మేధా వికాసంలో శ్రమశక్తి సంకేతం
హైదరాబాద్లో ‘కోఠి ఉమెన్స్ కాలేజీ’గా ఉన్న సంస్థకు ‘చాకలి ఐలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ’ అనే పేరును పెట్టడం గొప్ప సాంస్కృతిక మార్పునకు దారి తీస్తుంది. యుగాల బానిసత్వానికి వ్యతిరేకంగా తిరగబడ్డ వీరనారి ఐలమ్మ. ఈ దేశంలో స్కూళ్లలో, యూనివర్సిటీల్లో శ్రమ జీవన పాఠాలు చెప్పాలంటే తోలుపని, బట్టలుతికే పని, క్షవరం చేసే పని నుండే ప్రారంభించాలి. ఐలమ్మ విగ్రహాన్ని ఉమెన్స్ యూనివర్సిటీలో దర్బార్ హాల్ ముందు పెడితే, ఆమె ముఖం చూసి తరగతి గదుల్లోకి వెళ్లిన ప్రతి విద్యార్థిని మానవత్వంతో బతికే మేధావి అవుతుంది. ఏదేమైనా భారతదేశ చరిత్రలో ఒక చాకలి యోధురాలి పేరుతో మొట్టమొదటి ఉమెన్స్ యూనివర్సిటీ ప్రారంభం కావడమే ఒక సాంస్కృతిక విప్లవ ప్రారంభ ఘట్టం.10 సెప్టెంబర్ 2024 రోజున తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో జరిగింది. ఆ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక శాఖ డా‘‘ అలేఖ్య పుంజాల టీమ్ ఒక అద్భుతమైన బ్యాలేను వేసింది. ఆ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతరమంత్రులు, శాసన సభ్యులు హాజరయ్యారు.ఈ చారిత్రక సమావేశంలో వేదిక మీది నుండి నేను తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులకు కొత్తగా తెలంగాణలో ఏర్పడే ఉమెన్స్ యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెడితే అది గొప్ప సాంస్కృతిక మార్పునకు దారి తీస్తుందని సూచించాను. అక్కడికక్కడే ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మిగతా మంత్రులు మాట్లాడుకొని, ఇంతకుముందు ‘కోఠి ఉమన్స్ కాలేజీ’గా ఉన్న సంస్థకు ‘చాకలి ఐలమ్మ ఉమన్స్ యూనివర్సిటీ’ అనే పేరును ఇక్కడే ప్రకటిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇది చాలా చరిత్ర ప్రాధాన్యం కలిగిన నిర్ణయం.గతంలో యూనివర్సిటీలకు దేవతలు, రాజులు, స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న జాతీయ నాయకుల పేర్లు పెట్టేవారు. అందులో ద్విజ బ్రాహ్మణ, బనియా, కాయస్థ, ఖత్రి, క్షత్రి, క్షత్రియ వారి పేర్లే ఎక్కువ. అంబేడ్కర్, ఫూలే, పెరియార్లు ఆ స్థితిని కాస్తా మార్పు తెచ్చారు. కానీ వారంతా చదువుకున్నవారు. కానీ దేవతల పేర్లతో యూనివర్సిటీ పేర్లు పెట్టినప్పుడు చదువుతో సంబంధం చూడలేదు. ఉదాహరణకు తిరుపతిలోని వెంకటేశ్వర యూనివర్సిటీ.చాకలి ఐలమ్మ సమాజం బట్టలుతికి మొత్తం సమాజాన్ని రోగాల నుండి, మురికి జీవితం నుండి కాపాడిన కులం నుండి వచ్చింది. గ్రామాల్లోని అన్ని కులాల వారి బట్టలుతికి సాయంకాలం బుట్ట పట్టుకొని ‘చాకలి దాన్ని అవ్వా!’ అని అడుక్కొని తిని బతికిన కులం ఆమెది. పెండ్లి పనుల్లో ఎంతగా భాVýæమైనప్పటికీ, బంతిలో కూర్చొని అందరితో కలిసి బుక్కెడు బువ్వ తినలేని స్థితి వారిది. అదే పెండ్లిలో మిగిలిన కూడు తిని సేవ చేశారు. సమాజానికి సబ్బు అనే వస్తువు తెలవని రోజుల్లో మన దేశంలోని చాకలి స్త్రీలే ‘చవుడు మట్టి’ అనే సబ్బును కనిపెట్టారు. చవుడు మట్టి బట్టను శుభ్రం చేసినప్పటికీ రోగ క్రిములు బట్టలకంటుకునే ఉండేవి. వాటిని కూడా చంపి సమాజాన్ని అంటు వ్యాధుల నుండి కాపాడ టానికి చాకిరేవులో చవుడు బట్టలను ఉడుకబెట్టి, వాళ్లే ఈ సమాజాన్ని బతికించారు. కానీ ఈ దేశపు కుల విలువలు శుభ్రతకు మూలమైన స్త్రీలను అశుభ్రులుగా ప్రకటించి ఇంటి అరుగు కూడా తొక్కనివ్వలేదు. ప్రసవించే ప్రతి స్త్రీని చాకలి స్త్రీలే మంత్రసానులుగా మారి ప్రసవింపజేశారు. కానీ చాకలి – మంగలి స్త్రీలు కాపాడిన బాలింతలు కూడా వారిని మనుషులుగా చూడలేదు. ఇటువంటి వేల సంవత్సరాల అమానుష విలువలపై చాకలి ఐలమ్మ ఒక తిరుగుబాటు.యుగాల బానిసత్వానికి వ్యతిరేకంగా తిరగబడ్డ వీరనారి ఆమె. ఈమె రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీల కంటే వేయిరెట్లు ధైర్యశాలి. అందుకే నిజాం రాజరికంలో విసునూరి రామచంద్రారెడ్డి దొరతనంలో బట్టలుతుకుతూ ‘అడుక్క తినను, నాకున్న కొద్దిపాటి భూమిలో పండించుకొని తింటాను’ అని తన కొడవలిని చేత పట్టుకొని భూస్వామ్య కత్తుల మీద, రజాకార్ తుపాకుల మీద తిరుగుబాటు చేసింది. అలేఖ్య బ్యాలేలో కొడవలి, కర్రతో ఆమె, ఆమెతో పాటు ఆ చాకలి స్త్రీ – పురుషులు రజాకార్–భూస్వామ్య శక్తుల మీద చేసిన పోరాటం చూపరులను ఉత్తేజపర్చింది.రెండు దశల్లో స్త్రీల సాయుధ తిరుగుబాటు తెలంగాణకు ఎనలేని వన్నె తెచ్చింది. మొదటిది సమ్మక్క–సారక్క పోరాటం. వాళ్ళు ఇప్పుడు దేవతలయ్యారు. వాళ్ళ పేర్లు యూనివర్సిటీ గేటు బోర్డుల మీద ఎక్కాలనే నా కోరికను కేంద్ర ప్రభుత్వం తీర్చింది. ములుగు సమీపంలో 300 ఎకరాల్లోని ట్రైబల్ యూనివర్సిటీకి సమ్మక్క–సారక్క పేరు పెట్టింది. రెండవ స్త్రీ తిరుగుబాటు... గ్రామ స్థాయిలో అన్ని శూద్ర కులాల అట్టడుగున బతికి, బట్టలుతికి, మంత్రసానిగా పని చేసిన చాకలి ఐలమ్మ వీర వనితగా భూస్వామ్య వ్యతిరేక పోరాటం చేసింది. ఆమె పేరుతో వందల సంవత్సరాలు అన్ని కులాల అమ్మా యిలు ఉన్నత విద్య నేర్చుకునే ఒక ఉమెన్స్ యూనివర్సిటీ హైదరాబాద్ నడిబొడ్డులో ఉండబోతున్నది.కోఠి ఉమెన్స్ కాలేజీలో నేను పదకొండేడ్లు పాఠాలు చెప్పాను. ఐలమ్మ వేషం కట్టి ఆడిన అలేఖ్య ఆ కాలేజీలో చదువుకుంది. నా ఉపాధ్యాయ జీవితంలో ఒక క్లాసు ఎగ్గొట్టకుండా విద్యార్థులు ప్రతి రోజూ పాఠాలు విన్న కాలేజీ అదే. చాకలి ఐలమ్మ యూనివర్సిటీగా వెలగబోతున్న ఆ యూనివర్సిటీ తరతరాలు అమ్మాయిల, అబ్బాయి లకు తల్లులుగా జీవించే స్త్రీల జీవితాలను మారుస్తుంది. ‘ఎవరు ఈ చాకలి ఐలమ్మ?’ అని పిల్లలు అడిగితే ఆమె శ్రమశక్తి గురించి, ఆమె పోరాట పటిమ గురించి ఎన్నో పాఠాలు చెప్పడానికి ఆమె జీవితం ఆధారంగా ఉంటుంది. అన్ని కులాలు, అన్ని మతాల పిల్లలు కుల మత వ్యత్యాసం లేకుండా జీవించడానికి ఆమె జీవిత చరిత్ర ఎంతో ఉపయోగపడుతుంది.ఈ దేశంలో స్కూళ్లలో, యూనివర్సిటీల్లో శ్రమ జీవన పాఠాలు చెప్పాలంటే తోలుపని, బట్టలుతికే పని, క్షవరం చేసే పని నుండే ప్రారంభించాలి. చాకలితనం హీనమైంది కాదు, అగౌరవప్రదమైనదేం కాదు. అది సమాజ శుభ్రతకు గొప్ప జ్ఞానంతో పనిచేసింది. మానవ జాతిని బతికించింది. చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఉమెన్స్ యూనివర్సి టీలో దర్బార్ హాల్ ముందు పెడితే, ఆమె ముఖం చూసి క్లాసురూము ల్లోకి వెళ్లిన ప్రతి విద్యార్థిని మానవత్వంతో బతికే మేధావి అవుతుంది.బ్రిటిష్ వలస కాలంలో, నిజాం ప్రభుత్వ రెసిడెంట్ అధికారి, ఒక తెల్లదొర జీవించిన బంగ్లా అది. అది ఇప్పుడు మంచి హెరిటేజిబిల్డింగ్. అది ఒకవైపు దోపిడీ చిహ్నం అయితే, మరోవైపు సరిగా వంద సంవత్సరాల కింద, 1924లో మొట్టమొదటి ఉమెన్స్ కాలేజీగా ప్రారంభమైన స్త్రీ విద్యా వికాస కేంద్ర కూడా. అది కాలేజీగా ప్రారంభమైన వంద సంవత్సరాలకు చాకలి ఐలమ్మ యూనివర్సిటీగా రూపు దిద్దుకోవడం ఒక్క తెలంగాణకే కాదు, మొత్తం దేశానికి ఒక సాంస్కృతిక విప్లవ చిహ్నం, ఒక మార్పునకు సూచిక.పాత తెలంగాణ తల్లి విగ్రహం ఒక దొరసాని రూపంలో ఉందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త విగ్రహాన్ని డిసెంబర్ 9న అంటే సోనియా గాంధీ జన్మదినాన ఆవిష్కరిస్తామని ప్రకటించింది. ఆ కొత్త తెలంగాణ తల్లికి చాకలి ఐలమ్మ పోలికలుంటే రాష్ట్ర సాంస్కృతిక తత్వమే మారు తుంది. ఏదేమైనా భారతదేశ చరిత్రలో ఒక చాకలి పోరాట యోధు రాలి పేరుతో మొట్టమొదటి ఉమెన్స్ యూనివర్సిటీ ప్రారంభం కావ డమే ఒక కల్చరల్ రెవల్యూషన్ ప్రారంభ ఘట్టం.అయితే ఈ యూనివర్సిటీని బాగా అభివృద్ధి చెయ్యాల్సి ఉంది. ఈ యూనివర్సిటీలోనే ఒక ఉమెన్స్ మెడికల్ కాలేజీ, ఒక ఉమెన్స్ఇంజినీరింగ్ కాలేజీని కూడా ప్రారంభించాల్సి ఉంది. అందులోని అన్ని కోర్సుల్లో చదువుకునే స్త్రీ విద్యార్థులు దేశవిదేశాల్లో ఆ యూని వర్సిటీకి పేరు తేవలసి ఉంది. ఈ దేశాన్ని బీదరికం నుండి బయట పడవేసే మేధావులు ఇక్కడి నుండి ఎక్కువమంది వచ్చినప్పుడే చాకలి ఐలమ్మ పోరాటానికి ఫలితం దక్కుతుంది.నా దృష్టిలో ఈ పేరుతో వచ్చిన యూనివర్సిటీ ఈ దేశ తాత్విక, ఆధ్యాత్మిక, సామాజిక మార్పునకు పునాది రాయి అవుతుందనీ, ఆ మార్పు వస్తుందనీ ఆశిద్దాం.- వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త - ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్