కొత్త మెట్రోలకు ఏప్రిల్‌లో టెండర్లు | CM Revanth Reddy Tenders for new metro in April | Sakshi
Sakshi News home page

కొత్త మెట్రోలకు ఏప్రిల్‌లో టెండర్లు

Published Wed, Jan 8 2025 1:31 AM | Last Updated on Wed, Jan 8 2025 1:31 AM

CM Revanth Reddy Tenders for new metro in April

అధికారులతో సమీక్షిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

మెట్రోలు, ఎలివేటెడ్‌ కారిడార్లపై సమీక్షలో సీఎం రేవంత్‌ ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: ఫ్యూచర్‌ సిటీ, శామీర్‌పేట్, మేడ్చల్‌ మెట్రో మార్గాలకు సంబంధించి వచ్చే ఏప్రిల్‌లో టెండర్లు పిలవాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మార్చిలోగా డీపీఆర్‌లు (సమగ్ర ప్రాజెక్టు నివేదికలు) పూర్తి చేసి, కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌ నగరంలో మెట్రో విస్తరణ, రేడియల్‌ రోడ్ల నిర్మాణాలు, ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణాలపై సీఎం మంగళవారం తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. 

రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం–ఫ్యూచర్‌ సిటీ మెట్రో (40 కి.మీ), జేబీఎస్‌–శామీర్‌పేట మెట్రో (22 కి.మీ), ప్యారడైజ్‌–మేడ్చల్‌ మెట్రో (23 కి.మీ) మార్గాలకు సంబంధించిన భూ సేకరణను వెంటనే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎలివేటెడ్‌ కారిడార్ల విషయంలో భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. 

ఎలైన్‌మెంట్‌ రూపొందించే సమయంలోనే క్షేత్ర స్థాయిలో సమగ్ర పరిశీలన చేయాలని చెప్పారు. మేడ్చల్‌ మార్గంలో జాతీయ రహదారిపై ఇప్పటికే ఉన్న మూడు ఫ్లైఓవర్‌లను దృష్టిలో ఉంచుకుని మెట్రో లైన్‌ తీసుకెళ్లాలని సూచించారు. ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణాన్ని సాధ్యమైంతన త్వరగా ప్రారంభించాలని కూడా అధికారులను సీఎం ఆదేశించారు.  

శామీర్‌పేట్, మేడ్చల్‌ మెట్రోలు ఒకేచోట ప్రారంభం కావాలి 
శామీర్‌పేట్, మేడ్చల్‌ మెట్రోలు ఒకేచోటు నుంచి ప్రారంభమయ్యేలా చూడాలని, అక్కడ అధునాతన వసతులు, భవిష్యత్‌ అవసరాలకు తగినట్లు భారీ జంక్షన్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఆయా ప్రాంతాల వారు ప్రతి పనికి నగరంలోకి రానవసరం లేకుండా అక్కడే అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ఆ జంక్షన్‌ను అభివృద్ధి చేయాలన్నారు. 

హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ (హెచ్‌జీసీఎల్‌) కింద రేడియల్‌ రోడ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (మౌలిక వసతులు) శ్రీనివాసరాజు, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, హైదరాబాద్‌ మెట్రో రైలు ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్, ఫ్లాగ్‌షిష్‌ కార్యక్రమాల కమిషనర్‌ శశాంక తదితరులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement