ప్రతి పల్లే.. నందనవనమే.. | Siddipet district turned as green city | Sakshi
Sakshi News home page

ప్రతి పల్లే.. నందనవనమే..

Published Sun, Nov 12 2017 3:16 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

Siddipet district turned as green city - Sakshi

ఏ పల్లె లోగిళ్లు చూసినా ఆకుపచ్చ తోరణం..ఊర్లోకి అడుగు పెట్టగానే పలకరించే పచ్చదనం..రహదారులకు ఇరువైపులా మొక్కల సోయగం..మొక్కల పెంపకానికి ప్రతీ గ్రామంలో హరిత సైన్యం..399 పంచాయతీలు.. 1,300 కి.మీ. మేర నందనవనం..
హరితకోటగా మారుతున్న సిద్దిపేట జిల్లా గురించి ప్రస్తుతం వినిపిస్తున్న మాట ఇదీ. కిందటి ఏడాది వరకూ సిద్దిపేట పట్టణం వరకే ఉన్న ఈ హరితనందనం.. ఇప్పుడూ సిద్దిపేట జిల్లాలోని ప్రతి పల్లెకూ విస్తరించింది. ఏ పల్లె లోగిళ్లలోకి తొంగి చూసినా ఆకుపచ్చ తోరణం కంటికి ఇంపుగా కనిపిస్తోంది. ఊర్లోకి అడుగు పెట్టగానే పచ్చదనం పలకరిస్తోంది. ఊర్లో నుంచి ఊరు బయటకు, అక్కడి నుంచి పల్లె పొలిమెరకు రహదారులకు ఇరువైపులా పరుచుకుంటున్న ఆకుపచ్చ సోయగం అందరినీ అబ్బురపరుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న సిద్దిపేట జిల్లాపై ఈ వారం ‘సాక్షి ఫోకస్‌’..
– సాక్షి, హైదరాబాద్‌

రొటీన్‌కు భిన్నంగా..
ఈసారి హరితహారం పథకాన్ని రొటీన్‌ కంటే భిన్నంగా, ఒక లక్ష్యంతో అమలు చేసేందుకు మార్చి–ఏప్రిల్‌ మాసంలో కలెక్టర్‌ వెంకట్రామరెడ్డి ప్రణాళిక రూపొందించారు. హరితహారంను మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకం(ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్‌)తో అనుసంధానం చేశారు. దీంతో ఆర్థిక వెసులుబాటు లభించడంతో పాటు ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కార్డు ఉన్న వారికి 100 రోజులు పని ఇచ్చినట్లు అయింది. ఇప్పుడు పక్కాగా ఆ ప్రణాళిక ప్రకారమే హరితహారం సాగుతోంది. గట్టు, పుట్టా, గుడి, గడి, బడి, మసీదు, ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కార్యాలయాలు ఇలా ఎక్కడ ఖాళీ ప్రదేశం ఉన్నా అక్కడ మొక్కలు నాటారు. ఒక్కో మున్సిపాలిటీలో 4 లక్షల పూలు, 10 లక్షల పండ్ల మొక్కల చొప్పున వేశారు.

ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు, కార్యాలయాల్లో 50 వేల మొక్కలు నాటారు. 10 లక్షల మొక్కలతో ఈత వనాలు పెంచారు. 1,300 కిలోమీటర్ల మేర 1.25 కోట్ల మొక్కలను ఎవెన్యూ ప్లాంటేషన్‌ చేశారు. అటవీ భూములు, ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలు, రాజీవ్‌ రహదారిలో చెట్లు నాటి సంరక్షించే బాధ్యతను అటవీ, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ శాఖలకు అప్పగించారు. రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటి వాటిని పూర్తిగా సంరక్షించే విధంగా కార్యాచరణ రూపొందించారు. గ్రామ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, గ్రామంలో గుర్తింపు ఉన్న వ్యక్తుల పలుకుబడిని మొక్కల పెంపకంలో వినియోగించుకున్నారు. మొక్కలు పెంచిన వారి పేర్లు చరిత్రలో నిలిచిపోయే విధంగా.. మొక్కను నాటి, వాటిని సంరక్షించే వాళ్ల పేర్ల మీద సైన్‌ బోర్డులు పెట్టారు. ప్రతి నెలలో ఒకసారి ‘యాజమాన్య రోజు’గా జరుపుకుంటున్నారు. ఈ రోజున కచ్చితంగా మొక్కలకు నీళ్లు పట్టటంతో పాటు, చనిపోయిన పాదులను గుర్తించి వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటుతున్నారు.

ఇబ్రహీంపూర్‌..చైతన్యానికి మారుపేరు..
ఇబ్రహీంపూర్‌.. ఇదో చైతన్యవంతమైన గ్రామం. వంద శాతం నగదు రహిత లావాదేవీలను సాధించిన ఊరు. దేశంలోనే దోమలు లేని తొలి గ్రామంగా అవతరించిన పల్లె. ఈ ఊరు నిండా చెట్లే ఉన్నాయి. 500 కుటుంబాలు ఉన్న ఈ పల్లె పరిధిలో 2.70 లక్షల మొక్కలు జీవం పోసుకున్నాయి. ఇంటి ముంగిళ్లు, పొలంగట్లు, బడి, గుడి, శ్మశానం, రహదారులు ఇలా ఎక్కడ చూసినా మొక్కలే కనిపిస్తున్నాయి. ప్రతి గ్రామం పొలిమెరకు వెళ్లగానే.. పచ్చదనం కప్పుకున్న చెట్లు స్వాగతం పలుకుతున్నాయి. గ్రామంలోని ప్రతీ మనిషి సగటున ఆరు మొక్కలకు పైగా నాటారంటే వారికి ప్రకృతిపై ఎంత ప్రేముందో అర్థం చేసుకోవచ్చు. వేర్వేరు ఎత్తుల్లో పెరుగుతున్న ఈ మొక్కలు ఇప్పుడు ఊరంతా పరుచుకున్నాయి.

చిట్టాపూర్‌.. ఈతవనాలకు చిరునామా..
దుబ్బాక మండలం చిట్టాపూర్‌ గ్రామం ఈత వనాలకు చిరునామాగా మారింది. ప్రస్తుతం ఇక్కడ ఈతవనాలు వేగంగా ఎదుగుతున్నాయి. ఎంతగా అంటే.. మరో రెండేళ్లలో 40 గీత కార్మిక కుటుంబాలకు ఇవి జీవనాధారం అయ్యేంతగా.. పల్లె ఆర్థిక ప్రగతికి ఊతమిచ్చేటట్టుగా పెరుగుతున్నాయి. 2015లో అక్కడి గౌడ సహకార సంఘంతో కలసి ‘సాక్షి’ఈ గ్రామంలో 5 వేల ఈత మొక్కలను నాటింది. భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మొక్కలు నాటే క్రతువులో భాగస్వాములు అయ్యారు. ఐదు ఎకరాల సొసైటీ స్థలంతో పాటు పెద్ద చెరుకు కట్ట మీద ఈత చెట్లు నాటగా.. 90 శాతం మొక్కలు ప్రాణం పోసుకుని ఎదుగుతున్నాయి. వచ్చే రెండేళ్లలో ఈత చెట్లు చేతికి అందుతాయని గౌడ కార్మికులు చెప్తున్నారు. ఇదే స్ఫూర్తితో గత రెండేళ్లుగా ఊరి నిండా ఈత చెట్లతో నింపేశారు.

కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం...
ఉపాధిహామీ నిధుల ద్వారా ప్రతి గ్రామానికీ ఒక హరిత సైనికుడిని ఏర్పాటు చేశారు. 399 గ్రామాల్లో హరిత సైనికులను ఏర్పాటు చేసి వారికి సైకిల్‌ సైతం ఇచ్చారు. నెలకు రూ.4,800 జీతం చెల్లిస్తున్నారు. వీరికి ఉపాధిహామీ పథకంలో ఉన్న జాబ్‌ కార్డుల ఆధారంగా చేసుకుని సంవత్సరంలో 100 రోజులు పనికల్పిస్తున్నారు. ఈ పనిచేసిన కాలంలో నెలకు సుమారుగా రూ.4,800 ఇస్తున్నారు. మొక్కలను పర్యవేక్షించడం, మొక్కులకు టీ గార్డులు, కంప వేయడంతోపాటు వర్షాలులేని సమయంలో నీళ్లు పోయడం వీరి పని. హరిత సైనికుల పనులను పర్యవేక్షించడానికి ప్రతి మండలానికీ ఒకరు చొప్పున రిటెర్డ్‌ ఫారెస్టు అధికారులను సూపర్‌వైజర్లుగా నియమించారు. ప్రతి గ్రామంలో 25 నుంచి 30 మంది యువకుల సెల్‌ నంబర్లు తీసుకున్నారు. కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశారు. ప్రతి 60 గ్రామాలనూ ఒక క్లస్టర్‌గా తీసుకుని, ప్రతి క్లస్టర్‌కు ఒక కో ఆర్డినేటర్‌ను పెట్టారు. గ్రామాల నుంచి తీసుకున్న నంబర్లకు వీలు చూసుకుని మంత్రి హరీశ్‌రావు, కలెక్టర్‌ వెంకట్రామరెడ్డి, నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఫోన్లు చేసి మొక్కల తాజా పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.

మొక్కలంటే ప్రాణం..
సహజంగానే నాకు మొక్కలంటే ప్రాణం. సిద్దిపేటకు వెళ్తే నా కళ్లు ఎప్పుడూ మొక్కల మీదే ఉంటాయి. ఒక్క చెట్టు ఒంగినా.. కారు దిగి సరి చేసేంత వరకూ మనసు ఊరుకోదు. చెట్లు పెంచకపోతే ఇప్పుడు మనం నీళ్ల బాటిల్స్‌ కొనుక్కుంటున్నట్టుగా భవిష్యత్‌లో ఆక్సిజన్‌ సిలిండర్లు కొనుక్కోవలసి వస్తుంది. ప్రతి ఒక్కరూ చెట్లను బాధ్యతగా పెంచాలే. సిద్దిపేట ప్రజల్లో ఇప్పుడు మొక్కలు పెంచాలనే సామాజిక చైతన్యం వచ్చింది. 
– తన్నీరు హరీశ్‌రావు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి

ప్రతి మొక్కనూ సంరక్షిస్తున్నాం..
ఈ ఏడాది రహదారులకు ఇరువైపులా 1,300 కిలోమీటర్ల మేర ఎవెన్యూ ప్లాంటేషన్‌ చేశాం. ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో మొక్కలు నాటాం. వచ్చే ఏడాది హరితహారంలో ఎవెన్యూ, ఇన్‌స్ట్యూషనల్‌ ప్లాంటేషన్‌ ఉండొద్దనేదే నా ఆశయం. నాటిన ప్రతీ మొక్కనూ సంరక్షిస్తున్నాం. ఈ ఏడాది నాటిన వాటిలో 89.1 శాతం మొక్కలు బతికినట్టు నా నెలవారీ సర్వేలో తేలింది. చనిపోయిన పాదుల్లో తిరిగి కొత్త మొక్కలు నాటుతాం. మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ల ఫండ్‌ నుంచి రూ.50 లక్షల చొప్పున నిధులను హరితహారం కోసం ఇచ్చారు.    –వెంకట్రామరెడ్డి, జిల్లా కలెక్టర్, సిద్దిపేట

సిద్దిపేట.. హరితకోట
సిద్దిపేట జనాలకు మంత్రి హరీశ్‌రావు ఆత్మీయుడు. తమ ఇంట్లో జరిగే ప్రతి వేడుకనూ ఆయనతో పంచుకోవాలని వారు భావిస్తారు. హరీశ్‌రావు కూడా అంతే.. ఒక అర గంట సమయం దొరికితే తన వాళ్ల మధ్య గడపటానికే ఇష్టపడతారు. అనుబంధాలతో అల్లుకున్నదే సిద్దిపేట హరితహారం. ఇక్కడ పుట్టినా.. చనిపోయినా.. పెద్దలకు పెట్టినా.. పుట్టు పంచె కట్టినా.. ప్రతి వేడుకకూ కచ్చితంగా మొక్కను నాటటం ఆనవాయితీగా మారింది. సిద్దిపేట పట్టణానికి చుట్టూ ఐదు కిలోమీటర్ల పరిధిలో పచ్చదనమే కనువిందు చేస్తోంది.

ఒక్క సిద్దిపేట పట్టణం పరిసరాల్లోనే ఆరు లక్షల మొక్కలు ఉంటాయని అంచనా. నాలుగు ప్రధాన రహదారులకు ఇరువైపులా చూపరుల దృష్టి తిప్పుకోనీయనంతగా ఎదిగిన చెట్ల పాదుల వెనుక హరీశ్‌రావు కష్టం ఎంతో ఉంది. ఆయన సిద్దిపేట నుంచి వచ్చేటప్పుడు.. వెళ్లేటప్పుడు ఒక్కో చెట్టునూ గమనిస్తారు. ఎన్నడూ కూడా వచ్చిన దారినే వెళ్లరు. పొన్నాల దాబా నుంచి వస్తే.. రాయాయంపేట రోడ్డు గుండా వెళ్తారు. కరీంనగర్‌ రోడ్డు గుండా వస్తే.. మరో దారి గుండా వెళ్తారు. ఒంగిన చెట్లెన్ని, వాలిపోయిన చెట్లెన్ని, వడలిపోయి న చెట్లెన్ని ఇలా అన్నీ లెక్క పెట్టుకుంటారు. అధికారిక పనులను పక్కన పెట్టి ఆయనే కారు దిగి చెట్లను సరిచేసిన ఘటనలు అనేకం. ఇలా సిద్దిపేట ప్రజల్లో ఆయన ఓ సామాజిక చైతన్యమే తీసుకొచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement