మరో 18 టీఎంసీలు చేరితే పూర్తిస్థాయి నీటిమట్టం
ఇప్పటికే 1.37 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో..
నేడు గేట్లు ఎత్తే అవకాశం
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టుకు వారం, పది రోజులుగా స్థిరంగా కొనసాగుతున్న ప్రవాహాలతో ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యానికి చేరువలో ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 197.46 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువనున్న కర్ణాటక నుంచి వస్తున్న ప్రవాహాలతో జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలానికి ఇన్‌ఫ్లో 1.37 లక్షల క్యూసెక్కుల మేర కొనసాగుతోంది. అక్కడి నుంచి 77 వేల క్యూసెక్కుల మేర నీటిని దిగువకు వదులుతున్నారు.
ప్రాజెక్టులోకి మరో 18 టీఎంసీలు చేరితే పూర్తి స్థాయి మట్టానికి చేరుకోనుంది. దీంతో బుధవారం ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు నాగార్జునసాగర్‌కు 73 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా ప్రస్తుత నిల్వ 153.13 టీఎంసీలకు చేరింది. కాగా, గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టుల్లోనూ నీటి ప్రవాహాలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రధాన ప్రాజెక్టులన్నింటిలోకి భారీ ఇన్‌ఫ్లో నమోదవుతుండటంతో అన్ని ప్రాజెక్టుల గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
30 వేల చెరువులు ఫుల్!
ప్రస్తుత వర్షాలతో రాష్ట్రంలోని చెరువులన్నీ నిండుకుండల్లా మారాయి. మొత్తంగా 43 వేల చెరువులకుగానూ ప్రస్తుతం 20 వేల చెరువులు పొంగిపొర్లుతుండగా మరో 10 వేల చెరువులు 90 శాతం నీటితో కళకళ్లాడుతున్నాయి. మరో 6 వేల చెరువులు 75 శాతం నిండాయి. ఇందులో ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లోనే ఎక్కువగా ఉన్నాయని నీటిపారుదల శాఖ లెక్కలు చెబుతున్నాయి.
పూర్తి నిల్వకు చేరువలో శ్రీశైలం
Published Wed, Sep 28 2016 2:53 AM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
Advertisement
Advertisement