Rajaka Community
-
తిరుపతిలో రజక సంఘాల నిరసన
-
బస్సు యాత్రను అడ్డుకుంటామనడం సిగ్గుచేటు
అనంతపురం (సప్తగిరి సర్కిల్): సామాజిక న్యాయభేరి బస్సు యాత్రను అడ్డుకుంటామని టీడీపీ నాయకులు చెప్పడం సిగ్గుచేటని రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ హరీష్‌కుమార్ యాదవ్, రాష్ట్ర రజక కార్పొరేషన్ చైర్మన్ మీసాల రంగన్న ధ్వజమెత్తారు. బుధవారం అనంతపురం వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో హరీష్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికపరంగా అండగా నిలిచి ఆదుకుంటుంటే టీడీపీ నాయకులు ఓర్వలేక బురద జల్లుతున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంతో సహా చంద్రబాబు కోటలు బీటలు వారేలా ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. 2024 ఎన్నికల్లోనూ టీడీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. బీసీ లోకానికి ఊపిరి పోశారు రజక కార్పొరేషన్ చైర్మన్ మీసాల రంగన్న మాట్లాడుతూ.. బీసీ లోకానికి ఊపిరి పోసిన ఘనత సీఎం జగన్మోహన్రెడ్డిదే అన్నారు. రాజ్యసభ సీట్లను తన కులం వారికి ఇచ్చుకోవడంతో పాటు వాటిని రూ.వందల కోట్లకు అమ్ముకున్న నీచుడు చంద్రబాబు అని మండిపడ్డారు. రాష్ట్రంలోని 139 బీసీ కులాలను గుర్తించి.. వాటికి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన మహనీయుడు జగనన్న అని కొనియాడారు. సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు. సమావేశంలో కార్పొరేటర్ శ్రీనివాసులు, నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనివాసులు, దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ అల్లీపీరా, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్‌కుమార్, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్ యాదవ్ పాల్గొన్నారు. -
రజకులకు ఆసరా..
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రులు, హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లతో పాటు ఇతర ప్రభుత్వ సంస్థల్లో బట్టలు ఉతికే పనులను రజకులకే అప్పగించేలా విధానపరమైన నిర్ణయం తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. 50 ఏళ్లు దాటిన రజక వృత్తిదారులకు ఆసరా పింఛన్లు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. రజకుల కోసం హైదరాబాద్‌లో ఎకరం స్థలంలో రూ.5 కోట్లతో హాస్టల్, కమ్యూనిటీ హాల్ నిర్మించనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లో చాకలి అయిలమ్మ విగ్రహాన్ని స్థాపిస్తామని తెలిపారు. రజక యువకులకు ప్రత్యామ్నాయ ఉపాధి కోసం బ్యాంకులతో సంబంధం లేకుండా రుణాలు అందిస్తామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ శనివారం ప్రగతిభవన్‌లో రజక సంఘం ప్రతినిధులతో సమావేశమై వారి సమస్యలపై చర్చించారు. మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాచర్ల ఉప్పలయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు మానస గణేశ్, కో ఆర్డినేటర్ కొల్లూరు మల్లేశ్‌కుమార్, అసోసియేట్ అధ్యక్షుడు కొలిపాక రాములు, ప్రధాన కార్యదర్శి కొల్లంపల్లి వెంకటరాములు, కొండూరు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు సీఎంకు వినతిపత్రం సమర్పించారు. ప్రజలకు సేవ చేస్తున్న కులాల అభ్యున్నతి కోసం కృషి చేయాల్సిన సామాజిక బాధ్యత ప్రభుత్వంపై ఉందని ముఖ్యమంత్రి అన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణలోని కుల వృత్తులకు ప్రోత్సాహం కరువైందని, ఇప్పుడు వాటిని నిలబెట్టేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. రజక సంఘం కోరుకున్న విధంగానే కార్యక్రమాలు అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. రజకులు ఆర్థిక, సామాజిక, విద్య, ఉపాధి రంగాల్లో ప్రగతి సాధించేందుకు అవసరమైన తోడ్పాటును ప్రభుత్వం అందిస్తుందని ప్రకటించారు. ‘‘రజకులకు ఆర్థిక చేయూత అందించే కార్యక్రమాల అమలుకు బడ్జెట్లో రూ.250 కోట్లు కేటాయించాం. ఇంకా అవసరమైన పక్షంలో మరిన్ని నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ నిధులతో రజకుల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో రజక సంఘం ప్రతినిధులే నిర్ణయం తీసుకోవాలి. మురికి బట్టలు ఉతికే క్రమంలో రజకులు అనారోగ్యం పాలవుతున్నారు. వారి వైద్యానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం. హైదరాబాద్, ఇతర నగరాల్లో, జిల్లా కేంద్రాల్లో, పట్టణాల్లో దోబీఘాట్ల నిర్మిస్తాం. బట్టలు నేలపై ఆరేయకుండా దండాలు ఏర్పాటు చేసే పద్ధతి పెట్టాలి. ప్రభుత్వ ఆసుపత్రులు, రెసిడెన్షియల్ స్కూళ్లలో ఎక్కువ సంఖ్యలో బట్టలు ఉతకడానికి అవసరమయ్యే వాషింగ్ మెషిన్లను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. ఆ పనిని రజకులకే అప్పగిస్తాం’’అని సీఎం అన్నారు. హెచ్ఎండీఎ, జీహెచ్ఎంసీతోపాటు ఇతర నగరాలు, పట్టణాల్లో చేసే లే అవుట్లలో బట్టలు ఉతికి, ఇస్త్రీ చేయడానికి అనువుగా కొంత స్థలం తీసి కచ్చితంగా రజక సంఘాలకు అప్పగించాలని అధికారులను సీఎం ఆదేశించారు. దోబీఘాట్లకు, వాషింగ్ మెషిన్లకు సబ్సిడీపై కరెంటు సరఫరా చేసే విషయాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పారు. ప్రభుత్వ ఖర్చుతో ఎరుకుల భవనం ఎరుకుల కులస్తుల సామాజిక, విద్యా ప్రగతికి దోహదపడేలా హైదరాబాద్‌లో భవనం నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు అవసరమైన స్థలాన్ని కేటాయించి నిర్మాణానికి అయ్యే పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. ఎరుకుల కులస్తుల ఉపాధి కోసం ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తామని చెప్పారు. తెలంగాణ ఎరుకల సంఘం అధ్యక్షుడు కూతాడి రాములు, ప్రధాన కార్యదర్శి లోకిని రాజు తదితరులు శనివారం ప్రగతిభవన్‌లో సీఎంను కలిశారు. రజక భవనాలకు నిధులు కేటాయించడంపై హర్షం రజక భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై తెలంగాణ రజక సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ కొండూరు సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో రజక భవన నిర్మాణానికి రూ.5 కోట్లు, నల్లగొండలో భవనానికి రూ.50 లక్షలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలసి కృతజ్ఞతలు తెలిపారు. సీఎంను కలిసినవారిలో నేతలు కోట్ల శ్రీనివాస్, కొన్నె సంపత్, ముందిగొండ మురళి, పగడాల లింగయ్య, చిట్యాల రామస్వామి తదితరులున్నారు. -
ఐలమ్మ అందరికీ ఆదర్శం
బంజారాహిల్స్: రజాకార్ల ఆగడాలకు ఎదురొడ్డి నిలిచిన చాకలి ఐలమ్మ అందరికీ ఆదర్శంగా నిలిచిందని, ఆమె ఉద్యమ స్ఫూర్తితో రజకుల సమస్యలపై పోరాటం చేస్తామని రజక సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పూసాల సంపత్ అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ 29వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ రజక సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన రజక ఆత్మగౌరవ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా నేత పల్లె వీణా రెడ్డి, టీఆర్ఎస్ నాయకురాలు విజయారెడ్డి, రజక సంఘం నేతలు రాధ, సింగారం శేఖర్,ఆర్ దేవేందర్,యాకయ్య,బాపురాజు,సాంబయ్య తదితరులున్నారు. సబ్ ప్లాన్‌ను ఏర్పాటు చేయాలి సుందరయ్య విజ్ఞాన కేంద్రం: వృత్తిదారులకు సబ్ ప్లాన్‌ను ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు డిమాండ్ చేశారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ, గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ కమిటీల ఆధ్వర్యంలో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 29వ వర్ధంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సీతారాములు మాట్లాడుతూ రజకులకు సామాజిక భద్రత చట్టాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. స్వాతంత్య్రం వచ్చి 60 ఏళ్లు దాటిన వృత్తిదారుల సమస్యలు పరిష్కారం కావడంలేదన్నారు. భూమి కోసం, భక్తికోసం, వెట్టిచాకిరి విముక్తికోసం ఐక్యంగా పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ గ్రేటర్ కన్వీనర్ జి.నరేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.ఆశయ్య, బ్యాండు,వాయిద్య కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి ఓగ్గు శ్రీనివాస్,నాయకులు నాగరాజు, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి దోమలగూడ: తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని, ఆమె వర్ధంతి, జయంతిలను ప్రభుత్వమే నిర్వహించాలని తెలంగాణ రజక సేవా సంఘం రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ రజక సేవా సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఐలమ్మ 29వ వర్ధంతి సభను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ వర్ధంతిని పట్టించుకోకపొవడం, ట్యాంక్‌బండ్‌పై విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోవడం అన్యాయమన్నారు. తెలంగాణ రజక సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండూరి సత్యనారాయణ మాట్లాడుతూ ఆత్మ గౌరవం కోసం ఐలమ్మ జరిపిన పోరాటం నేటి తరాలకు ఆదర్శం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూషరాజు యాదమ్మ, సహాయకార్యదర్శి రంగస్వామి, గ్రేటర్ హైదరాబాదు అధ్యక్షుడు రామస్వామి, కార్యదర్శి స్వామి, నాయకులు కొమురయ్య, రత్పంరాజు, కె బి విజయ్‌కుమార్, ఎం రాజు, లక్ష్మినారాయణ, వెంకటేష్, యుంగధర్, భూతరాజు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఐక్య పోరాటాలతోనే తెలంగాణ
రెబ్బెన, న్యూస్‌లైన్ :తెలంగాణ ప్రాంతంలోని అన్ని సంఘాలు ఐక్యంగా ఉండి పోరాటాలు కొనసాగించినప్పుడే 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందని రజక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు కడతల మల్లయ్య అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 28వ వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్శంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపించిన యోధురాలు ఐలమ్మ అని కొనియాడారు. స్థానిక సంఘాలను కూడగట్టుకుని వీరోచిత పోరాటాలు చేసిన ధీరురాలని, నేటి మహిళలు ఆమెను ఆదర్శంగా తీసుకుని తెలంగాణ ఉద్యమంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నాటి నుంచి నేటి వరకు తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. ఇనాళ్లకు ప్రజలు కన్న కల నెరవేరబోతోందని, అయితే రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు సీమాంధ్రులు కుట్ర పన్నుతున్నారని వివరించారు. తెలంగాణవాదులపై దాడులకు పాల్పడుతూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా రాష్ర్ట ఏర్పాటును అడ్డుకోలేరని స్పష్టం చేశారు. రజక సంఘం మండల అధ్యక్షుడు రామడుగుల శంకర్, కార్యదర్శి సత్తయ్య, టీఆర్ఎస్ రెబ్బెన పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్‌గౌడ్, తెలుగు యువత మండల అధ్యక్షుడు రాజాగౌడ్, ఎమ్మార్పీఎస్ నాయకులు శంకర్, రాజేందర్, మన్నెవార్ సేవా సమితి మండల ఉపాధ్యక్షుడు వెంకటేశ్ పాల్గొన్నారు.