సాక్షి, హైదరాబాద్: జూలై చివరివారంలో ఎల్‌బీ నగర్– అమీర్‌పేట్(16 కి.మీ) మార్గంలో మెట్రో రైళ్లు పరుగులు తీస్తాయని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. సీఎం కేసీఆర్ ప్రారంభోత్సవం చేస్తా రని తెలిపారు. బుధవారం ఈ మార్గం మెట్రోరైలులో ప్రయాణించి ట్రయల్‌రన్‌ను పరిశీలించా రు. లక్డీకాపూల్, ఎంజీబీఎస్, ఎల్‌బీనగర్ మెట్రోస్టేషన్లు, పరిసరాల అభివృద్ధి పనులను మంత్రి తనిఖీ చేశారు. అక్టోబర్‌లో హైటెక్ సిటీ–అమీర్‌పేట్ మార్గంలో మెట్రోరైళ్లు పరుగులు తీస్తాయని చెప్పారు.
ఎల్‌బీనగర్ మెట్రోస్టేషన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలోని 3 మెట్రో కారిడార్లను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానించేలా మెట్రో రెండోదశ ప్రాజెక్టును చేపడతామన్నారు. గచ్చిబౌలి–శంషా బాద్ విమానాశ్రయం, ఎల్‌బీనగర్–నాగోలు, ఎల్‌బీనగర్–ఫలక్‌నుమా–శంషాబాద్ విమానా శ్రయ మార్గాల్లో మెట్రోప్రాజెక్టుల సమగ్ర ప్రాజె క్టు నివేదిక ఆగస్టులో సిద్ధమవుతుందన్నారు. కేటీఆర్ వెంట మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ మల్లా రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి మెట్రోలో ప్రయాణించారు.
15 రోజుల్లో టెండర్లు..
మెట్రోస్టేషన్ల వద్ద పార్కింగ్ కష్టాలను తీర్చేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో 3 మెట్రో కారిడార్లతోపాటు అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వద్ద 42 మల్టీలెవల్ పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు.
ఈ పార్కింగ్ కేంద్రాల నిర్మా ణానికి 15 రోజుల్లో టెండర్లు పిలవనున్నామని తెలిపారు. ఎంజీబీఎస్, జేబీఎస్ బస్‌స్టేషన్లు, సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్లను మెట్రో ప్రాజెక్టుకు అనుసంధానిస్తామని చెప్పారు. అమీర్‌పేట్–ఎల్‌బీనగర్ రూట్ మెట్రో ప్రారంభమైతే 46 కిలోమీటర్ల మేర మెట్రో ప్రజలకు అందుబాటులోకి రానుందన్నారు.
మెట్రో రెండోదశ మార్గాలివే ...
మెట్రో రెండోదశ ప్రాజెక్టులో ప్రధానంగా నాగోల్–ఎల్‌బీనగర్, గచ్చిబౌలి–శంషాబాద్, ఎల్‌బీనగర్–ఫలక్‌నుమా–శంషాబాద్ విమానాశ్రయ మార్గాల్లో మెట్రో ప్రాజెక్టును విడతలవారీగా చేపడతామని కేటీఆర్ తెలిపారు.
నగరంలో కాలుష్య ఉద్గారాలను తగ్గించడానికి జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎంఆర్, సెట్విన్ల సౌజన్యంతో 500 ఎలక్ట్రిక్ బస్సులను త్వరలో ప్రవేశపెడతామని కేటీఆర్ చెప్పారు. మియాపూర్ మెట్రో డిపోలో ప్రయోగాత్మకంగా ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్లు, డిపోలు, మెట్రోస్టేషన్లు, అందుబాటులో ఉన్న ప్రభుత్వస్థలాల్లో ఎలక్ట్రిక్ బస్సులు, వాహనాల చార్జింగ్ కేంద్రాలను నెలకొల్పుతామని చెప్పారు.
నాంపల్లి– రంగమహల్ మార్గంలో..
నాంపల్లి–రంగమహల్ మెట్రో మార్గంలో మొజం జాహీ మార్కెట్‌సహా పలు చారిత్రక కట్టడాలు, నగర వారసత్వ సంపద కనిపించేలా పలు అభివృద్ధి పనులు చేపడతామని మంత్రి తెలిపారు. మియాపూర్ మెట్రో డిపో తరహాలోనే ఎల్‌బీనగర్ ప్రాంత మెట్రోస్టేషన్ల పరిసరాల్లో ప్రజోపయోగ స్థలాలు, తీరైన పార్కింగ్, స్ట్రీట్ ఫర్నిచర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
నిర్మాణ సంస్థకు నిధుల కటకట?
నాగోల్–హైటెక్‌సిటీ, ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్ రూట్లో మెట్రో ప్రాజెక్టు నిర్మాణవ్యయం ప్రస్తుతం అనుకున్న రూ.14 వేల కోట్లకు అదనంగా మరో రూ.3500 కోట్లు పెరిగినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆస్తుల సేకరణ ప్రక్రియ జఠిలంగా మారడం, అలైన్‌మెంట్ తకరారు వంటి కారణాలతో నిర్మాణ సమయం కూడా పెరిగిన నేపథ్యంలో వ్యయం అనూహ్యంగా పెరిగినట్లు సమాచారం.
పెరిగిన వ్యయాన్ని తమకు చెల్లించాలని నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ ప్రభుత్వానికి పలుమార్లు నివేదించినా సర్కారు నుంచి స్పందన లేదని తెలిసింది. నిర్మాణవ్యయం పెరగడంతో నిధులసేకరణ కష్టంగా మారినట్లు సమాచారం. వెయ్యి ఆస్తుల సేకరణ, పరిహారం చెల్లింపు వంటి అంశాలు జఠిలంగా మారడంతో పాతనగరంలో మెట్రోరైళ్లు పరుగుల తీయడం మరింత ఆలస్యమవుతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment