సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌పై 50 నుంచి 60 వేల మెజారిటీతో గెలబోతున్నానని ప్రజాకూటమి అభ్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. 24 గంటలు గడుస్తున్నా పోలింగ్ ఎంత శాతం అయిందో ఎన్నికల కమిషన్ ప్రకటించలేదని విమర్శించారు. గజ్వెల్ ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయనే అనుమానాల నేపథ్యంలో సీఈఓను కలిశామని తెలిపారు. ‘వీవీ ప్యాట్‌లో వచ్చిన స్లిప్పులను లెక్కించాలని ఎన్నికల కమిషన్‌ను కోరాం. అవసరమైతే ఈ విషయంపై హైకోర్టులో కేసు వేసే ఆలోచనలో కూడా ఉన్నాం’ అని వ్యాఖ్యానించారు. శనివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు.
వీవీ ప్యాట్‌లో వచ్చిన స్లిప్పులను లెక్కించకపోతే ఆమరణ దీక్ష చేస్తాననీ, చచ్చినా వదిలేది లేదని హెచ్చరించారు. కేసీఆర్ తన ఫోన్లన్నీ ట్యాప్ చేయిస్తున్నారనీ, ఫోన్లో మాట్లాడాలంటే కూడా భయంగా ఉందని వాపోయారు. ‘మా గురించి చెప్పే దమ్మున్న ఛానల్, దమ్మున్న పత్రిక ఏదీ లేదు. గజ్వెల్‌లో లిక్కర్, డబ్బు విచ్చలవిడిగా పంచారు. పోలీసులు కూడా అధికార పార్టీ తో కుమ్మక్కయ్యారు. వారందరినీ సస్సెండ్ చేయాలి’ అని వంటేరు అన్నారు. నాలుగేళ్ల పాలనా కాలంలో సచివాలయానికి రాని ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని వంటేరు నిప్పులు చెరిగారు. సీఎంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కారణంగానే ఈసారి పోలింగ్ శాతం పెరిగిందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment