చెరువులు ఎప్పడు తెగుతాయోననే భయం | Heavy Rain Dangerous Flowing Of All Ponds And Lakes In Hyderabad | Sakshi
Sakshi News home page

ప్రమాదకర స్థాయికి  చెరువులు 

Published Thu, Oct 22 2020 8:38 AM | Last Updated on Thu, Oct 22 2020 8:58 AM

Heavy Rain Dangerous Flowing Of All Ponds And Lakes In Hyderabad - Sakshi

మహోగ్రంగా మూసీ ప్రవాహం..

జీవన గమనానికి కల్పతరువులుగా ఉండాల్సిన చెరువు లు వరదనీటితో వణికిస్తు న్నాయి. బతుకుదెరువుకు బాటలు వేయాల్సిన తటాకాలు ప్రజలు తల్లడిల్లేలా పరిణమిస్తున్నాయి. ఇటీవల కురుస్తున్న భారీ  వర్షాలతో నిండుకుండల్ని తలపిస్తున్నాయి. కట్టలు తెంచుకుంటున్నాయి. ముంపు ప్రాంతాల కాలనీలను ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే ప్రమాదకర స్థాయిలో  నిండిన మహానగర పరిధిలోని పలు చెరువులు ఎప్పడు తెగుతాయోననే భయంతో సిటీజనులు క్షణమొక యుగంగా గడుపుతున్నారు. ఇప్పటికే కొన్ని చెరువులు తెగి బస్తీలను, కాలనీలను వరద ముంచెత్తాయి. ఆ భయానక పరిస్థితి నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. మరోసారి భారీ వర్షా లు కురిస్తే మాత్రం చాలా చెరువులు తెగిపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఆయా చెరువుల పరిస్థితిపై ‘సాక్షి’ ఫోకస్‌.  

మూసీతో.. ముప్పే 

  • ఇరువైపులా గోడల నిర్మించాలి  

సాక్షి, హైదరాబాద్‌: నగరాన్ని వానలు, వరదలు ముంచెత్తుతున్నాయి. మూసీ నది ప్రమాదకర స్థాయిలో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. జనావాసాల మధ్య ప్రవహించే మూసీ ప్రదేశాల్లో ఎత్తయిన గోడలు లేకపోవడంతో నీటిలో మునుగుతున్నాయి. 1908లో వచ్చిన వరదల అనంతరం నీటిలో మునిగిన, కొట్టుకుపోయిన బస్తీల వద్ద మూసీ ఇరువైపులా ఎత్తయిన గోడలు నిర్మించారు. అప్పటి వరదలకు పూరానాపూల్‌ నుంచి చాదర్‌ఘాట్‌ వరకు భారీ నష్టం వాటిల్లింది. దీంతో మూసీ ప్రవహించే ఈ ప్రదేశంలో దాదాపు 60– 70 అడుగులో ఎత్తులో రెండువైపులా గోడలు నిర్మించారు. దీంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కొన్ని బస్తీలు సేఫ్‌గా ఉన్నాయి. అదే మూసీ ప్రహించే ప్రదేశాల్లో పురానాపూల్‌కు అటు వైపు. చాదర్‌ఘాట్‌కు ఇటువైపు ఉన్న బస్తీలన్నీ నీటిలో మునిగాయి. మరోవైపు ఈ ప్రాంతాల వద్ద గోడలు లేకపోవడంతో మూసీ ఉద్ధృతంగా ప్రవహించింది. దీంతో ఎక్కువ నష్టం జరిగిందని నిపుణులు చెబుతున్నారు.
 

  • మొదటి వంతెన పురానాపూల్‌. ఇక్కడి నుంచి మూసీ ఉగ్రరూపం దాలుస్తోంది. చాదర్‌ఘాట్‌ దాటే వరకు ఇలాగే కొనసాగుతోంది.   
  • నిజాం హయాలో నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో మూసీ నిర్వహణ చేసేవారు.  
  • 1963 వరకు మూసీ నీరు చాలా పరిశుభ్రంగా ఉండేది. 
  • అప్పట్లో వేసవి కాంలో మూసీలో పూడిక తీసేవారు. నీటి ప్రవాహంతో కొట్టుకువచ్చిన ఇసుకను తీసేవారు.   
  • మూసీ శుద్ధీకరణ కోసం ప్రత్యేక ప్రతి ఏటా నిజాం హయాంలో బడ్జెట్‌ కేటాయింపులు ఉండేవి.  
  • మూసీ నది పరీవాహక ప్రాంతాల్లోని మురికివాడల్లో సుమారు 20 వేల మందికిపైగా ప్రజలు  నివసిస్తున్నారని అంచనా.   


బిక్కుబిక్కున.. 15 కాలనీలు 
దిల్‌సుఖ్‌నగర్‌: మహేశ్వరం నియోజకవర్గంలో బాలాపూర్‌ మండల పరిధిలో సుమారు 20 వరకు చెరువులు, కుంటలు నీటితో నిండి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా మంత్రాల చెరువు,పెద్ద చెరువు, సందె చెరువుల నుంచి టీఎస్‌ఆర్‌ నగర్, జనప్రియ మహానగర్, ఎంఎల్‌ఆర్‌ కాలనీ, లక్ష్మీనర్సింహపురి కాలనీ, మిథిలానగర్, సత్యసాయినగర్, వివేక్‌నగర్‌ పరిసర 15 కాలనీలకు తీవ్ర ప్రమాదం పొంచి ఉంది.
   

ఎల్‌బీనగర్‌ పరిధిలో.. 
చంపాపేట: ఎల్‌బీనగర్‌ పరిధిలోని బైరామల్‌గూడ, సరూర్‌నగర్‌ చెరువు, నాగోల్‌ డివిజన్‌లోని బండ్లగూడ చెరువు, నాగోల్‌ చెరువు, మన్సూరాబాద్‌ పెద్ద చెరువు మన్సురాబాద్‌ పెద్ద చెరువు, హయత్‌నగర్‌ డివిజన్‌లోని కుమ్మరికుంట చెరువు,  బీఎన్‌రెడ్డి డివిజన్‌లోని కప్పల చెరువు, బతుకమ్మకుంట చెరువు నిండు కుండలను తలపిస్తున్నాయి. వీటి కట్టలు తెగిపోతే దిగువనున్న కాలనీలు నీటమునిగే ప్రమాదం ఉంది.

పొంగిపొర్లితే ప్రమాదకరమే..
గోల్కొండ: భారీ వర్షాలతో గోల్కొండ కోట ప్రహరీని ఆనుకుని ఉన్న శాతం చెరువు ప్రమాదకరంగా మారింది. ఈ చెరువు కట్ట తెగితే సుమారు 15 కాలనీలు నీట మునుగుతాయి.  
షేక్‌పేట్‌ అంబేడ్కర్‌ నగర్‌లోని కొత్త చెరువు సైతం వర్షాలకు నిండుకుండలా మారింది.  ఈ చెరువు కట్ట నుంచి నీరు పొంగిపొర్లితే సుమారు 10 బస్తీలు నీట మునుగుతాయి.  మారుతీనగర్‌లోని ఎర్రకుంట చెరువులో వరద నీరు నిండుతోంది. దీని కట్ట తెగితే లేదా పొంగిపొర్లితే దీని దిగువన ఉన్న 5 కాలనీలు నీట మునిగే పరిస్థితి.

కుత్బుల్లాపూర్‌లో నిండుకుండలు.. 
కుత్బుల్లాపూర్‌: కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ పరిధిలో చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. నిజాంపేట్‌లోని తుర్క చెరువు, బాచుపల్లిలోని భైరవుని చెరువు, మేడికుంట, మద్దెల కుంటలు పూర్థిస్థాయిలో నిండాయి. ప్రగతినగర్‌లోని అంభీర్‌ చెరువులో సగం మేర నీళ్లు ఉన్నాయి. సూరారంలోని కట్టమైసమ్మ చెరువులో పూర్తిస్థాయిలో నీటి మట్టం చేరుకుంది. ఫాక్స్‌ సాగర్‌ చెరువు ఇప్పటికే నిండిపోగా నీటిని బయటకు వదులుతున్నారు. కేవలం నిజాంపేట్‌లోని తుర్క చెరువు నిండితేనే బండారి లేఅవుట్‌లోని మొత్తం ప్రాంతం నీట మునుగుతోంది. జీడిమెట్ల ఫాక్స్‌ సాగర్‌ తూము తెరిస్తే సుభాష్‌నగర్‌ నుంచి పాపయ్య యాదవ్‌నగర్‌ దాకా నాలాకు ఇరువైపులా ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
 
పల్లె చెరువు మళ్లీ తెగితే ప్రమాదమే..
చాంద్రాయణగుట్ట: చాంద్రాయణగుట్ట పరిధిలో ఇప్పటికే రెండు చెరువులు తెగి బస్తీలను ముంచెత్తాయి. గత వారం తెగిన పల్లె చెరువు కట్టను అధికారులు పూడ్చివేశారు. ఈ చెరువు మళ్లీ తెగితే దిగువన ఉన్న అలీ నగర్, హాషామాబాద్, అల్‌జుబేల్‌ కాలనీ, జీఎం కాలనీ, జీఎం చావునీ, ఉప్పుగూడ నీట మునిగే అవకాశం ఉంది. మూడు రోజుల క్రితం తెగిన గుర్రం చెరువు కట్టను ఇంకా పూడ్చలేదు. ప్రస్తుతం వచ్చిన నీరు వచ్చినట్లుగా దిగువకు వెళుతోంది. ఈ చెరువుకు ఎగువన ఉన్న బురాన్‌ఖాన్‌ చెరువు తెగితే పాతబస్తీని ముంచెత్తే ప్రమాదం ఉంది.

హిమాయత్‌సాగర్‌కు కొనసాగుతున్న వరద 
సాక్షి, హైదరాబాద్‌: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జంట జలాశయాలకు వరద పోటెత్తుతోంది. బుధవారం సాయంత్రం 6 గంటల వరకు హిమాయత్‌సాగర్‌ జలాశయంలోనికి 1,300 క్యూసెక్కుల వరద నీరు చేరిందని.. రెండు గేట్లు ఎత్తి మూసీలోకి 1372 క్యూసెక్కుల నీటిని వదిలి పెట్టినట్లు జలమండలి అధికారులు 
తెలిపారు. ప్రస్తుతం ఈ జలాశయం పూర్తిస్థాయిలో 1763.5 అడుగుల నీటి నిల్వ ఉంది. ఉస్మాన్‌సాగర్‌ జలాశయంలోనికి 833 క్యూసెక్కుల వరద నీరు చేరిందన్నారు. ఈ జలాశయం గరిష్టమట్టం 1790 అడుగులు కాగా.. ప్రస్తుతం 1785.848 అడుగుల మేర నిల్వలున్నాయన్నారు.  

భయం గుప్పిట్లో లోతట్టు ప్రాంతాలు.. 
కంటోన్మెంట్‌: కంటోన్మెంట్‌ పరిధిలోని, ఎగువన ఉన్న చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. చెరువుల్లోకి కొత్తగా ఏమాత్రం వరద వచ్చినా లోతట్టు ప్రాంతాలు మళ్లీ మునిగే ప్రమాదం ఉంది. 

  • బోయిన్‌ చెరువు అలుగు (హస్మత్‌పేట నాలా) ఉప్పొంగితే బోయిన్‌పల్లి పరిధిలోని 40కి పైగా కాలనీలు మళ్లీ నీటమునిగే ప్రమాదముంది.  
  • రామన్నకుంట చెరువులో వరద నీరు ఎక్కువైతే బ్యాక్‌ వాటర్‌ వల్ల సీతారాంపూర్‌ పరిధిలోని ఐదారు కాలనీలు నీట మునిగి ఇళ్లలోకి నీరు చేరుతుంది.  
  • హస్మత్‌పేట నాలా, పికెట్‌ నాలాలు కలిసి ప్రవహించే రసూల్‌పురా ప్రాంతంలో వందలాది నివాసాలు ముంపునకు గురయ్యే ప్రమాదముంది.

వరదలా.. మొయిన్‌ చెరువు
అంబర్‌పేట: ఉస్మానియా యూనివర్సిటీ అటవీ ప్రాంతంలో ఉన్న మొయిన్‌ చెరువు అంబర్‌పేట నియోజకవర్గాన్ని వరద ప్రవాహంతో ముంచెత్తుతుంది. ఈ చెరువు నుంచి వచ్చే వరద ప్రవాహంతో  పరీవాహక ప్రాంతాలకు సమస్య లేకుండా ఉండాలంటే నాలాల విస్తరణే పరిష్కారం.
 
అనూహ్యమైతే.. భారీ నష్టమే.. 
ఉప్పల్‌: ఉప్పల్‌ జోన్‌ పరిధిలో దాదాపు చెరువులు, కుంటలు కలిపి మొత్తం 14 ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి, రామంతాపూర్‌ పెద్ద చెరువు, ఉప్పల్‌ నల్ల చెరువు, నాచారం హెచ్‌ఎంటీ చెరువు, ఎర్రకుంట చెరువు, కాప్రా చెరువులు ముఖ్యమైనవి. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తుండటంతో చెరువులన్నీ నిండు కుండల్లా ఉన్నాయి. ఏదైనా అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటే భారీగా ఆస్తి, ప్రాణ నష్టం కలిగే ప్రమాదం ఉంది. 

  • రామంతాపూర్‌ పెద్ద చెరువు: ఈ చెరువుకు ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతం నుంచి నీరు వస్తుంది. చెరువు స్థలం కోర్టు వివాదంలో ఉంది. దీంతో ఎఫ్‌టీఎల్‌ పరిధిలో సైతం అక్రమ నిర్మాణాలు చేపట్టారు. చెరువు తెగే పరిస్థితి లేకపోయినప్పటికీ అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటే ఈ  చెరువు కిందే ఉన్న చిన్న చెరువుపై కూడా ఆ ప్రభావం పడుతుంది. దీంతో  పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లే అవకాశం ఉంది.  
  • రామంతాపూర్‌ చిన్న చెరువు: విస్తీర్ణం 19.9 ఎకరాలు. ప్రస్తుతం ఉన్నది 11 ఎకరాలు. రామంతాపూర్‌ పెద్ద చెరువు నుంచి వరద నీరు చిన్న చెరువులోకి వెళ్తుంటాయి. అనుకోని సంఘటనలు జరిగితే చెరువు దిగువ భాగంలో ఉన్న దాదాపు 20 బస్తీలు ముంపునకు గురయ్యే ప్రమాదం పొంచి ఉంది. 

వరద వస్తే ముప్పే.. 
నాచారం హెచ్‌ఎంటీ నగర్‌ చెరువు: నాలాలతో పాటు నాచారం ఎర్రకుంట చెరువులోని నీరు ఇందులోకి వస్తోంది. చెరువు నాచారంలో ఉన్నా.. చెరువు కింది భాగం చెరువు కట్టగాని, మత్తడిగాని పూర్తిగా ఉప్పల్‌ వైపు ఉంటుంది. భారీగా వరద వస్తే చెరువు వు కింది 20 కాలనీలు ముంపునకు గురవుతాయని అంచనా. 

అలుగు లేక నాలాలోకి.. 
నాచారం పటేల్‌ కుంట చెరువు: ఈ చెరువుకు ఎలాంటి అలుగు లేదు. నీరు అధికంగా వస్తే  అలుగు ప్రాంతంలో నిర్మించిన వంతెనపై నుంచి నీరు పారుతూ నాలాలోకి వెళ్తుంది.  అనుకోని సంఘటనలు జరిగితే 10 కాలనీలు. నాచారం ఈఎస్‌ఐ ఆస్పత్రి, నాచారం పోలీస్‌ స్టేషన్‌ పూర్తిగా నీటి మునుగుతాయి. 

కట్ట తెగితే ఇక్కట్లే..  
కాప్రా చెరువు:  దీనికి రెండు తూములు ఉన్నా యి. వర్షాలకు వరద నీరు ఎక్కువగా వస్తే చెరువు ఒక వైపు మత్తడి పోస్తుంది. మత్తడి నీరు పోవడానికి  నాలా  ఉంది. చెరువుకట్ట తెగితే దీనికింద ఉన్న 8 కాలనీలు ముంపునకు గురవుతాయి.  

ముంచెత్తిన వరద నీరు 
ఉప్పల్‌ నల్ల చెరువు: ఒక వైపు పూర్తిగా వరద నీరు వెళ్లేందుకు గండి కొట్టి ఉంది. ప్రస్తుతం వచ్చిన వరద నీరు సైతం వెళ్లిపోతోంది. చెరువు మధ్యలో బండ్‌ ఏర్పాటు చేయడం వల్ల వరద నీరు డైవర్ట్‌ అయి కాలనీలను ముంచెత్తింది. 

ప్రమాదకరంగా పరికి చెరువు 
కూకట్‌పల్లి: కూకట్‌పల్లి జంట సర్కిళ్లు, బాలానగర్, కూకట్‌పల్లి మండలాల పరిధిలో 14 చెరువులు ఉన్నాయి. వీటిలో 5 చెరువులు ప్రమాదకరస్థాయిలో ఉన్నాయి. పరికి చెరువుకు భారీ స్థాయిలో నీరు చేరింది.   

  • రంగధాముని చెరువు మత్తడి పడుతోంది. మూసాపేటలోని కాముని చెరువు, మైసమ్మ చెరువులు ప్రమాదకర స్థాయిలో నిండిపోయాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement