మెట్రో లైన్ వద్దు
విద్యార్థినుల ఆందోళన
సుల్తాన్‌బజార్: మెట్రో రైల్ ప్రాజె క్ట్‌కు వ్యతిరేకంగా ఈసారి విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఇంతవరకు వివిధ ప్రాంతాల వ్యాపారులు, ప్రజలు దీనికి వ్యతిరేకంగా ఉద్యమించిన సంగతి తెలిసిందే. మెట్రో రైలుప్రాజెక్ట్ నుంచిచారిత్రక కోఠి మహిళా కళాశాలను కాపాడాలని కోరుతూ గురువారం అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఉమెన్స్ కళాశాల మీదుగామెట్రో లైన్ వేయాలన్న ప్రతిపాదనను నిరసిస్తూ గురువారం విద్యార్థినులు తరగతులు బహిష్కరించి, రోడ్డుపై బైఠాయించారు. కోఠి ఉమెన్స్ కళాశాల నుంచి అక్కడి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ‘సీఎం డౌన్ డౌన్’ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. వందలాది మంది విద్యార్థులు రోడ్డుపై బైఠాయించడంతో ఉమెన్స్ కళాశాల నుంచి చాదర్‌ఘాట్ వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ పరిస్థితిని ఊహించకపోవడంతో పోలీసులు వారిని నిలువరించలేకపోయారు. విద్యార్థులకు బడీచౌడి వ్యాపారులు సంఘీభావం తెలుపుతూ ఆందోళనలో పాల్గొన్నారు. 3 గంటల పాటు ఈ ఆందోళన కొనసాగింది.
నేతల అరెస్ట్...
ధర్నా చేస్తున్న విద్యార్థులను అక్కడి నుంచి తరలించేందుకు సుల్తాన్‌బజార్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్‌ఐ నరేశ్‌లు యత్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి చేయి దాటిపోతుండడంతో ఎబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు రాజేంద్రప్రసాద్, నిరంజన్, ఓయూ ఇన్‌చార్జ్ ఎల్లస్వామి, అబిడ్స్ జోన్ ఇన్‌చార్జి శ్రీహరి, టీడీపీ గ్రేటర్ అధికార ప్రతినిధి ఎం.ఆనంద్‌కుమార్‌గౌడ్, వ్యాపారి మనోహర్‌తో పాటు విద్యార్థులను బలవంతంగా పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులను కళాశాలలోకి పంపించడంతో వివాదం సద్దుమణిగింది.