Sultanbajar
-
రూ.12 లక్షలు కొట్టేసి... 24 గంటల్లో చిక్కారు..
కొలిక్కి వచ్చిన సుల్తాన్‌బజార్ దారి దోపిడీ దుకాణ యజమాని ‘పనివాడే’ సూత్రధారి ఐదుగురు నిందితుల అరెస్టు, పరారీలో ఇద్దరు సుల్తాన్‌బజార్: సుల్తాన్‌బజార్ ఠాణా పరిధిలోని బొగ్గులకుంటలో శనివారం రాత్రి చోటు చేసుకున్న భారీ దారి దోపిడీ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ టీమ్‌తో పాటు ఈస్ట్‌జోన్ అధికారులూ ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దింపి సూత్రధారి సహా ఐదుగురు నింది తుల్ని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. ఆదివారం సుల్తాన్‌బజార్ పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్‌జోన్, టాస్క్‌ఫోర్స్ డీసీపీలు డాక్టర్ వి.రవీందర్, బి.లింబారెడ్డి కేసు పూర్వాపరాలు వివరించారు. అసలేం జరిగిదంటే... రాంకోఠి ప్రాంతానికి చెందిన దివేశ్ హాడియా సిద్దంబర్ బజార్లో రాజాని టైర్స్ పేరిట దుకాణం నిర్వహిస్తున్నారు. దివేష్ శనివారం రాత్రి వ్యాపారం ముగిసిన తర్వాత తన దుకాణం మూసేసి, లావాదేవీలకు సంబంధించిన రూ.12 లక్షల్ని ఓ బ్యాగ్‌లో పెట్టుకుని తన యాక్టివా వాహనంపై ఇంటికి బయలుదేరారు. 8.30 గంటల ప్రాంతంలో తిలక్‌రోడ్డు బొగ్గులకుంటలోని ఆదిత్య ఆసుపత్రి దాటగానే గుర్తుతెలియని వ్యక్తులు దివేష్ వాహనాన్ని మరో వాహనంతో ఢీ కొట్టాడు. దీంతో రెండు వాహనాలపై ఉన్న వారితో పాటు వాహనాలూ కిందపడిపోయాయి. మరో బైక్‌పై వస్తున్న కొందరు వ్యక్తులు వ్యాపారిని లేపి సపర్యలు చేస్తున్నట్లు నటిస్తూ నగదు బ్యాగ్ ఉన్న యాక్టివా వాహనాన్ని ఎత్తుకుపోయారు. ఎవరు, ఎలా ప్లాన్ చేశాడంటే... జియాగూడకు చెందిన జగదీష్ అనే వ్యక్తి దివేష్ ఎదురుగా ఉన్న జైన్ టైర్స్షాపులో పనిచేస్తున్నాడు. దివేష్ దగ్గర పని చేసే వాళ్లు రానప్పుడు జగదీష్ సహాయంగా ఉండేవాడు. దివేష్ దుకాణంలో సహాయకారిగా వచ్చినప్పుడల్లా జగదీష్ అతడి వ్యాపార లావాదేవీలు పరిశీలించేవాడు. ఎప్పుడు దుకాణం మూస్తాడు? ఏ సయమంలో, ఏ మార్గంలో ఎలా ఇంటికి వెళ్తాడు? నగదు ఏ విధంగా తరలిస్తుంటాడు? తదితర అంశాలు క్షుణ్ణంగా గమనించాడు. ఇవన్నీ సంగ్రహించిన తర్వాత దోపిడీకి స్కెచ్ వేశాడు. తాను నేరుగా దోపిడీ చేస్తే చిక్కుతాననే ఉద్దేశంతో తన స్నేహితుడైన మంగళ్‌హాట్ జాలీహనుమాన్ ప్రాంతానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి అశీష్ (20) ద్వారా స్కెచ్ అమలు చేయాలనుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అశీష్ బాలాపూర్ ఇంద్రనగర్‌కు చెందిన మల్లిఖార్జున్ అలియాస్ మాలిక్ (22) అలిబండకు చెందిన బైక్ మెకానిక్ మహ్మద్ అమీర్ (22) మంగళ్‌హట్ జాలీహనుమాన్కు చెందిన రాజమిశ్రా(17), బాలాపూర్‌కు చెందిన మహ్మద్ హబీబ్ (20), జల్పల్లికి చెందిన ఆసిఫ్‌లతో ముఠా ఏర్పాటు చేశారు. స్కెచ్ ఎలా అమలైందంటే... దివేష్ వ్యాపారం శనివారం ఎక్కువగా జరుగుతుందనే ఉద్దేశంతో ఆ రోజే దోపిడీ చేయాలనుకున్నారు. గత శనివారం (11వ తేదీ) అబిడ్స్‌లోని గ్రాండ్ హోటల్లో సమావేశమైన ఈ ముఠా తమ ప్లాన్‌ను అమలు చేయాలనుకుంది. అయితే ఆ రోజు దివేష్ నిత్యం వెళ్లే సమయం కంటే ముందుగా ఇంటికి వెళ్లిపోవడంతో సాధ్యం కాలేదు. దీంతో ఈ శనివారం (18వ తేదీ) ముహూర్తం ఖరారు చేసుకున్నారు. జగదీష్ మినహా మిగిలిన వారంతా దివేష్ను అబిడ్స్ నుంచి ద్విచక్ర వాహనాలపై అనుసరించారు. బొగ్గులకుంట వద్ద మల్లిఖార్జున్ తన వాహనంతో దివేశ్ వాహనాన్ని ఢీ కొట్టాడు. మరో బైక్‌పై వస్తున్న ఆశీష్ ఇతర సభ్యులు సపర్యలు చేస్తున్నట్లు నటించి డిక్కీలో ఉన్న రూ.12 లక్షల బ్యాగ్‌తో పాటు వ్యాపారి వాహనాన్నీ తస్కరించారు. ఎలా దర్యాప్తు చేశారంటే... ఉదంతం జరిగిన గంట తర్వాత బాధితుడు స్థానికుల సాయంతో సుల్తాన్‌బజార్ పోలీసుస్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం ఇచ్చారు. సుల్తాన్‌బజార్ ఏసీపీ రావుల గిరిధర్ నేతృత్వంలో వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎల్.రాజావెంకట రెడ్డి, సుల్తాన్‌బజార్ ఇన్స్పెక్టర్ పి.శివశంకర్ రాావు, అఫ్జల్‌గంజ్ ఇన్స్పెక్టర్ సి.అంజయ్య, సుల్తాన్‌బజార్ డీఐ వంశీకష్ణ తమ బృందాలతో రంగంలోకి దిగారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన నేపథ్యంలో పక్కా పథకం ప్రకారం తెలిసిన వ్యక్తులే చేసినట్లు అనుమానించారు. దివేష్ వద్ద పని చేస్తున్న, పని చేసి మానేసిన, అప్పుడప్పుడు వచ్చి పని చేసే వారి వివరాలు సేకరించారు. దీంతో జగదీష్సింగ్పై అధికారులకు అనుమానం వచ్చింది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా విషయం బయటపడింది. నిందితులు బొగ్గులకుంట మీదుగా చాదర్ఘట్ వెళ్లి అక్కడ నుంచి బాలాపూర్‌కు చెరుకున్నారని తేలింది. హబీబ్ ఇంట్లో నగదు పంచుకున్నారని వెల్లడైంది. ఐదుగురు నిందితులను బాలాపూర్‌లోనే అరెస్ట్ చేసిన పోలీసులు 3 బైకులు, రూ. 10.7 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన మొత్తం పరారీలో ఉన్న మల్లిఖార్జున్, ఆసిఫ్ వద్ద ఉండటంతో వారి కోసం గాలిస్తున్నారు. -
గుజరాతి గల్లీలో రూ. 20 లక్షలు స్వాధీనం
సుల్తాన్‌బజార్: ఎన్నికల నేపథ్యంలో సుల్తాన్‌బజార్ పోలీసులు సోమవారం రాత్రి నిర్వహించిన వాహన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న రూ.20 లక్షలు పట్టుబడ్డాయి. కోఠి గుజరాతి గల్లీలో భరత్, జాకబ్ అనే ఇద్దరు వాహనంలో ఈ డబ్బు తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించి వారి వద్ద ఎలాంటి పత్రాలు లేకపోవడంతో పోలీసులు.. ఈ డబ్బును ఎక్కడికి, ఎందుకు తరలిస్తున్నారనేది తెలుసుకొనే పనిలో పడ్డారు. 183 మద్యం బాటిళ్లు... గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో మద్యం అమ్మకాలపై నిషేధం ఉన్నప్పటికీ పట్టించుకోకుండా ట్రూప్‌బజార్‌లోని సిటీ వైన్స్‌లో సోమవారం మద్యం విక్రయిస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వివిధ కంపెనీలకు చెందిన 183 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని వైన్స్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. అలాగే టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఉమేష్ అనే వ్యక్తి వద్ద రూ. 15 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రూ.2.5 లక్షలు పట్టివేత... మలేషియాటౌన్షిప్: అనుమానాస్పదంగా కారులో ఉన్న రూ. 2.5 లక్షలను కేపీహెచ్‌బీ పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. సీఐ శ్రీకాంత్‌గౌడ్ కథనం ప్రకారం... హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని నాగార్జున హోమ్స్ వద్ద ఇన్నోవా కారులో పెద్ద మొత్తంలో డబ్బు ఉందని పోలీసులకు సమాచారం అందింది. వారు వెళ్లి కారును సోదా చేయగా అందులో రూ. 2.5 లక్షలు నగదు కనిపించడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారు, డబ్బు ఎవరిదనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామ ని, నిందితులను గుర్తించి కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు. కాగా, కారులో ఉన్న నగదు టీఆర్ఎస్ పార్టీ వారిదేనని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తూ ఫిర్యాదు చేయగా..., తమ కారు అద్దం పగులగొట్టి కారులో డబ్బు పెట్టి టీడీపీ వారు తప్పుడు ఫిర్యాదు చేస్తున్నారని టీఆర్ఎస్ వారు పరస్పరం ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. -
మా రూటులో ‘మెట్రో’ వద్దు
సీఎంకు సుల్తాన్ బజార్ ట్రేడర్స్ అసోసియేషన్ ప్రతినిధుల విజ్ఞప్తి పంజగుట్ట: తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు మెట్రో రైలు మార్గాన్ని సుల్తాన్‌బజార్ మీదుగా కాకుండా ప్రత్యామ్నాయ మార్గానికి మార్చాలని సుల్తాన్ బజార్ ట్రేడర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ట్రేడ్‌యూనియన్ నాయకుడు రామ్‌దాస్, హరిట్ రూడా, సుల్తాన్ బజార్ ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డి.శంకర్, ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రావులు మాట్లాడుతూ నిజాం కాలం నుండి సుమారు 200 సంవత్సరాల చరిత్ర సుల్తాన్‌బజార్‌కు ఉందన్నారు. ఇక్కడ ప్రత్యక్షంగా సుమారు 1000 మంది వ్యాపారులు ఉన్నారని, వీరిపై ఆధారపడిన కుటుంబాలు ఎంతో మంది రోడ్డున పడే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ఇటీవలి కాలంలో అర్ధరాత్రి సమయంలో మెట్రో అధికారులు సుల్తాన్‌బజార్‌లో సర్వేలు నిర్వహిస్తున్నారని, తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సర్వేలు ఏవిధంగా చేస్తారని వారు ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని మెట్రో ఉన్నతాధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు రామశెట్టి, ముఖేష్, సుధీర్‌కుమార్, ఖలీల్ అహ్మద్, శిశిభూషన్ తదితరులు పాల్గొన్నారు. -
ఏం చేద్దాం?
ఉస్మానియా రోగుల తరలింపుపై తర్జన భర్జన ఏరియా ఆస్పత్రులపై పునరాలోచన ప్రసూతి సేవలన్నీ ఒకే చోట అందించాలని ప్రతిపాదన సిటీబ్యూరో: ఉస్మానియా ఆస్పత్రి పాత భవనంలోని రోగుల తరలింపు అంశంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. జనరల్ మెడిసిన్ వి భాగాన్ని ఫీవర్ ఆస్పత్రికి, ఆర్థోపెడిక్ విభాగాన్ని కింగ్‌కోఠి ఆస్పత్రికి తరలించడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు కానీ... మిగతా విభాగాల తరలింపు అంశాన్ని ఎటూ తేల్చలేకపోవడంతో వాటి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. సర్జికల్ గ్యాస్ట్రో, న్యూరాలజీ వ ంటి కీలక విభాగాలను మెడికల్ కళాశాలకు దూరంగా ఏరియా ఆస్పత్రులకు తరలిస్తే శస్త్ర చికిత్సలకు ఇబ్బందులు తప్పవు. అంతే కాదు... మెడికో లీగల్ (ఎంఎల్సీ) కేసుల విషయం వైద్యుల మధ్య ఘర్షణ సృష్టించే అవకాశం ఉంది. ఎంసీఐ మెడికల్ సీట్లను రద్దు చేసే ప్రమాదం ఉంది. ఆయా ఆస్పత్రుల్లోని ఆపరేషన్ థియేటర్లు శస్త్రచికిత్సలకు పనికిరావనే అభిప్రాయం వ్యక్తమవుతుండడంతో దీనిపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. రోగులందరినీ రెండు మూడు చోట్ల సర్దుబాటు చేస్తే ఎలాంటి సమస్యలూ ఉండవు. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి మంగళవారం మరోసారి వైద్యులు, అధికారులతో చర్చించి, ఆ తర్వాత తుదినిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది. పేట్లబురుజుకు సుల్తాన్‌బజార్ ఉస్మానియా రోగులను పేట్లబురుజుకు తరలిస్తే... గర్భిణులు, బాలింతలు, ఇతర మహిళలు ఉండే చోట పురుషులను ఉంచాల్సి వస్తుంది. దీనివల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఉస్మానియా వైద్య కళాశాలకు అనుబంధంగా పని చేస్తున్న సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆస్పత్రిలోని రోగులను పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రికి తరలించడం వల్ల సాంకేతికంగా సమస్యలు తలెత్తవు. అంతేకాకుండా మెడికల్ కాలేజీకి సమీపంలో 360 పడకలను సర్దుబాటు చేయవచ్చు. దీని వల్ల రోగులకే కాదు... వైద్యులు, వైద్య విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. ఇక నిలోఫర్ నవజాత శిశువుల కేంద్రంలో తగినన్ని పడకలు లేకపోవడంతో ఒకే పడకపై ముగ్గురు నలుగురు రోగులను ఉంచి చికిత్స చేస్తున్నారు. 400 పడకల సామర్థ్యం ఉన్న కొత్త భవనాన్ని ఇచ్చేందుకు ఎన్ఆర్హెచ్ఎం అంగీకరించకపోవచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇందుకు అంగీకరిస్తే ఎలాంటి సమస్యా ఉండదు. ఒక వేళ నిరాకరిస్తే ఏం చేయాలనేది ప్రశ్నార్థకంగా మారింది. నర్సింగ్ విద్యార్థుల తరలింపుపై విస్త్రృత చర్చ ఓ వైపు పాత భవనంలోని పడకల తరలింపు అంశంపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతుండగా... మరోవైపు నర్సింగ్ కాలేజీ విద్యా ర్థులు, నర్సులు తమ భవితవ్యంపై విస్త్రృతంగా చర్చించుకుంటున్నారు. ‘రోగులను తరలిస్తారు సరే.. మా సంగతేమిటి?’ అని ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు సోమవారం ఆస్పత్రిలో ఏపీ నర్సింగ్ అసోసియేషన్‌లోని నర్సులంతా సమావేశమయ్యారు. తమకు ఎక్కడ ఆశ్రయం కల్పిస్తారో స్పష్టం చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పడకల తరలింపు, సర్దుబాటు అంశంపై తమ అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని... ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు. నర్సులంతా విధులను బహిష్కరించి సమావేశం కావడంతో సకాలంలో వైద్యసేవలు అందక రోగులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. -
మెట్రో లైన్ వద్దు
విద్యార్థినుల ఆందోళన సుల్తాన్‌బజార్: మెట్రో రైల్ ప్రాజె క్ట్కు వ్యతిరేకంగా ఈసారి విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఇంతవరకు వివిధ ప్రాంతాల వ్యాపారులు, ప్రజలు దీనికి వ్యతిరేకంగా ఉద్యమించిన సంగతి తెలిసిందే. మెట్రో రైలుప్రాజెక్ట్ నుంచిచారిత్రక కోఠి మహిళా కళాశాలను కాపాడాలని కోరుతూ గురువారం అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఉమెన్స్ కళాశాల మీదుగామెట్రో లైన్ వేయాలన్న ప్రతిపాదనను నిరసిస్తూ గురువారం విద్యార్థినులు తరగతులు బహిష్కరించి, రోడ్డుపై బైఠాయించారు. కోఠి ఉమెన్స్ కళాశాల నుంచి అక్కడి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ‘సీఎం డౌన్ డౌన్’ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. వందలాది మంది విద్యార్థులు రోడ్డుపై బైఠాయించడంతో ఉమెన్స్ కళాశాల నుంచి చాదర్‌ఘాట్ వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ పరిస్థితిని ఊహించకపోవడంతో పోలీసులు వారిని నిలువరించలేకపోయారు. విద్యార్థులకు బడీచౌడి వ్యాపారులు సంఘీభావం తెలుపుతూ ఆందోళనలో పాల్గొన్నారు. 3 గంటల పాటు ఈ ఆందోళన కొనసాగింది. నేతల అరెస్ట్... ధర్నా చేస్తున్న విద్యార్థులను అక్కడి నుంచి తరలించేందుకు సుల్తాన్‌బజార్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్ఐ నరేశ్‌లు యత్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి చేయి దాటిపోతుండడంతో ఎబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు రాజేంద్రప్రసాద్, నిరంజన్, ఓయూ ఇన్చార్జ్ ఎల్లస్వామి, అబిడ్స్ జోన్ ఇన్చార్జి శ్రీహరి, టీడీపీ గ్రేటర్ అధికార ప్రతినిధి ఎం.ఆనంద్‌కుమార్‌గౌడ్, వ్యాపారి మనోహర్‌తో పాటు విద్యార్థులను బలవంతంగా పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులను కళాశాలలోకి పంపించడంతో వివాదం సద్దుమణిగింది. -
పేద యువతులకు ‘షాదీ ముబారక్’
హెల్ప్ లైన్ ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి మహమూద్ సుల్తాన్‌బజార్: పేద యువతులకు ‘షాదీ ముబారక్’ పథకం వరం లాంటిదని తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. సోమవారం అబిడ్స్ తిలక్‌రోడ్‌లోని బీమాభవన్‌లో ఉన్న కమిషనర్ మైనార్టీ వెల్ఫేర్ కార్యాలయంలో షాదీ ముబారక్ మద్దత్ హెల్ప్‌లైన్ (040-246760452)ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మహామూద్‌అలీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముస్లిం, సిక్కు, క్రిస్టియన్ మైనారిటీ, బౌద్ధ తదితర మైనార్టీలకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. పెళ్లికి నెల రోజుల ముందు మీసేవ, ఆన్లైన్ ద్వారా- epasswebsite.cgg.gov.in వెబ్సైట్లో షాదీ ముబారక్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. యువతులు జోరో బ్యాలెన్స్‌తో ఖాతా తెరుచుకోవాల్సి ఉంటుందని వివరించారు. అక్టోబర్ 2 తర్వాత పెళ్లి అయిన వారు పెళ్లి సర్టిఫికెట్ సమర్పించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మైనార్టీ వెల్ఫేర్ డెరైక్టర్ ఎంజె. అక్బర్, డిప్యూటీ డెరైక్టర్ సుభాష్ చందర్‌గౌడ్, నవీన్ నికోలేస్( క్రిస్టియాన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్), శుకూర్( మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్)తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.