సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కొందరిపై వేటు పడటం ఖరారైందా? సుమారు 20–25 మందికి ఈసారి టికెట్ దక్కనట్టేనా? దీనిపై ఆయా ఎమ్మెల్యేలకు బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే సంకేతాలు ఇచ్చేశారా..?.. ఈ ప్రశ్నలకు బీఆర్‌ఎస్ పార్టీ,ప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాలు అవుననే సమాధానమే ఇస్తున్నాయి.
త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులపై సుదీర్ఘ కసరత్తు చేసిన కేసీఆర్.. జాబితాను దాదాపు ఖరారు చేశారని స్పష్టం చేస్తున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావు అమెరికా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో.. రెండు మూడు రోజుల్లో సుమారు 80–90 మంది అభ్యర్థులతో బీఆర్‌ఎస్ తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని చెప్తున్నాయి. గెలుపు గుర్రాలకు ప్రాధాన్యతనిస్తూ, ఆచితూచి అభ్యర్థుల ఎంపిక జరిగినట్టు వివరిస్తున్నాయి.
ఆ సంకేతాలతోనే భేటీలు!
20మందికిపైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ దక్కదనే సంకేతాల నేపథ్యంలో.. ఉమ్మడి జిల్లాల వారీగా ఎవరెవరిపై వేటు పడుతుందన్నది బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతోంది. తమకు అవకాశం దక్కదనే సంకేతాలు అందుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. చివరి ప్రయత్నంగా కేసీఆర్‌తోపాటు కీలక నేతలు కేటీఆర్, హరీశ్‌రావు తదితరులను కలుస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థికి సహకరించి, గెలుపు కోసం పనిచేయాలని.. పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తే భవిష్యత్తులో ఇతర అవకాశాలు ఇస్తామని కీలక నేతలు నచ్చజెప్తున్నట్టు సమాచారం.
పోటీ అవకాశం దక్కని ఎమ్మెల్యేలను బుజ్జగించడం, సర్దుబాట్లు, ఇతర నష్ట నివారణ చర్యలపైనా కీలక నేతలకు కేసీఆర్ ఆదేశించినట్టు తెలిసింది. ఇక కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమకు టికెట్ నిరాకరణపై ఎలాంటి సమాచారం లేదని చెప్తున్నారు. ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో తమ ప్రధాన అనుచరులు, కేడర్‌తో భేటీలు జరుపుతూ బలప్రదర్శన ద్వారా అధిష్టానంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు వేటుపడే సిట్టింగ్‌ల స్థానంలో అవకాశం దక్కిందనే సంకేతాలు అందుకున్న నేతలు.. ఆయా నియోజకవర్గాల్లో తమ కార్యకలాపాలను ముమ్మరం చేశారు. సిట్టింగ్‌ల అనుచరులు, క్షేత్రస్థాయి శ్రేణులతో భేటీ అవుతూ తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు.
వేటు వెనుక కారణాలెన్నో..
గెలుపు అవకాశాలు, ఆరోపణలు, సామాజికవర్గ సమీకరణాలు, వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలు, 2018లో కాంగ్రెస్, టీడీపీల నుంచి గెలిచి బీఆర్‌ఎస్‌లో చేరినవారు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు నల్లాల ఓదెలు (చెన్నూరు), బాబూమోహన్ (ఆందోల్), మల్కాజిగిరి (కనకారెడ్డి), ఎం.సు«దీర్‌రెడ్డి (మేడ్చల్), కొండా సురేఖ (వరంగల్ తూర్పు), సంజీవరావు (వికారాబాద్), బొడిగె శోభ (చొప్పదండి)లకు కేసీఆర్ టికెట్లు నిరాకరించారు.
ఈ నిర్ణయం వెనుక వారి పనితీరుతోపాటు నియోజకవర్గ పరిధిలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు కీలకంగా మారినట్టు సమాచారం. కొన్నిచోట్ల ఎమ్మెల్యేల పట్ల ఎలాంటి ప్రతికూలతలు లేకున్నా.. ప్రత్యర్థి పార్టీల ఎత్తుగడలు, బలాన్ని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థి మార్పునకు కేసీఆర్ మొగ్గు చూపినట్లు తెలిసింది. స్థానిక కేడర్‌తో విభేదాలు, అవినీతి, బంధుప్రీతి తదితరాలతో పార్టీకి జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని కొందరిని పక్కన పెట్టాలని నిర్ణయించారు.
2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి 12 మంది, టీడీపీ నుంచి ఇద్దరితోపాటు మరో స్వతంత్ర ఎమ్మెల్యే బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి మళ్లీ టికెట్ ఇస్తామని కేసీఆర్ భరోసా ఇచ్చినా.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వారిలో ఒకరిద్దరికి టికెట్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదని బీఆర్‌ఎస్ వర్గాలు చెప్తున్నాయి.
కొత్తగా ఎవరు?.. మారేదెవరు?
కోరుట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావుకు బదులుగా ఆయన కుమారుడు డాక్టర్ సంజయ్‌కు టికెట్ ఇవ్వొచ్చనే అంచనా ఉంది. దీనితోపాటు కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్‌పూర్), పల్లా రాజేశ్వర్‌రెడ్డి (జనగామ), లక్ష్మీకాంతరావు (వేములవాడ), సునీతా లక్ష్మారెడ్డి (నర్సాపూర్), బండారి లక్ష్మారెడ్డి (ఉప్పల్), బానోత్ మదన్‌లాల్ (వైరా)లకు కూడా కేసీఆర్ సానుకూల సంకేతాలు ఇచ్చినట్టు తెలిసింది.
ఇక మంత్రులు కొప్పుల ఈశ్వర్ (ధర్మపురి), తలసాని శ్రీనివాస్ యాదవ్ (సనత్‌నగర్), మల్లారెడ్డి (మేడ్చల్)లను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయించాలని సీఎం భావిస్తే.. ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో కొత్త పేర్లు తెరమీదకు వచ్చే అవకాశం ఉందని బీఆర్‌ఎస్ వర్గాలు చెప్తున్నాయి.
– కమ్యూనిస్టులతో పొత్తు కుదరితే మునుగోడు (సీపీఐ), భద్రాచలం (సీపీఎం) వారికి కేటాయించవచ్చని.. తాండూరు, మానకొండూరు, పెద్దపల్లి, కామారెడ్డి తదితర నియోజకవర్గాలపై మలి జాబితాలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
బీఆర్‌ఎస్‌లో 20 మందికిపైగా సిట్టింగ్‌లకు నో టికెట్!
Published Fri, Aug 18 2023 12:51 AM | Last Updated on Fri, Aug 18 2023 8:14 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment