ముప్పు ముంగిట వన్యప్రాణులు | Wild Animals Threats And Exploitation Special Story | Sakshi
Sakshi News home page

ముప్పు ముంగిట వన్యప్రాణులు

Published Sun, Oct 4 2020 7:10 AM | Last Updated on Sun, Oct 4 2020 1:24 PM

Wild Animals Threats And Exploitation Special Story - Sakshi

వన్యప్రాణులు ముప్పు ముంగిట మనుగడ సాగిస్తున్నాయి. వాటికి సహజ ఆవాసాలైన అడవులను స్వార్థపరులైన మనుషులు ఆక్రమించుకుంటూ ఉండటంతో అవి ఆవాసాన్నే కాదు, అర్ధంతరంగా ఆయువునూ కోల్పోతున్నాయి. గడచిన యాభయ్యేళ్ల కాలంలో భూమ్మీద మనుషుల జనాభా రెట్టింపును మించి పెరిగింది. ఇదే కాలంలో వన్యప్రాణుల జనాభా మూడింట రెండు వంతులకు పైగా తగ్గిపోయింది. కొన్ని జాతుల వన్యప్రాణులు పూర్తిగా కనుమరుగైపోయాయి. ఇంకొన్ని అంతరించిపోయే దశలోకి చేరుకున్నాయి. ఇదే రీతిలో వన్యప్రాణులు మరింతగా కనుమరుగైతే, పర్యావరణ సమతుల్యత దారుణంగా దెబ్బతిని, ఆ పరిస్థితి మనుషుల మనుగడకే ముప్పుగా మారే ప్రమాదం లేకపోలేదు.

వన్యప్రాణుల మనుగడకు సంబంధించి ఇటీవల విడుదలైన ‘లివింగ్‌ ప్లానెట్‌ ఇండెక్స్‌’ నివేదిక ఆందోళన కలిగించేదిగా ఉంది. వరల్డ్‌ వైల్డ్‌ లైఫ్‌ ఫండ్‌ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌) ఇంటర్నేషనల్, జువాలాజికల్‌ సొసైటీ ఆఫ్‌ లండన్‌ సహకారంతో ‘లివింగ్‌ ప్లానెట్‌ ఇండెక్స్‌’–2020 తన నివేదికను రూపొందించింది. భూగోళంపై నివసించే సమస్త వన్యప్రాణులనూ ఇందులో లెక్కలోకి తీసుకోకపోయినా, వెన్నెముక గల 4000 వేల వన్యజంతువుల జాతులను పరిగణనలోకి తీసుకుంది. వీటి సంఖ్య 1970 నాటితో పోల్చితే 2016 నాటికి సగటున 68 శాతం మేరకు తగ్గిపోయింది. వ్యవసాయ విస్తరణ, అడవుల నరికివేత పెరగడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తినట్లు ‘లివింగ్‌ ప్లానెట్‌ ఇండెక్స్‌’ వెల్లడించింది. కోట్లాది సంవత్సరాలుగా భూమిపై మనుగడ సాగిస్తున్న వన్యజీవులు కేవలం అర్ధశతాబ్ది వ్యవధిలోనే ఈ స్థాయిలో తగ్గిపోవడమంటే, ఈ పరిణామాన్ని రెప్పపాటు కాలంలో సంభవించిన మార్పుగా పరిగణించాలని డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ ఇంటర్నేషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ మార్కో లాంబెర్టిని అభిప్రాయపడ్డారు.

బార్బరీ లయన్‌, బాక్ట్రియన్‌ ఒంటె
ఎందుకు ఈ పరిస్థితి..?
గడచిన అర్ధశతాబ్ది కాలంలోనే వన్యప్రాణుల సంఖ్య ఇంత దారుణంగా తగ్గిపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఇదే కాలంలో మనుషుల జనాభా రెట్టింపును మించి పెరిగింది. మనుషుల వినిమయం అంతకు మించి పెరిగింది. డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ ఇంటర్నేషనల్‌ చెబుతున్న ప్రకారం– భూమికి గల తన సహజ వనరుల పునరుత్పాదక శక్తితో పోలిస్తే, 1970 సంవత్సరానికి ముందు వరకు మానవుల పర్యావరణ అడుగుజాడలు తక్కువగానే ఉండేవి. అందువల్ల మనుషులు అటవీ సంపదను వాడుకుంటూ వచ్చినా, అప్పట్లో అంతగా ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడైతే మనుషులు భూమికి గల సహజ వనరుల పునరుత్పాదన సామర్థ్యానికి మించి ఒకటిన్నర రెట్లు ఎక్కువగా సహజ వనరులను ఇష్టానుసారం వాడేసుకుంటున్నారు.

గడచిన యాభై ఏళ్లలో భారీగా పెరిగిన పరిశ్రమలు అడవులను, గడ్డిభూములను వ్యవసాయ క్షేత్రాలుగా మార్చేయడం గణనీయంగా పెరిగింది. దీనికి తోడు పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం, తరచుగా అడవుల్లో చెలరేగుతున్న కార్చిచ్చులు వన్యప్రాణులను వేగంగా హరించేస్తున్నాయి. ప్రస్తుతం భూమిపైనున్న స్థలభాగంలో మూడోవంతు, మంచినీటి వనరుల్లో నాలుగింట మూడువంతులు కేవలం ఆహార ఉత్పాదన కోసమే వినియోగమవుతున్నాయి. మనుషులు మనుగడ సాగిస్తున్న భూమిపై ఈ పరిస్థితి ఉంటే, సముద్రాల పరిస్థితి మరీ దారుణంగా మారింది. సముద్రాల్లోని మత్స్యవనరులను మనుషులు వినియోగించుకోవాల్సిన దాని కంటే 75 శాతం అదనంగా వినియోగించుకుంటున్నారు.

కరీబియన్‌ మాంక్‌ సీల్‌, టాస్మానియన్‌ టైగర్‌
కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణం
భూమిపైనున్న వన్యప్రాణులు కొన్ని ప్రాంతాల్లో మరింత వేగంగా కనుమరుగైపోతున్నాయి. ముఖ్యంగా మధ్య అమెరికా, దక్షిణ అమెరికా ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. ఈ ప్రాంతాల్లో గడచిన యాభై ఏళ్లలో వన్యప్రాణుల సంఖ్య ఏకంగా 94 శాతం మేరకు తగ్గిపోయింది. ఇలాంటి పరిణామం కచ్చితంగా మన ప్రపంచంపై ప్రభావం చూపుతుందని లాంబెర్టిని హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న నలభై స్వచ్ఛంద సంస్థలు, విద్యా పరిశోధన సంస్థలు వేర్వేరుగా జరిపిన అధ్యయనాల్లోని సమాచారాన్ని క్రోడీకరించుకుని, ‘లివింగ్‌ ప్లానెట్‌’ తన నివేదికలోని సమాచారాన్ని సవరించుకుని, ఇటీవలే దానిని విడుదల చేసింది.

ఈ నివేదికను ‘ద నేచర్‌’ జర్నల్‌ ప్రచురించింది. ఇందులో వన్యప్రాణుల పరిరక్షణ కోసం ప్రపంచ దేశాలన్నీ తక్షణమే చేపట్టవలసిన చర్యలను కూడా సూచించింది. ‘‘ఈ పరిస్థితిపై మనం తక్షణమే స్పందించాలి. జీవ వైవిధ్యం నాశనమవుతున్న వేగంతో పోల్చుకుంటే, ప్రభుత్వాలు చేపడుతున్న చర్యల వల్ల మొదలైన జీవ వైవిధ్య పునరుద్ధరణ వేగం చాలా తక్కువగా ఉంటోంది. ఇక ఏమాత్రం జాప్యం చేసినా మానవాళి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. జీవ వైవిధ్యాన్ని తిరిగి యథాస్థితికి తీసుకురావాలంటే కొన్ని దశాబ్దాల కాలం పట్టవచ్చు’’ అని ‘లివింగ్‌ ప్లానెట్‌’ అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకుడు డేవిడ్‌ లీక్లీర్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

వేటాడి చంపేస్తున్నారు
అరుదైన వన్యప్రాణులను సైతం వేటగాళ్లు వేటాడి చంపేస్తున్నారు. ఇదివరకటితో పోలిస్తే, మాంసం కోసం వన్యప్రాణుల వేట గత యాభయ్యేళ్లలో గణనీయంగా పెరిగింది. సెంటర్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ ఫారెస్ట్రీ రీసెర్చ్‌ అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా 60 లక్షల టన్నుల వన్యప్రాణుల మాంసం అక్రమ మార్కెట్లకు తరలుతోంది. కేవలం బ్రెజిల్‌లోని అమెజాన్‌ అడవుల నుంచి 2 వేల కోట్ల డాలర్ల (రూ.1.47 లక్షల కోట్లు) విలువ చేసే వన్యప్రాణుల మాంసం ఇతర దేశాలకు అక్రమంగా ఎగుమతి అవుతోంది. వ్యక్తిగత లగేజీల్లో దాచి ఇలా తరలిస్తుండగా పారిస్‌ ఎయిర్‌పోర్టులో ఏటా పట్టుబడే వన్యప్రాణుల మాంసం 260 టన్నుల వరకు ఉంటోంది. ఇక మిగిలిన అంతర్జాతీయ విమానాశ్రయాలకు, నౌకాశ్రయాలకు చేరుతున్న మాంసం ఏ పరిమాణంలో ఉంటుందో ఊహించుకోవాల్సిందే!

ఇవి ఇప్పటికే అంతరించాయి
అడవుల నరికివేత, కార్చిచ్చులు, కాలుష్యం, వేట తదితర కారణాల వల్ల ఇప్పటికే చాలా వన్యప్రాణులు పూర్తిగా కనుమరుగై పోయాయి. గడచిన వందేళ్లలో దాదాపు 500 జాతులకు చెందిన జంతువులు, పక్షులు అంతరించిపోయాయి. గోల్డెన్‌ టోడ్‌ (బంగారు వన్నె కప్ప), రామచిలుకల జాతికి చెందిన కరోలినా పారాకీట్, కోడి జాతికి చెందిన హీత్‌ హెన్, కంగారు తరహా జాతికి చెందిన టాస్మానియన్‌ టైగర్, పెద్దపులుల్లో ఒక జాతి అయిన కాస్పియన్‌ టైగర్, కరీబియన్‌ మాంక్‌ సీల్, ఖడ్గమృగం జాతికి చెందిన వెస్టర్న్‌ బ్లాక్‌ రినో, పింటా ఐలాండ్‌ తాబేలు, సింహాల జాతిలో అరుదైన బార్బరీ లయన్, షోంబర్క్‌ జింకలు వంటివి గత వందేళ్లలోనే ఉనికిలో లేకుండా పోయాయి. 

క్లౌడెడ్‌ చిరుతపులి, పంగోలిన్‌ 
భారత్‌లో వన్యప్రాణుల పరిస్థితి
గడచిన శతాబ్ద కాలంలో మన భారత్‌లో కూడా కొన్ని జంతువులు పూర్తిగా కనుమరుగైపోయాయి. వాటిలో చిరుత జాతికి చెందిన ఇండియన్‌ చీతా, అడవి దున్నల జాతికి చెందిన ఇండియన్‌ అరోక్, సుమత్రా ఖడ్గమృగాలు, శివాతెరియం (దీనిని శివుడి వాహనంగా భావించేవారు) వంటి భారీ జంతువులు సైతం అంతరించిపోయాయి. భారత్‌లో నెలకొన్న పరిస్థితులు వన్యప్రాణుల మనుగడకు నానాటికీ ప్రమాదకరంగా మారుతున్నాయి. వన్యప్రాణుల పరిరక్షణ కోసం ప్రభుత్వం 1972లో వన్యప్రాణుల పరిరక్షణ చట్టాన్ని అమలులోకి తెచ్చినా, మాంసం కోసం, జంతు శరీర భాగాల కోసం వన్యప్రాణుల వేట జరుగుతూనే ఉంది.

చట్ట ప్రకారం వన్యప్రాణుల వేట, తరలింపు వంటి చర్యలను శిక్షార్హమైన నేరాలుగా పరిగణిస్తున్నా, వేటగాళ్లు వీటిని బేఖాతరు చేస్తూ, యధేచ్ఛగా వన్యప్రాణులకు ముప్పు తెచ్చిపెడుతున్నారు. జీవవైవిధ్యం గల దేశాల్లో భారత్‌ ఒకటి. ప్రపంచంలోని 6.5 శాతం వన్యప్రాణులు భారత్‌లోనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా గల స్తన్యజీవుల్లో 7.6 శాతం, పక్షిజాతుల్లో 12.6 శాతం భారత్‌లో కనిపిస్తాయి. భారత్‌లో ఎక్కువగా వేటగాళ్ల బారిన పడుతున్న వాటిలో పెద్దపులులు, ఖడ్గమృగాలు, ఏనుగులు, నక్షత్ర తాబేళ్లు వంటివి ఉంటున్నాయి.

చర్మం కోసం, పంజా, గోర్లు, ఇతర శరీర భాగాల కోసం వేటగాళ్లు పెద్దపులులను వేటాడుతున్నారు. చైనీస్‌ సంప్రదాయ వైద్యంలో పెద్దపులి శరీర భాగాలకు విపరీతమైన గిరాకీ ఉంది. దంతాల కోసం ఏనుగులను, కొమ్ముల కోసం ఖడ్గమృగాలను పొట్టన పెట్టుకుంటున్నారు. వీటిని గృహాలంకరణలుగా వాడటంపై రకరకాల నమ్మకాలు ప్రచారం ఉండటంతో వీటికీ గిరాకీ ఎక్కువగానే ఉంటోంది. ఫెంగ్‌షుయి నమ్మకాల కారణంగా కొన్ని దేశాల్లో నక్షత్ర తాబేళ్లను పెంచుకుంటున్నారు. సాధారణంగా వీటిని సజీవంగానే విదేశాలకు తరలిస్తుంటారు చైనా, మలేసియా, ఇండోనేసియా వంటి దేశాల్లో పులులు, ఖడ్గమృగాల శరీర భాగాలకు విపరీతమైన గిరాకీ ఉండటంతో అక్రమ మార్గాల గుండా వీటిని తరలిస్తున్నారు. 

ఇదివరకటి కాలంలో అడవి జంతువుల వేట కోసం వేటగాళ్లు ఉచ్చులు, మామూలు తుపాకులు ఎక్కువగా వాడేవారు. ఇటీవలి కాలంలో భారీ జంతువులను వేటాడటానికి అధునాతనమైన తుపాకులతో పాటు కొందరు పశువైద్యులు జంతువులకు శస్త్రచికిత్సలు చేసేటప్పుడు వాడే మత్తుమందులు, విషం సైతం వినియోగించి, జంతువులను మట్టుబెడుతున్నారని ‘ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ ది కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ (ఐయూసీఎన్‌) వెల్లడించింది. భారతీయ ఖడ్గమృగాలు (ఇండియన్‌ రినో) ఒకప్పుడు పాకిస్తాన్, భారత్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్‌ భూభాగాల్లో విరివిగా కనిపించేవి. ప్రస్తుతం వాటి సంఖ్య 2,500 లోపే ఉండటంతో అతి అరుదుగా మాత్రమే కనిపిస్తున్నాయి.

దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని అడవుల్లో వేటగాళ్లు వేటాడిన జంతు శరీర భాగాల స్మగ్లింగ్‌ ఉత్తర భారత రాష్ట్రాలు కేంద్రంగా సాగుతోంది. ఈ రాష్ట్రాల్లోని కొనుగోలుదారులు వేటగాళ్ల నుంచి వీటిని కొనుగోలు చేసి, నేపాల్‌కు తరలించి, అక్కడి నుంచి వివిధ మార్గాల్లో చైనా, మలేసియా, ఇండోనేసియా తదితర దేశాలకు తరలిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. వన్యప్రాణుల వేటను, అక్రమ తరలింపును కట్టడి చేసేందుకు ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకుంటే, మరిన్ని వన్యప్రాణులు పూర్తిగా కనుమరుగైపోయే పరిస్థితులు ఉన్నాయని ఐయూసీఎన్‌ వంటి సంస్థలు హెచ్చరిస్తున్నాయి.

ప్రమాదం అంచున ఉన్న జంతుజాతులు
‘భూమిపై నివసించే స్తన్యజీవుల్లో 301 జాతులకు చెందిన జంతువులు ప్రమాదం అంచున ఉన్నాయి. వీటి పరిరక్షణ కోసం తక్షణ చర్యలు తీసుకోకుంటే త్వరలోనే ఇవి అంతరించిపోయే ప్రమాదం ఉంది. ప్రమాదం అంచుల్లో ఉన్న ఈ జంతుజాతుల్లో  లోలాండ్‌ గొరిల్లా, మాండ్రిల్‌ సహా 168 జాతులకు చెందిన వానరాలు, జడల బర్రె, బాక్ట్రియన్‌ ఒంటె సహా 73 జాతులకు చెందిన గిట్టలు గల జంతువులు, 27 జాతులకు చెందిన గబ్బిలాలు, క్లౌడెడ్‌ చిరుతపులి, కొన్నిరకాల ఎలుగుబంట్లు సహా 12 జాతులకు చెందిన మాంసాహార జంతువులు, ఎనిమిది జాతులకు చెందిన పంగోలిన్, కంగారూ జాతికి చెందిన 26 రకాల జంతువులు, ఆల్పైన్‌ వూలీ ర్యాట్‌ సహా ఎలుక జాతికి చెందిన 21 రకాల జంతువుల సంఖ్య గడచిన యాభై ఏళ్లలో గణనీయంగా క్షీణించింది.

ప్రస్తుతం ఇవి దాదాపు కనుమరుగయ్యే స్థితికి చేరుకున్నాయని ‘ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌’ వెల్లడించింది. ఈ జంతువులను తన ‘రెడ్‌లిస్ట్‌’లో చేర్చింది. గణనీయంగా వీటి తరుగుదలకు అడవులు తరిగిపోవడమే కాకుండా, ఇష్టానుసారం సాగిస్తున్న వేట కూడా కారణమవుతోందని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ డేవిడ్‌ మెక్‌డొనాల్డ్‌ చెబుతున్నారు. మాంసం కోసం, జంతువుల శరీర అవయవాల కోసం వీటిని వేటాడటం గత యాభై ఏళ్లలో బాగా ఎక్కువైందని, ఇదే పరిస్థితి కొనసాగితే ‘రెడ్‌లిస్ట్‌’లో ఉన్న వన్యప్రాణులు పూర్తిగా కనుమరుగవడానికి ఎంతోకాలం పట్టదని ఆయన హెచ్చరిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement