మెట్రో పనులు చేపట్టాల్సిన ప్రాంతం
సాక్షి, సిటీబ్యూరో: పాతబస్తీవాసుల మెట్రో కల త్వరలో సాకారం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. పాత అలైన్‌మెంట్ ప్రకారమే పాత నగరానికి మెట్రో మార్గాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో ఓల్డ్‌సిటీ మెట్రో ప్రాజెక్టుపై మళ్లీ ఆశలు చిగురించాయి. జేబీఎస్–ఫలక్‌నుమా మార్గంలో ప్రస్తు తం మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ వరకు మాత్రమే (సుమారు 10 కిలోమీటర్ల మార్గంలో) మెట్రో పనులు దాదాపు పూర్తికావచ్చాయి. అక్కడి నుంచి సుమారు 5.3 కి.మీ దూరంలో ఉన్న ఫలక్‌నుమా వరకు మెట్రో మార్గాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రధానంగా ఎంజీబీఎస్ నుంచి సాలార్జంగ్ మ్యూజియం–చార్మినార్–శాలిబండ–శంషీర్‌గంజ్–జానంమెట్–ఫలక్‌నుమా మార్గంలో మెట్రో మార్గాన్ని ఏర్పాటు చేయనున్నారు.
ఈ మార్గంలో మెట్రో ప్రాజెక్టు కోసం సుమారు వెయ్యి ఆస్తులను సేకరించాల్సి ఉందని హైదరాబాద్ మెట్రో రైలు వర్గాలు తెలిపాయి. కాగా ఇప్పుడు పనులు ప్రారంభించి.. ఆస్తుల సేకరణ ప్రక్రియ సజావుగా పూర్తయితే మరో రెండేళ్లలో అంటే 2020లో మాత్రమే పాతబస్తీ వాసులకు మెట్రో కల సాకారం కానుంది. కాగా పాతనగరానికి మెట్రో మార్గాన్ని ఏర్పాటు చేయాలని ఇటీవల విపక్షాలు పెద్దఎత్తున ఆందోళన చేపట్టిన విషయం విధితమే. పాతఅలైన్‌మెంట్ ప్రకారం మెట్రో చేపడితే ఈ రూట్లో ఉన్న సుమారు 50 ప్రార్థన స్థలాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని కొన్ని రాజకీయ పక్షాలు ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ మార్గాన్ని మార్పు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం నిర్ణయించింది. అయితే మూసీ గర్భం నుంచి మెట్రో మార్గాన్ని ఏర్పాటు చేయడం సాంకేతికంగా సాధ్యపడదని ఎల్‌అండ్‌టీ నిపుణుల కమిటీ తేల్చిచెప్పడంతో సర్కారు పాత అలైన్‌మెంట్ వైపే మొగ్గుచూపడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment