‘కేసీఆర్‌ అంటే.. ఖావో కమీషన్‌ రావు’ | Rahul Gandhi Fires On KCR | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 30 2018 2:41 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

Rahul Gandhi Fires On KCR - Sakshi

ఆర్మూర్‌లో..
నీళ్లు, నిధులు, నియామకాలు.. అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్‌ ప్రాజెక్టుల రీడిజైన్‌ పేరుతో ప్రాణహిత అంచనాలను రూ.50 వేల కోట్ల నుంచి రూ.90 వేల కోట్లకు పెంచారు. కేవలం పేరు మార్చి రూ.40 వేల కోట్లు లూటీ చేశారు. ఈ రీ డిజైన్‌తో కేసీఆర్‌ కుటుంబమే లబ్ధి పొందింది. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పేరుతో పాత చెరువులకు రంగులద్ది నిధులు లూటీ చేశారు. కేసీఆర్‌.. ఖావో కమీషన్‌రావుగా మారారు.

భూపాలపల్లిలో.. 
రాష్ట్రంలో కేసీఆర్, కేంద్రంలో మోదీ అభివృద్ధి నిరోధకులుగా మారారు. హిందుస్తాన్‌ ఏరోనాటికల్‌ను కాదని మోదీ అనిల్‌ అంబానీతో కలసి రూ.30,000 కోట్ల కుంభకోణానికి కారణమయ్యాడు. కేంద్రం కనిపించిన ప్రతి ప్రభుత్వ పరిశ్రమను ప్రైవేటీకరించాలని అనుకుంటోంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కేసీఆర్‌ అవినీతే కనబడుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత లక్ష ఉద్యోగాలు ఇస్తాం. ఒకే విడతలో రూ.2 లక్షలు రైతు రుణమాఫీ చేస్తాం.

పరిగిలో.. 
కేసీఆర్‌జీ.. మీరు విశ్రాంతి తీసుకోండి. అభివృద్ధి ఎలా చేయాలో మేం చేసి చూపిస్తాం. ఈ ఎన్నికల్లో ఓడితే ఇంట్లో విశ్రాంతి తీసుకుంటా అని కేసీఆర్‌ అంటున్నారు. ఇది మంచిదే. కేసీఆర్‌ రెస్టు తీసుకుంటే ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు. రూ.300 కోట్ల భవంతిలో ఆయన రెస్ట్‌ తీసుకుంటే 22 లక్షల మందికి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మిస్తాం. స్థలమున్న ప్రతి పేదోడి ఇంటి కోసం రూ.5 లక్షల సాయం అందిస్తాం. 

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్, రంగారెడ్డి, భూపాలపల్లి :  నీళ్లు, నిధులు, నియామకాలు.. అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన కె. చంద్రశేఖర్‌రావు ప్రాజెక్టుల రీడిజైన్‌ పేరుతో ప్రాణహిత అంచనాలను పెంచి రూ.40 వేల కోట్లు లూటీ చేశారని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. కేసీఆర్‌ అంటే.. ఖావో కమీషన్‌ రావ్‌ అని, ఆయన ప్రతిదాంట్లో కమీషన్‌ ముట్టనిదే పనులు చేయరని ఆరోపించారు. ప్రాజె క్టుల రీ డిజైన్‌తో కేసీఆర్‌ కుటుంబమే లబ్ధి పొందిందన్నారు. తెలంగాణ ఆవిర్భవించిన కొత్తలో రూ.17 వే ల కోట్ల మిగులు వార్షిక బడ్జెట్‌ ఉన్న రాష్ట్రం ఈ నాలుగున్నరేళ్ల కేసీఆర్‌ పాలనలో రూ.2.50 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిందని రాహుల్‌ విమ ర్శించారు. గురువారం నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్, భూపాలపల్లి, రంగారెడ్డి జిల్లా పరిగిలో కాంగ్రెస్‌ నిర్వహించిన బహిరంగ సభల్లో రాహుల్‌ ప్రసంగించారు. కేసీఆర్‌ లక్ష్యంగా ఘాటైన విమర్శలు చేశారు. 

కేసీఆర్‌.. విశ్రాంతి తీసుకో.. 
‘‘ఇటీవల కేసీఆర్‌ ఒక నిజమైన మాట చెప్పారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఇంటికెళ్లి విశ్రాంతి తీసుకుంటానన్నారు. మీరు విశ్రాంతి తీసుకుంటున్నది రూ.300 కోట్లతో నిర్మించుకున్న భవనంలో.. కానీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన డబుల్‌బెడ్రూం ఇళ్ల నిర్మాణం హామీని నెరవేర్చలేదు. రాష్ట్రంలో 22 లక్షల మందికి డబుల్‌బెడ్రూం ఇళ్లు ఇవ్వాల్సి ఉండగా, ఐదు వేల మందికి కూడా అందలేదు. దళితులు, ఆదివాసీలకు 3 ఎకరాల భూమి ఇస్తానన్న హామీని నెరవేర్చలేదు. నిజాం షుగర్స్‌ను తెరిపించేందుకు రూ.వంద కోట్లు ఇవ్వలేదు. నీవు విశ్రాంతి తీసుకుంటే అధికారంలోకి వచ్చే కాంగ్రెస్‌ పార్టీ నిరుపేదల సంక్షేమం కోసం పనిచేస్తుంది. ప్రజలు కలలుగన్న తెలంగాణ నిర్మిస్తానని, బంగారు భవిష్యత్‌ ఉంటుందని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ ప్రజలను వంచించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధులు నిలిపివేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక లక్ష ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తుంది. నిరుద్యోగులకు రూ.3 వేల భృతి చెల్లిస్తుంది. ప్రతి మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రి కట్టిస్తాం’’అని రాహుల్‌ అన్నారు.
 
తెలంగాణ ఆర్‌ఎస్‌ఎస్‌ పార్టీ.. 
‘లోక్‌ సభలో, రాజ్యసభ సహా రాష్ట్రపతి ఎన్నికల్లో, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ కేసీఆర్‌ ప్రధాని మోదీకి మద్దతిచ్చారు. దేశ ప్రజలను ఎన్నో కష్టాల పాల్జేసిన నోట్ల రద్దుకూ మద్దతు పలికారు. బీడీ కార్మికుల, యాజమాన్యాలకు నష్టం కలిగించిన జీఎస్టీని కేసీఆర్‌ కొనియాడారు. కేసీఆర్‌కు ఒకే లక్ష్యం ఉంది. తెలంగాణలో తన కుటుంబం, కేంద్రంలో మోదీ పరిపాలించాలని.. టీఆర్‌ఎస్‌ పేరుకు మరో ఎస్‌ జోడించాలి. టీఆర్‌ఎస్‌ఎస్‌ పార్టీ.. తెలంగాణ ఆర్‌ఎస్‌ఎస్‌ అని తేలింది. దేశం కోసం, తెలంగాణ కోసం మోదీ, కేసీఆర్‌ మధ్య ఉన్న స్నేహబంధం విడిపోవాలి’అని కాంగ్రెస్‌ అధినేత పేర్కొన్నారు.
 
భూసేకరణ చట్టాన్ని నీరుగార్చారు..
‘కేసీఆర్‌ కనీసం రైతులనూ పట్టించుకోలేదు. భూసేకరణ చట్టాన్ని నీరుగార్చిన కేసీఆర్‌ రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారు. రైతుల అను మతి లేకుండా భూసేకరణ చేస్తే ఆ రైతుకు 4 రెట్ల పరిహారం చెల్లించాలనే చట్టంలోని నిబంధనలను తుంగలో తొక్కారు. రాష్ట్రంలో 4,500 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.  మద్దతు ధర ఇవ్వాలని అడిగిన రైతులపై కేసులు నమోదు చేశారు. కేంద్రం లో అధికారంలోకి వచ్చాక పసుపు బోర్డును ఏర్పాటు చేస్తాం. క్వింటాల్‌కు రూ.10 వేల చొప్పున పసుపును కొనుగోలు చేస్తాం. ఉపాధి కోసం వలస వెళ్లే వారి కోసం రూ.500 కోట్లతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేస్తాం. జీఎస్టీని సమీక్షిస్తాం. జీఎస్టీతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బీడీ కార్మికులు, బీడీ కంపెనీల యాజమాన్యాల సమస్యలను పరిష్కరిస్తాం. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీ దోకేబాజీ మాటలు చెప్పారు. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం నిరుపేద ప్రజల మాటలు వింటుంది. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో బీజేపీని, కేంద్రంలోనూ మోదీ సర్కారును గద్దె దించాలి’అని పిలుపునిచ్చారు. 

భూపాలపల్లిలో.. 
ఐదేళ్ల క్రితం ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ ఏర్పడిందో అవి నేరవేరలేదని, ఎన్నికల తర్వాత తెలంగాణ ప్రజల కలలను సాకారం చేస్తామని రాహుల్‌ అన్నారు. ‘రాష్ట్రంలో కేసీఆర్, కేంద్రంలో మోదీ అభివృద్ధి నిరోధకులుగా మారారు. మోదీ హిందుస్తాన్‌ ఏరోనాటికల్‌ను కాదని అనిల్‌ అంబానీతో కలసి రూ.30 వేల కోట్ల కుంభకోణానికి కారణమయ్యాడు. ఎన్నికల తర్వాత కేసీఆర్‌ ఫాంహౌస్‌లో పడుకోవడం తప్పితే ఏంచేయలేరు. అధికారంలోకి వచ్చిన తర్వాత 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తాం. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన సింగరేణి కార్మికులను కేసీఆర్‌ సర్కార్‌ మోసం చేసింది. వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తామని, కాంట్రాక్ట్‌ కార్మికులను పర్మినెంట్‌ చేస్తామని చెప్పి ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. మహాకూటమి అ«ధికారంలోకి వచ్చిన తర్వాత డిస్మిస్‌ కార్మికులు, కార్మికుల సమస్యలు పరిష్కరించడంతోపాటు వారి పిల్లలకు విద్య, ఆరోగ్యం తదితర అవసరాలను తీరుస్తాం. గిరిజన వర్సిటీ ఏర్పాటు చేస్తాం’అని రాహుల్‌ హామీ ఇచ్చారు.

గురువారం భూపాలపల్లిలో జరిగిన సభకు హాజరైన ప్రజలు, కార్యకర్తలు

వచ్చేది మా ప్రభుత్వమే: ఉత్తమ్, టీపీసీసీ అధ్యక్షుడు 
డిసెంబర్‌ 11 తర్వాత తెలంగాణలో ప్రజాకూటమి ప్రభుత్వం ఏర్పడటం ఖాయం. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు ఇవ్వలేదు. కార్మికుల పేర్ల సవరణ ఒక్క జీవోతో అయ్యే పనిని కూడా చేయలేదు.
 
చెక్కులు లేవు.. బుక్కులు లేవు: కోదండరాం, టీజేఎస్‌ అధ్యక్షుడు 
కేసీఆర్‌ చేపట్టిన భూరికార్డుల పక్షాళనతో లేని సమస్యలు పట్టాదారులకు వచ్చాయి. అర్హులైన వేలాది మంది రై తులకు చెక్కులు, పాస్‌బుక్కులు రాలే దు. నాలుగేళ్ల కాలంలో ఆదివాసీలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. అటవీశాఖ అధికారులు పోడు భూములను లాక్కున్నారు. తెలంగాణ సర్కారు చర్య తో రైతులకు ఉన్న హక్కులు పోయాయి.  
 
పరిగిలో
కేసీఆర్‌జీ.. మీరు విశ్రాంతి తీసుకోండి.. అభివృద్ధి పనులు ఎలా చేయాలో మేం చేసి చూపిస్తామని రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. ‘వేలాది మంది ఆత్మబలిదానాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణను కేసీఆర్‌ అడుగడుగునా వంచిచారు. చేవెళ్ల–ప్రాణహిత ప్రాజెక్టు డిజైన్‌ మార్పుతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రైతాంగం గొంతు నొక్కారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే చేవెళ్ల–ప్రాణహితను యథావి«ధిగా కొనసాగించి, సాగునీటిని అందిస్తాం. కేసీఆర్‌ అంటే.. ఖావో కమీషన్‌ రావుగా మారారు. ప్రతిదాంట్లో కమీషన్‌ ముట్టనిదే పనులు చేయరు.

గురువారం పరిగిలో జరిగిన రాహుల్‌ గాంధీ బహిరంగ సభకు హాజరైన జనం

అధికారంలోకి వచ్చాక గిరిజనులకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తాం. టీఆర్‌ఎస్‌ నేతలు భూ మాఫియాగా తయారయ్యారు. మేము అధికారంలోకి వస్తే జల్, జంగల్, జమీన్‌ పేరిట గిరిజనులకు అటవీ భూములపై హక్కులు కల్పిస్తాం. ప్రధాని మోదీ దేశాన్ని తాకట్టు పెట్టాడు. కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా విభజిస్తూ పాలిస్తున్నాడు. కేసీఆర్‌ మోదీకి చెంచా, ఏజెంట్‌. టీఆర్‌ఎస్, ఎంఐఎంలు బీజేపీకి బీ, సీ టీంలు. అస్సాం, మహారాష్ట్రలో ఉనికి లేని మజ్లిస్‌ కాంగ్రెస్‌ ఓటు బ్యాంకును చీల్చేలా పోటీచేసి బీజేపీకి పరోక్షంగా సాయం చేస్తోంది.

ఈ చీకటి ఒప్పందాన్ని ప్రజలు గమనిస్తున్నారు. మేం అబద్ధపు వాగ్దానాలు చేయం. అలాంటి మాటలు వినాలంటే మోదీ, కేసీఆర్‌ల సభలకు వెళ్లవచ్చు. రాష్ట్రంలో ప్రజాకూటమి గెలవబోతుంది. ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చి చూపిస్తాం. ఈ సభలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, టీజేఎస్‌ అధినేత కోదండరాం, చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, రాములు నాయక్, జిల్లాలో కూటమి నుంచి పోటీ చేస్తున్న టి.రామ్మోహన్‌రెడ్డి, జి. ప్రసాద్‌కుమార్, కె.ఎస్‌.రత్నం, పైలట్‌ రోహిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement