63 టీఎంసీలు గోదావరి పాలు
63 టీఎంసీలు గోదావరి పాలు
Published Tue, Sep 27 2016 2:16 PM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM
బాల్కొండ : భారీ వరదలతో ప్రాజెక్టుల్లో జలకళ ఉట్టిపడుతోంది. శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టుల గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో శనివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు రెండు ప్రాజెక్టుల ద్వారా 63 టీఎంసీల నీరు గోదావరి పాలయ్యింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద కొనసాగుతోంది. సోమవారం ఎగువ ప్రాంతాలనుంచి 3 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది.
దీంతో 41 గేట్ల ద్వారా 2 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి వదులుతున్నారు. శనివారం నుంచి సోమవారం సాయంత్రం వరకు 50 టీఎంసీల నీటిని గోదావరిలోకి వదిలామని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. అంటే ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యంలో సగానికంటే ఎక్కువ నీరు గోదావరి పాలైందన్నమాట. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,091(90 టీఎంసీలు) అడుగులు కాగా సోమవారం సాయంత్రానికి 1,090(84 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది.
17.34 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి..
ఎస్సారెస్పీ జెన్‌కో గేట్ల ద్వారా 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 2 వేల క్యూసెక్కుల నీరు కాకతీయ కాలువ ద్వారా, 2 వేల క్యూసెక్కుల నీరు ఎస్కేప్ గేట్ల ద్వారా వదులుతున్నారు. దీంతో జల విద్యుతుత్పత్తి కేంద్రంలో రెండు టర్బయిన్ల ద్వారా 17.34 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది.
పర్యవేక్షిస్తున్న అధికారులు..
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌నుంచి గోదావరిలోకి నీటి విడుదల కొనసాగుతుండడంతో ప్రాజెక్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు ప్రాజెక్ట్ వద్ద ఉండి పర్యవేక్షిస్తున్నారు. ప్రాజెక్ట్ సీఈ శంకర్, ఎస్‌ఈ సత్యనారాయణ, ఈఈ రామారావు, ఆర్డీవో యాదిరెడ్డి , తహసీల్దార్ పండరీనాథ్ పర్యవే క్షణ చేస్తున్నారు.
నిజాంసాగర్‌లోకి 1.40 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
నిజాంసాగర్ : నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి సోమవారం 1.40 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంద ని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. 19 వరదగేట్ల ద్వారా లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నామన్నారు. ప్రాజెక్టు వరదగేట్ల ద్వారా ఆదివారం సాయంత్రంనుంచి సోమవారం సాయంత్రం వరకు 13 టీఎంసీల నీటిని గోదావరి నదిలోకి విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. సింగితం రిజర్వాయర్‌లోకి 2,500 క్యూసెక్కుల వరదనీరు వస్తోంది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం 416 మీటర్లతో నిండుకుండలా ఉంది. అదనంగా వస్తున్న వరదనీరు అలుగుపై నుంచి పొంగిపొర్లుతోంది. కళ్యాణి ప్రాజెక్టు రెండు వరదగేట్ల ద్వారా 1,500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. మండలంలోని నల్లవాగు మత్తడి దుంకుతోంది. మత్తడికి 8,500 క్యూసెక్కుల వరదనీరు వస్తుండడంతో అంతే నీరు మత్తడి అలుగెల్లుతోంది.
రామడుగులోకి..
ధర్పల్లి : జిల్లాలోని మధ్య తరహా ప్రాజెక్టు అయిన రామడుగులోకి సోమవారం 11 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,278.30 అడుగులతో నిండుగా ఉంది. అధిక నీరు అలుగుపైనుంచి ఔట్‌ఫ్లోగా వెళ్తోంది.
కొనసాగుతున్న కౌలాస్‌నాలా నీటి విడుదల
జుక్కల్ : కౌలాస్ నాలా ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. ఎగువ ప్రాంతంనుంచి నాలుగు వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోందని ప్రాజెక్టు జేఈ గజానన్ తెలిపారు. దీంతో ఒక గేటు ద్వారా మూడు వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నామన్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్ల(1.2 టీఎంసీలు)తో నిండుగా ఉంది.
Advertisement
Advertisement