మా రూటులో ‘మెట్రో’ వద్దు
సీఎంకు సుల్తాన్ బజార్ ట్రేడర్స్
అసోసియేషన్ ప్రతినిధుల విజ్ఞప్తి
పంజగుట్ట: తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు మెట్రో రైలు మార్గాన్ని సుల్తాన్‌బజార్ మీదుగా కాకుండా ప్రత్యామ్నాయ మార్గానికి మార్చాలని సుల్తాన్ బజార్ ట్రేడర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ట్రేడ్‌యూనియన్ నాయకుడు రామ్‌దాస్, హరిట్ రూడా, సుల్తాన్ బజార్ ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డి.శంకర్, ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రావులు మాట్లాడుతూ నిజాం కాలం నుండి సుమారు 200 సంవత్సరాల చరిత్ర సుల్తాన్‌బజార్‌కు ఉందన్నారు.
ఇక్కడ ప్రత్యక్షంగా సుమారు 1000 మంది వ్యాపారులు ఉన్నారని, వీరిపై ఆధారపడిన కుటుంబాలు ఎంతో మంది రోడ్డున పడే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ఇటీవలి కాలంలో అర్ధరాత్రి సమయంలో మెట్రో అధికారులు సుల్తాన్‌బజార్‌లో సర్వేలు నిర్వహిస్తున్నారని, తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సర్వేలు ఏవిధంగా చేస్తారని వారు ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని మెట్రో ఉన్నతాధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు రామశెట్టి, ముఖేష్, సుధీర్‌కుమార్, ఖలీల్ అహ్మద్, శిశిభూషన్ తదితరులు పాల్గొన్నారు.