గుజరాతి గల్లీలో రూ. 20 లక్షలు స్వాధీనం
సుల్తాన్‌బజార్: ఎన్నికల నేపథ్యంలో సుల్తాన్‌బజార్ పోలీసులు సోమవారం రాత్రి నిర్వహించిన వాహన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న రూ.20 లక్షలు పట్టుబడ్డాయి. కోఠి గుజరాతి గల్లీలో భరత్, జాకబ్ అనే ఇద్దరు వాహనంలో ఈ డబ్బు తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించి వారి వద్ద ఎలాంటి పత్రాలు లేకపోవడంతో పోలీసులు.. ఈ డబ్బును ఎక్కడికి, ఎందుకు తరలిస్తున్నారనేది తెలుసుకొనే పనిలో పడ్డారు.
183 మద్యం బాటిళ్లు...
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో మద్యం అమ్మకాలపై నిషేధం ఉన్నప్పటికీ పట్టించుకోకుండా ట్రూప్‌బజార్‌లోని సిటీ వైన్స్‌లో సోమవారం మద్యం విక్రయిస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వివిధ కంపెనీలకు చెందిన 183 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని వైన్స్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. అలాగే టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఉమేష్ అనే వ్యక్తి వద్ద రూ. 15 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రూ.2.5 లక్షలు పట్టివేత...
మలేషియాటౌన్‌షిప్: అనుమానాస్పదంగా కారులో ఉన్న రూ. 2.5 లక్షలను కేపీహెచ్‌బీ పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. సీఐ శ్రీకాంత్‌గౌడ్ కథనం ప్రకారం... హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని నాగార్జున హోమ్స్ వద్ద ఇన్నోవా కారులో పెద్ద మొత్తంలో డబ్బు ఉందని పోలీసులకు సమాచారం అందింది. వారు వెళ్లి కారును సోదా చేయగా అందులో రూ. 2.5 లక్షలు నగదు కనిపించడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారు, డబ్బు ఎవరిదనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామ ని, నిందితులను గుర్తించి కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు. కాగా, కారులో ఉన్న నగదు టీఆర్‌ఎస్ పార్టీ వారిదేనని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తూ ఫిర్యాదు చేయగా..., తమ కారు అద్దం పగులగొట్టి కారులో డబ్బు పెట్టి టీడీపీ వారు తప్పుడు ఫిర్యాదు చేస్తున్నారని టీఆర్‌ఎస్ వారు పరస్పరం ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.