విద్యార్థినికి ఉపకార వేతనం అందిస్తున్న హోంమంత్రి నాయిని
నాంపల్లి: నిజాం నవాబులు తమ పాలనలో అభివృద్ధికి పెద్ద పీట వేశారని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. శనివారం రెడ్‌హిల్స్‌లోని ఫెడరేషన్ హౌస్‌లో బద్రివిశాల్ పన్నాలాల్ పిత్తి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న 450 మంది మెరిట్ విద్యార్థులకు రూ.70 లక్షలు ఉపకార వేతనాలు అందజేశారు. ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం మనం మాట్లాడుతున్న డ్రైనేజీ, మంచినీటి వసతి, విద్య, ఆరోగ్యాల పరిరక్షణకు నిజాం పాలన నాటి నుంచే బలమైన బీజాలు పడ్డాయన్నారు. దీనికి అప్పటి నిజాం రాజుకు సలహాదారుగా ఉన్న మోతీలాల్ పిత్తి లాంటి వారి దూరదృష్టి ప్రముఖంగా ఉందన్నారు.
నిజాం నవాబుల పాలనలో హైదరాబాదు అభివృద్ధి కోసం సలహాలు అందించి మోతీలాల్ పిత్తి, బద్రివిశాల్ పిత్తి ప్రముఖ పాత్ర పోషించారని కొనియాడారు. బద్రి విశాల్ పిత్తి అప్పట్లో అన్ని ట్రేడ్ యూనియన్లు, కార్మిక సంఘాలకు నాయకత్వం వహించడమే కాకుండా, పేదలకు ఆర్థిక సాయం అందించేవారని, దీనిని ఆయన తనయుడు శరద్ బి.పిత్తి కొనసాగించడం అభినందనీయమన్నారు. బద్రి విశాల్ పన్నాలాల్ పిత్తి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శరద్ బి.పిత్తి మాట్లాడుతూ ఈ సంవత్సరం 6 నుంచి మొదలుకుని పీజీ విద్య దాకా 1300 మందికి ఉపకార వేతనాలు అందిస్తున్నట్లు తెలిపారు. తాము విద్యలో ప్రతిభ ఉన్న పేదలకు మాత్రమే ఉపకార వేతనాలు అందిస్తామన్నారు. ట్రస్టీలు అక్షయ్ ఎ.పిత్తి, జి.విజయ్ కుమార్, అజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.