‘కృష్ణా’పై ఖరారుకాని వ్యూహం
- సీఎంతో చర్చించాకే తుది నిర్ణయం
- సుప్రీం న్యాయవాది వైద్యనాథన్‌తో కేబినెట్ సబ్ కమిటీ భేటీ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలపై బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై ఎలాంటి వ్యూహం ఖరారు చేయాలన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోలేదు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్‌ను పిలిపించి కేబినెట్ సబ్ కమిటీ చర్చోపచర్చలు జరిపినా అవి అసంపూర్తిగానే ముగిశాయి. దీనిపై నవంబర్ మొదటి వారంలో మరోమారు సమావేశమై వ్యూహాన్ని ఖరారు చేయాలని కమిటీ నిర్ణయిం చింది. కృష్ణా జలాల తీర్పు ప్రభావం, తీసుకోవాల్సి న్యాయ కార్యాచరణపై శనివారం మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి కమిటీ సభ్యులు పోచార ం శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, జగదీశ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, సాగునీటి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జోషి, ఈఎన్‌సీ మురళీధర్‌తోపాటు సుప్రీం న్యాయవాది వైద్యనాథన్, రాష్ట్ర అడిషనల్ అడ్వొకేట్ జనరల్ రాంచందర్‌రావు, న్యాయవాదులు రవీందర్‌రావు, విద్యాసాగర్‌లు హాజరయ్యారు. బ్రిజేశ్ తీర్పుతో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై న్యాయపరంగా ఎలాంటి కార్యాచరణ చేపట్టాలి? కృష్ణా జలాల్లో మన వాటాలో చుక్కనీటిని కూడా వదులుకోకుండా ఉండేందుకు ఎలాంటి వ్యూహం అనుసరించాలి అన్న అంశంపై కమిటీలో చర్చించారు. కృష్ణా జలాల అంశాన్ని రెండు రాష్ట్రాలకే పరిమితం చేస్తే రాష్ట్రానికి తీవ్ర నష్టం తప్పదని వైద్యనాథన్ వివరించారు. ట్రిబ్యునల్ తీర్పుపై స్టే కోరుతూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేస్తే న్యాయం జరిగే అవకాశం ఉంటుందని కమిటీలో కొందరు అభిప్రాయపడ్డట్టు తెలిసింది. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని మరోమారు కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని కమిటీలోని కొందరు సూచించినట్లు సమాచారం. సీఎం కేసీఆర్‌తో చర్చించిన తర్వాత తుది నిర్ణయానికి రావాలని నిర్ణయించారు.
అమల్లోకి వస్తే చుక్కనీరు రాదు
బ్రిజేశ్ తీర్పు అమల్లోకి వస్తే తెలంగాణ, ఏపీలకు ఎగువ నుంచి నీటి ప్రవాహం తగ్గుతుందని, వర్షాలు సరిగ్గా లేని సమయాల్లో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ నిండడానికి అక్టోబర్ వరకు వేచి చూడాల్సి వస్తుందని వైద్యనాథన్ వివరించారు. అలాగే కృష్ణా వివాదం రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితమైతే ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు జరుగుతాయని, ఇది సైతం రాష్ట్రానికి నష్టం చేస్తుందని కమిటీ దృష్టికి తెచ్చారు. ఎగువ రాష్ట్రాలకు బేసిన్ వారీగా కేటాయింపులు ఉండి, కింది రాష్ట్రాలకు ప్రాజెక్టుల వారీగా ఉంటే.. ఎగువన కర్ణాటక తన వాటా నీటినంతా ఆల్మట్టి వద్దే వాడుకుంటుందని, అదే జరిగితే దిగువకు చుక్క నీరు రాదని వివరించారు. రాష్ట్రానికి జరిగే నష్టాలే ఏపీకి జరుగుతున్నందున ఆ రాష్ట్రం ఎలాంటి వ్యూహం అనుసరిస్తుందన్నది నిశితంగా పరిశీలించాలని కమిటీ నిర్ణయించింది.