రూ.12 లక్షలు కొట్టేసి... 24 గంటల్లో చిక్కారు.. | Sultanbajar lead to the exploitation | Sakshi
Sakshi News home page

రూ.12 లక్షలు కొట్టేసి... 24 గంటల్లో చిక్కారు..

Published Sun, Jun 19 2016 11:39 PM | Last Updated on Mon, Sep 4 2017 2:53 AM

రూ.12 లక్షలు కొట్టేసి...   24 గంటల్లో చిక్కారు..

రూ.12 లక్షలు కొట్టేసి... 24 గంటల్లో చిక్కారు..

కొలిక్కి వచ్చిన సుల్తాన్‌బజార్   దారి దోపిడీ
దుకాణ యజమాని ‘పనివాడే’ సూత్రధారి
ఐదుగురు నిందితుల అరెస్టు, పరారీలో ఇద్దరు

 

సుల్తాన్‌బజార్:  సుల్తాన్‌బజార్ ఠాణా పరిధిలోని బొగ్గులకుంటలో శనివారం రాత్రి చోటు చేసుకున్న భారీ దారి దోపిడీ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ టీమ్‌తో పాటు ఈస్ట్‌జోన్ అధికారులూ ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దింపి సూత్రధారి సహా ఐదుగురు నింది తుల్ని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న  మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. ఆదివారం సుల్తాన్‌బజార్ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్‌జోన్, టాస్క్‌ఫోర్స్ డీసీపీలు డాక్టర్ వి.రవీందర్, బి.లింబారెడ్డి కేసు పూర్వాపరాలు వివరించారు.

 
అసలేం జరిగిదంటే...

రాంకోఠి ప్రాంతానికి చెందిన దివేశ్ హాడియా సిద్దంబర్ బజార్‌లో రాజాని టైర్స్ పేరిట దుకాణం నిర్వహిస్తున్నారు. దివేష్ శనివారం రాత్రి వ్యాపారం ముగిసిన తర్వాత తన దుకాణం మూసేసి, లావాదేవీలకు సంబంధించిన రూ.12 లక్షల్ని ఓ బ్యాగ్‌లో పెట్టుకుని తన యాక్టివా వాహనంపై ఇంటికి బయలుదేరారు. 8.30 గంటల ప్రాంతంలో తిలక్‌రోడ్డు బొగ్గులకుంటలోని ఆదిత్య ఆసుపత్రి దాటగానే  గుర్తుతెలియని వ్యక్తులు దివేష్ వాహనాన్ని మరో వాహనంతో ఢీ కొట్టాడు. దీంతో రెండు వాహనాలపై ఉన్న వారితో పాటు వాహనాలూ కిందపడిపోయాయి. మరో బైక్‌పై వస్తున్న కొందరు వ్యక్తులు వ్యాపారిని లేపి సపర్యలు చేస్తున్నట్లు నటిస్తూ నగదు బ్యాగ్ ఉన్న యాక్టివా వాహనాన్ని ఎత్తుకుపోయారు.

 
ఎవరు, ఎలా ప్లాన్ చేశాడంటే...

జియాగూడకు చెందిన జగదీష్ అనే వ్యక్తి దివేష్ ఎదురుగా ఉన్న జైన్ టైర్స్‌షాపులో పనిచేస్తున్నాడు. దివేష్ దగ్గర పని చేసే వాళ్లు రానప్పుడు జగదీష్ సహాయంగా ఉండేవాడు. దివేష్ దుకాణంలో సహాయకారిగా వచ్చినప్పుడల్లా జగదీష్ అతడి వ్యాపార లావాదేవీలు పరిశీలించేవాడు.  ఎప్పుడు దుకాణం మూస్తాడు? ఏ సయమంలో, ఏ మార్గంలో ఎలా ఇంటికి వెళ్తాడు? నగదు ఏ విధంగా తరలిస్తుంటాడు? తదితర అంశాలు క్షుణ్ణంగా గమనించాడు. ఇవన్నీ సంగ్రహించిన తర్వాత దోపిడీకి స్కెచ్ వేశాడు. తాను నేరుగా దోపిడీ చేస్తే చిక్కుతాననే ఉద్దేశంతో తన స్నేహితుడైన మంగళ్‌హాట్ జాలీహనుమాన్ ప్రాంతానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి అశీష్ (20) ద్వారా స్కెచ్ అమలు చేయాలనుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అశీష్ బాలాపూర్ ఇంద్రనగర్‌కు చెందిన మల్లిఖార్జున్ అలియాస్ మాలిక్ (22) అలిబండకు చెందిన బైక్ మెకానిక్ మహ్మద్ అమీర్ (22) మంగళ్‌హట్ జాలీహనుమాన్‌కు చెందిన రాజమిశ్రా(17), బాలాపూర్‌కు చెందిన మహ్మద్ హబీబ్ (20), జల్‌పల్లికి చెందిన ఆసిఫ్‌లతో ముఠా ఏర్పాటు చేశారు.


స్కెచ్ ఎలా అమలైందంటే...
దివేష్ వ్యాపారం శనివారం ఎక్కువగా జరుగుతుందనే ఉద్దేశంతో ఆ రోజే దోపిడీ చేయాలనుకున్నారు. గత శనివారం (11వ తేదీ) అబిడ్స్‌లోని గ్రాండ్ హోటల్‌లో సమావేశమైన ఈ ముఠా తమ ప్లాన్‌ను అమలు చేయాలనుకుంది. అయితే ఆ రోజు దివేష్ నిత్యం వెళ్లే సమయం కంటే ముందుగా ఇంటికి వెళ్లిపోవడంతో సాధ్యం కాలేదు. దీంతో ఈ శనివారం (18వ తేదీ) ముహూర్తం ఖరారు చేసుకున్నారు. జగదీష్ మినహా మిగిలిన వారంతా దివేష్‌ను అబిడ్స్ నుంచి ద్విచక్ర వాహనాలపై అనుసరించారు. బొగ్గులకుంట వద్ద మల్లిఖార్జున్ తన వాహనంతో దివేశ్ వాహనాన్ని ఢీ కొట్టాడు. మరో బైక్‌పై వస్తున్న ఆశీష్ ఇతర సభ్యులు సపర్యలు చేస్తున్నట్లు నటించి డిక్కీలో ఉన్న రూ.12 లక్షల బ్యాగ్‌తో పాటు వ్యాపారి వాహనాన్నీ తస్కరించారు.

 
ఎలా దర్యాప్తు చేశారంటే...

ఉదంతం జరిగిన గంట తర్వాత బాధితుడు స్థానికుల సాయంతో సుల్తాన్‌బజార్ పోలీసుస్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం ఇచ్చారు. సుల్తాన్‌బజార్ ఏసీపీ రావుల గిరిధర్  నేతృత్వంలో వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎల్.రాజావెంకట రెడ్డి, సుల్తాన్‌బజార్ ఇన్‌స్పెక్టర్ పి.శివశంకర్ రాావు, అఫ్జల్‌గంజ్ ఇన్‌స్పెక్టర్ సి.అంజయ్య, సుల్తాన్‌బజార్ డీఐ వంశీకష్ణ తమ బృందాలతో రంగంలోకి దిగారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన నేపథ్యంలో పక్కా పథకం ప్రకారం తెలిసిన వ్యక్తులే చేసినట్లు అనుమానించారు. దివేష్ వద్ద పని చేస్తున్న, పని చేసి మానేసిన, అప్పుడప్పుడు వచ్చి పని చేసే వారి వివరాలు సేకరించారు. దీంతో జగదీష్‌సింగ్‌పై అధికారులకు అనుమానం వచ్చింది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా విషయం బయటపడింది. నిందితులు బొగ్గులకుంట మీదుగా చాదర్‌ఘట్ వెళ్లి అక్కడ నుంచి బాలాపూర్‌కు చెరుకున్నారని తేలింది. హబీబ్ ఇంట్లో నగదు పంచుకున్నారని వెల్లడైంది. ఐదుగురు నిందితులను బాలాపూర్‌లోనే అరెస్ట్ చేసిన పోలీసులు 3 బైకులు, రూ. 10.7 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన మొత్తం పరారీలో ఉన్న మల్లిఖార్జున్, ఆసిఫ్ వద్ద ఉండటంతో వారి కోసం గాలిస్తున్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement