మత్తడి దుంకుతున్న 15,608 చెరువులు..
8,144 చెరువులు 75–100 శాతం మేరకు నిండాయి
5,012 చెరువుల్లో 50–75 శాతం మేరకు నీరు
శ్రీశైలం 10 గేట్లు, సాగర్ 26 గేట్ల ద్వారా నీటి విడుదల
సాక్షి, హైదరాబాద్/దోమలపెంట/నాగార్జునసాగర్: భారీ వర్షాలతో చెరువులకు జలకళ సంతరించుకుంది. దీంతో ఈసారి పంటలకు నీటి సమస్య తలెత్తే అవకాశం లేదు. రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం బాగా పెరుగుతోంది. కోటి పది లక్షల ఎకరాలకుపైగా పంటలు సాగైనట్టు వ్యవసాయశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి, నీటిపారుదల శాఖ మొత్తం 19 డివిజన్లుగా విభజించగా, వాటి పరిధిలోని చీఫ్ ఇంజనీర్లు, ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు ఇచి్చన సమాచారం మేరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 34,176 చెరువులు ఉంటే.. అందులో 15,608 చెరువులు పూర్తిగా మత్తడి దుంకుతున్నాయి.
5,952 చెరువులు మాత్రం ఇంకా 50 శాతం కంటే తక్కువ నీరు ఉన్నట్టు నీటిపారుదలశాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 75 నుంచి 100 శాతం మేరకు నిండిన చెరువులు 8,144 ఉన్నాయి. ఇవికాక 50–75 శాతం మేరకు నిండిన చెరువులు మరో 5,012 వరకు ఉన్నట్టు ఆ వర్గాలు వెల్లడించాయి. వర్షాకాల సీజన్ ఈనెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో ఈ మధ్యలో పడే వర్షాలకు మిగిలిన చెరువులు కూడా పూర్తిస్థాయిలో నిండుతాయన్న ఆశాభావాన్ని నీటిపారుదలశాఖ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
వర్షాలతో భూగర్భజల నీటిమట్టం కూడా పెరుగుతుందని, తద్వారా నీటి సమస్య ఉండదని అధికారులు చెబుతున్నారు. 50 శాతంలోపు నిండిన చెరువుల్లోకి కూడా నీరు వచ్చి చేరితే, ప్రాజెక్టులు, రిజర్వాయర్లతోపాటు, అన్ని జలాశయాలు పూర్తిస్థాయి నిండినట్టు అవుతుందని అంటున్నారు.
మేడిగడ్డ వద్ద ఉధృతంగా గోదావరి
మేడిగడ్డ వద్ద గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. మేడిగడ్డ బరాజ్ నుంచి 9.02 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. దాని ఎగువన ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుండగా, వచ్చిన వరదను వచ్చినట్టే వదిలేస్తున్నారు. శ్రీరాంసాగర్‌కు 2.45 లక్షల క్యూసెక్కుల వరద వస్తుంటే.. దిగవనకు 2.40 లక్షల క్యూసెక్కుల నీటిని వదిలిపెడుతున్నారు.
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 4.72 లక్షల క్యూసెక్కులు వస్తుంటే.. దిగువకు అంతేస్థాయిలో నీటిని విడుదల చేస్తున్నారు. ఇక సమ్మక్కసాగర్(తుపాకులగూడెం) బరాజ్‌లో నుంచి 7.23 లక్షల క్యూసెక్కుల నీరు, సీతమ్మసాగర్(దుమ్ముగూడెం) నుంచి 7.55 లక్షల క్యూసెక్కుల వరద దిగువకు వెళ్తోంది.
శాంతిస్తున్న కృష్ణమ్మ
ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి భారీస్థాయిలో నీటి ప్రవాహం లేకపోయినా.. క్యాచ్‌మెంట్ ఏరి యాల్లో పడిన వర్షంతో జూరాల నుంచి 2.09 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలంలోకి వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 4.16 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుంటే.. దిగువకు పదిగేట్లు ఎత్తి 3.61 లక్షల క్యూసెక్కుల నీరు వదులుతున్నారు.
నాగార్జునసాగర్ డ్యాంలోకి 3.04 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంటే.. అంతే మొత్తాన్ని ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తి దిగువన ఉన్న పులిచింతలకు వదిలేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment