చాకలి ఐలమ్మ విగ్రహానికి నివాళులర్పిస్తున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, డాక్టర్ కె.లక్ష్మణ్
కవాడిగూడ(హైదరాబాద్): నిజాం నవాబుకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ ప్రజా ఉద్యమాన్ని నిర్మించి మహిళా సంక్షేమం కోసం పోరాటాలు చేసిన ఘనత చాకలి ఐలమ్మదే అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కొనియాడారు. చాకలి ఐలమ్మ 126వ జయంతిని పురస్కరించుకుని లోయర్‌ట్యాంక్‌బండ్‌లోని తెలంగాణ రజక ధోబీ అభివృద్ధి సంస్థ, తెలంగాణ ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి, మంత్రి తలసాని యాదవ్, రజక ధోబీ అభివృద్ధి జాతీయ ఫౌండర్ చైర్మన్ డాక్టర్‌ఎం. అంజయ్య, తెలంగాణ రాష్ట్ర రజక ధోబీ అభివృద్ధి సంస్థ అధ్యక్షుడు బొమ్మరాజు కృష్ణమూర్తి తదితరులు ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ సాయుధపోరాటంలో బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం నిలబడిన వీరనారి చాకలి ఐలమ్మ అని అన్నారు.
బహుళజాతి కంపెనీలు రజక వృత్తిని సొంతం చేసుకుని వారికి అన్యాయం చేస్తున్నారని, ప్రభుత్వాలు మారుతున్నా రజకుల సమస్యలు పరిష్కారం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ..నిజాం నిరంకుశ పాలనకు విముక్తి కల్పించేందుకు చాకలి ఐలమ్మ చేసిన స్ఫూర్తితోనే మలిదశ తెలంగాణ ఉద్యమం జరిగిందన్నారు.
ప్రొటోకాల్ వివాదం..
వేడుకల్లో ప్రధాన వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో అధికారులు ప్రొటోకాల్ పాటించలేదంటూ టీఆర్‌ఎస్, బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. ఫ్లెక్సీలో స్థానిక టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఫొటో లేదంటూ టీఆర్‌ఎస్ నాయకులు, బీజేపీ కార్పొరేటర్ జి.రచనశ్రీ ఫొటో లేదంటూ బీజేపీ నేతలు గొడవకు దిగడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్, ఎమ్మెల్యే ముఠాగోపాల్ ఇరుపార్టీల నేతలకు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఈ గొడవ జరుగుతున్న సమయంలోనే నిర్వాహకులు ఎమ్మెల్యే ముఠాగోపాల్ ఫొటోను ఫ్లెక్సీపై అతికించడం కొసమెరుపు.
పేదల సమస్యలపై అలుపెరగని పోరాటం: మంత్రి తలసాని
పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా అనేక భూపోరాటాలు, పేదల సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన చాకలి ఐలమ్మ మహిళా చైతన్యానికి ప్రతీక అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనియాడారు. ఐలమ్మ జీవిత చరిత్రను ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలన్నారు. ఆమె జయంతి, వర్ధంతులను ప్రజలందరూ పండుగలా నిర్వహించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్, టీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment