం, పాలమూరుల్లో ప్రాజెక్టులు ఫుల్
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఖమ్మం జిల్లాలో ప్రాజెక్టులు దాదాపు నిండాయి. గురువారం పాల్వంచ మండలం కిన్నెరసాని ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండడంతో 7 గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. ఇల్లెందు మండలం గుండాలలో అత్యధికంగా 6.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా జోరుగా వానలు కురుస్తున్నాయి. వాగులు పొంగి ప్రవహిస్తుండడంతో తెల్కపల్లి మండలం తాళ్లపల్లి, నడిగడ్డ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తెల్కపల్లి నుంచి నాగర్‌కర్నూల్‌కు వెళ్లే మార్గంలోని దేవమ్మ చెరువు పొంగి పొర్లుతోంది. నడిగడ్డలో గుట్టలపల్లి దుందుబీ వాగు పొంగి ప్రవహిస్తోంది. వాన ధాటికి మానవపాడు మండలంలో పలు ఇళ్లు కూలిపోయాయి.
పొంగి ప్రవహిస్తున్న వాగులు
నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. నవీపేట, ఎడపల్లి, భీంగల్ మండలాల్లో ఏడు సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. లింగంపేట మండలంలో పెద్దవాగు, పాముల వాగు పొంగి ప్రవహిస్తున్నాయి. మద్నూర్ మండలంలో లెండి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇక్కడి లోలెవల్ వంతెన నీట మునగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లావ్యాప్తంగా గురువారం 11 ఇళ్లు ధ్వంసమయ్యాయి. నిజాంసాగర్‌లోకి నీరు వచ్చి చేరుతోంది. జుక్కల్ మండలంలోని కౌలాస్‌నాలా ప్రాజెక్టులో ఒక గేటు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
వరంగల్‌లో యువకుడు గల్లంతు
వరంగల్ జిల్లావ్యాప్తంగా గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో పలు చోట్ల మొక్కజొన్న, వరి పంటలు దెబ్బతిన్నాయి. హన్మకొండలో లోతట్టు ప్రాం తాల్లోని ఇళ్లలోకి వరదనీరు చేరింది. ప్రధాన రహదారులు నీట మునగడంతో రాకపోకలకు ఆటంకం కలిగింది. చిట్యాల మండలం టేకుమట్ల గ్రామ శివారులో చలివాగును దాటుతూ.. మొగుళ్లపల్లి మండలం రాఘవరెడ్డిపేటకు చెందిన వంగ మహేష్ (19) అనే యువకుడు గల్లంతయ్యాడు. కేసముద్రం వ్యవసాయ మా ర్కెట్‌లో దాదాపు 120 క్వింటాళ్ల మొక్కజొన్న తడిసిపోయింది.