‘కూటమి’పై కక్ష.. పోలీసుల వివక్ష | Congress allies' plaint to EC on KCR | Sakshi
Sakshi News home page

‘కూటమి’పై కక్ష.. పోలీసుల వివక్ష

Published Fri, Oct 26 2018 2:36 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

Congress allies' plaint to EC on KCR - Sakshi

గురువారం సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేస్తున్న టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్, ఎల్‌.రమణ, చాడ, దిలీప్‌కుమార్‌ తదితరులు

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల కోడ్‌ అమల్లో పోలీసులు వివక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్ష పార్టీ ల నేతల లక్ష్యంగా వాహనాల తనిఖీలు జరుపుతూ వేధింపులకు గురిచేస్తున్నారని మహకూటమి ఆరో పించింది. నిష్పక్షపాత, స్వేచ్ఛాయుత వాతావరణం లో ఎన్నికలు జరగడం లేదని, కొందరు పోలీసు లు అధికార టీఆర్‌ఎస్‌కు కొమ్ముకాస్తున్నారని పేర్కొంది. మహాకూటమి తరఫున టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, టీజేఎస్‌ ఉపాధ్యక్షుడు కపిలవాయి దిలీప్‌కుమార్‌ బృందం గురువారం సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) రజత్‌కుమార్‌కు ఫిర్యాదు చేసింది.

అనంతరం ఉత్తమ్‌ మాట్లాడుతూ.. మహాకూటమి నేతల పట్ల కొందరు పోలీసులు కక్షపూరిత, పక్షపాత వైఖరిపై నిర్దిష్ట ఆధారాలతో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులతో ఎల్‌.రమణ ప్రయాణిస్తున్న వాహనాన్ని టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ బంధువు రాధాకృష్ణారావు తనిఖీ చేసి అవమానించారన్నారు. రమణ అనుచరులను పోలీసులు పట్టుకెళ్లి హింసించారని ఆరోపించారు. చివరికి టీజేఎస్‌ అధినేత ఎం.కోదండరాం వాహనాన్ని సైతం పోలీసులు ఆపి సోదాలు జరిపారని, టీజేఎస్‌ కార్యాలయం వద్ద భారీ సంఖ్యలో ఇంటెలిజెన్స్‌ సిబ్బందిని మోహరించారని తెలిపారు.

పోరాడినందుకే నాపై కుట్రలు..: రమణ  
మహాకూటమి ఏర్పాటును జీర్ణించుకోలేక ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ గత పది రోజులుగా తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఎల్‌.రమణ ఆరోపించారు. వస్త్ర వ్యాపారులు, హవాలా, హుండీ వ్యాపారుల నుంచి జప్తు చేసిన డబ్బును తన పేరు అంటగట్టి వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పారు. 42 ఏళ్ల రాజకీయ జీవితంలో తనపై ఒక్క కేసు లేదన్నారు. రైతు ఆత్మహత్యలు, నేరళ్లలో దళితులపై దాడులు, మియాపూర్‌ భూ కుంభకోణానికి వ్యతిరేకంగా పోరాడినందుకే కేసీఆర్‌ తనపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

టాస్క్‌ఫోర్స్‌ ఎస్‌ఐ ఎస్‌.శ్రీనివాస్‌ తన అనుచరులపై పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని ఫిర్యాదు చేశామన్నారు. కేసీఆర్‌ శంకరగిరి మాన్యాలకు వెళ్లే సమయం వచ్చిందన్నారు. ఆయన్ను గద్దె దింపే వరకు పోరాడుతామని చెప్పారు. ఇప్పటికే కేసీఆర్‌ తన పార్టీ అభ్యర్థులకు రూ.1000 కోట్లు పంపించారని, పెద్ద మొత్తంలో డబ్బుల పంపిణీ జరుగుతోందని ఆరోపించారు.  

కేసీఆర్‌ కనుసన్నల్లో పోలీసులు: చాడ
పోలీసు అధికారులు సీఎం కేసీఆర్‌ కనుసన్నల్లో పని చేస్తున్నారని చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ఇప్పటి వరకు విపక్షాలను టార్గెట్‌ చేసిన కేసీఆర్‌ ఇప్పుడు మహాకూటమిని టార్గెట్‌ చేశారన్నారు. పోలీసులు కేసీఆర్‌కు తాబేదారులుగా వ్యవహరిస్తున్నారని, కోదండరాం లాంటి వ్యక్తులపై నిఘా పెట్టడం దుర్మా ర్గమని కపిలవాయి దిలీప్‌కుమార్‌ మండిపడ్డారు.  


‘ఇంటెలిజెన్స్‌’తో ఫోన్‌ ట్యాపింగ్‌.. 
రాజకీయ అవసరాలకు ఇంటెలిజెన్స్‌ డీఐజీ ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో విపక్ష పార్టీల నేతల ఫోన్ల ట్యాపింగ్‌ చేయిస్తూ ప్రభుత్వం తమ ప్రాథమిక హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యతకు భంగం కలిగిస్తోందని ఉత్తమ్‌ మండిపడ్డారు. రాష్ట్రంలో ఎవరెవరి ఫోన్లను ట్యాపింగ్‌ చేస్తున్నారో తెలపాలని హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర డీజీపీ, ఇంటెలిజెన్స్‌ డీఐజీల నుంచి వివరాలు కోరుతామని సీఈఓ హామీ ఇచ్చారని తెలిపారు.

మహాకూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బాధ్యులైన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కేసీఆర్‌ సొంత పత్రిక, న్యూస్‌ చానల్‌ ద్వారా విపక్ష పార్టీల నేతలపై చేస్తున్న దుష్ప్రచారంపై కూడా ఫిర్యాదు చేశామన్నారు. మెట్రో, ఎంఎంటీఎస్‌ రైళ్ల మీద సీఎం కేసీఆర్‌ బొమ్మలతో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ప్రచార ప్రకటనలను తొలగిస్తామని సీఈఓ హామీనిచ్చినట్లు చెప్పారు. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా సీఎం నివాసం ప్రగతిభవన్, మంత్రుల నివాసాలను పార్టీ సమావేశాలకు వినియోగిస్తున్నారని సీఈఓ దృష్టికి తీసుకెళ్లామని ఉత్తమ్‌ చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement