సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రులు, హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లతో పాటు ఇతర ప్రభుత్వ సంస్థల్లో బట్టలు ఉతికే పనులను రజకులకే అప్పగించేలా విధానపరమైన నిర్ణయం తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. 50 ఏళ్లు దాటిన రజక వృత్తిదారులకు ఆసరా పింఛన్లు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. రజకుల కోసం హైదరాబాద్‌లో ఎకరం స్థలంలో రూ.5 కోట్లతో హాస్టల్, కమ్యూనిటీ హాల్ నిర్మించనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లో చాకలి అయిలమ్మ విగ్రహాన్ని స్థాపిస్తామని తెలిపారు. రజక యువకులకు ప్రత్యామ్నాయ ఉపాధి కోసం బ్యాంకులతో సంబంధం లేకుండా రుణాలు అందిస్తామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ శనివారం ప్రగతిభవన్‌లో రజక సంఘం ప్రతినిధులతో సమావేశమై వారి సమస్యలపై చర్చించారు. మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాచర్ల ఉప్పలయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు మానస గణేశ్, కో ఆర్డినేటర్ కొల్లూరు మల్లేశ్‌కుమార్, అసోసియేట్ అధ్యక్షుడు కొలిపాక రాములు, ప్రధాన కార్యదర్శి కొల్లంపల్లి వెంకటరాములు, కొండూరు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు సీఎంకు వినతిపత్రం సమర్పించారు. ప్రజలకు సేవ చేస్తున్న కులాల అభ్యున్నతి కోసం కృషి చేయాల్సిన సామాజిక బాధ్యత ప్రభుత్వంపై ఉందని ముఖ్యమంత్రి అన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణలోని కుల వృత్తులకు ప్రోత్సాహం కరువైందని, ఇప్పుడు వాటిని నిలబెట్టేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. రజక సంఘం కోరుకున్న విధంగానే కార్యక్రమాలు అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. రజకులు ఆర్థిక, సామాజిక, విద్య, ఉపాధి రంగాల్లో ప్రగతి సాధించేందుకు అవసరమైన తోడ్పాటును ప్రభుత్వం అందిస్తుందని ప్రకటించారు. ‘‘రజకులకు ఆర్థిక చేయూత అందించే కార్యక్రమాల అమలుకు బడ్జెట్లో రూ.250 కోట్లు కేటాయించాం. ఇంకా అవసరమైన పక్షంలో మరిన్ని నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ నిధులతో రజకుల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో రజక సంఘం ప్రతినిధులే నిర్ణయం తీసుకోవాలి. మురికి బట్టలు ఉతికే క్రమంలో రజకులు అనారోగ్యం పాలవుతున్నారు. వారి వైద్యానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం. హైదరాబాద్, ఇతర నగరాల్లో, జిల్లా కేంద్రాల్లో, పట్టణాల్లో దోబీఘాట్ల నిర్మిస్తాం. బట్టలు నేలపై ఆరేయకుండా దండాలు ఏర్పాటు చేసే పద్ధతి పెట్టాలి. ప్రభుత్వ ఆసుపత్రులు, రెసిడెన్షియల్ స్కూళ్లలో ఎక్కువ సంఖ్యలో బట్టలు ఉతకడానికి అవసరమయ్యే వాషింగ్ మెషిన్లను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. ఆ పనిని రజకులకే అప్పగిస్తాం’’అని సీఎం అన్నారు.
హెచ్‌ఎండీఎ, జీహెచ్‌ఎంసీతోపాటు ఇతర నగరాలు, పట్టణాల్లో చేసే లే అవుట్లలో బట్టలు ఉతికి, ఇస్త్రీ చేయడానికి అనువుగా కొంత స్థలం తీసి కచ్చితంగా రజక సంఘాలకు అప్పగించాలని అధికారులను సీఎం ఆదేశించారు. దోబీఘాట్లకు, వాషింగ్ మెషిన్లకు సబ్సిడీపై కరెంటు సరఫరా చేసే విషయాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పారు.
ప్రభుత్వ ఖర్చుతో ఎరుకుల భవనం
ఎరుకుల కులస్తుల సామాజిక, విద్యా ప్రగతికి దోహదపడేలా హైదరాబాద్‌లో భవనం నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు అవసరమైన స్థలాన్ని కేటాయించి నిర్మాణానికి అయ్యే పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. ఎరుకుల కులస్తుల ఉపాధి కోసం ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తామని చెప్పారు. తెలంగాణ ఎరుకల సంఘం అధ్యక్షుడు కూతాడి రాములు, ప్రధాన కార్యదర్శి లోకిని రాజు తదితరులు శనివారం ప్రగతిభవన్‌లో సీఎంను కలిశారు.
రజక భవనాలకు నిధులు కేటాయించడంపై హర్షం
రజక భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై తెలంగాణ రజక సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ కొండూరు సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో రజక భవన నిర్మాణానికి రూ.5 కోట్లు, నల్లగొండలో భవనానికి రూ.50 లక్షలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలసి కృతజ్ఞతలు తెలిపారు. సీఎంను కలిసినవారిలో నేతలు కోట్ల శ్రీనివాస్, కొన్నె సంపత్, ముందిగొండ మురళి, పగడాల లింగయ్య, చిట్యాల రామస్వామి తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment