సాక్షి, హనుమకొండ/మంచిర్యాల: ఆర్థిక లావాదేవీల వ్యవహారంతో ఓ పోలీస్ కానిస్టేబుల్ తన అత్తను రివాల్వర్‌తో కాల్చి చంపిన ఘటన హనుమకొండలో కలకలం రేపింది. అయితే.. ఈ కేసు దర్యాప్తులో ఇప్పుడు కీలక విషయం వెలుగు చూసింది. సివిల్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న ప్రసాద్.. ఎస్సై రివాల్వర్‌ను కాజేసి మరీ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు.
హనుమకొండ జిల్లా గుండ్లసింగారం ఇందిరమ్మ కాలనీలో కమలమ్మ కుటుంబం నివాసం ఉంటోంది. ఆమె కూతురు రమాదేవిని ప్రసాద్‌కు ఇచ్చి వివాహం చేశారు. ప్రసాద్-రమాదేవికి ఇద్దరు కూతుళ్లు. రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో కానిస్టేబుల్‌గా ప్రసాద్ విధులు నిర్వహిస్తున్నాడు. అయితే.. గురువారం ఉదయం మంచిర్యాల నుంచి హనుమకొండలోని అత్తింటికి వచ్చిన ప్రసాద్.. కమలమ్మపై ఉన్నట్లుండి కాల్పులకు దిగాడు. ఒక రౌండ్ కాల్పులు జరగ్గా.. ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. ఆపై భార్యాకూతురిపైనా దాడికి యత్నించిన ప్రసాద్‌ను స్థానికులు అడ్డుకుని చితకబాదారు. గాయపడిన ప్రసాద్‌ను చికిత్స కోసం ఎంజీఎంకు తరలించారు. అతని పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.
డబ్బుల విషయంలో గొడవ పెద్దదై..
కుటుంబ కలహాలతో పాటు.. ఆర్థిక లావాదేవీలు ఈ నేరానికి కారణమని తెలుస్తోంది. ప్రసాద్ కమలమ్మకు రూ.4 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. ఆ డబ్బు విషయంలోనే ప్రధానంగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అప్పటికే తన వెంట తెచ్చుకున్న తుపాకీతో కమలమ్మపై ప్రసాద్ కాల్పులు జరిపాడని సెంట్రల్ జోన్ డీసీపీ ఎంఏ బారీ చెబుతున్నారు.
నా భర్తను చంపేయండి
భర్త ప్రసాద్ నిత్యం తాగొచ్చి గొడవ పడడంతో.. తాను పుట్టింటికి వచ్చేశానని రమాదేవి చెబుతోంది. వారం కిందట భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తోంది. ఉదయం పదిన్నర గంటలకు ఇంటికి వచ్చిన ప్రసాద్.. తన కళ్ల ముందే తల్లిని కాల్చి చంపినట్లు రమాదేవి చెప్పింది. అది చూసిన తనపై, తన కూతురిపైనా ప్రసాద్ దాడికి యత్నించాడని తెలిపిందామె. అయితే.. ప్రసాద్ బతకడానికి అర్హుడు కాడని.. అతన్ని చంపేయాలని రమాదేవి కన్నీటి పర్యంతం అయ్యింది.
‘‘నా భర్త పచ్చి తాగుబోతు. నిత్యం తాగొచ్చి వేధిస్తున్నాడనే పుట్టింటికి వచ్చేశా. ఇవాళ ఇంటికి వచ్చి నా తల్లిని పంచాడు. టవల్‌తో ఉరేసి చంపాలనుకున్నానని.. కానీ, స్థానికులు నన్ను అడ్డుకున్నారు. సివిల్ కానిస్టేబుల్ అయిన ప్రసాద్‌కు సర్వీస్ రివాల్వర్ ఎక్కడి నుంచి వచ్చింది?.. ఈ ఘటనలో అధికారుల నిర్లక్ష్యమూ ఉన్నట్లు స్పష్టమవుతోంది’’ అని ప్రసాద్ భార్య రమాదేవి అంటోంది.
ఉన్నతాధికారుల సీరియస్
కానిస్టేబుల్ ప్రసాద్ కాల్పుల ఘటనపై విచారణ జరుగుతోంది. సంఘటన స్థలాన్ని సెంట్రల్ జోన్ డీసీపీ ఎంఏ బారీ సందర్శించారు. అయితే పేలిన తూటా గొట్టం కోసం క్లూస్ టీం ఇంకా గాలింపు జరుపుతోంది. మరోవైపు సివిల్స్ కానిస్టేబుల్ ప్రసాద్కు సర్వీస్ రివాల్వర్ ఎలా వచ్చిందనే విషయంపై జరిపిన విచారణలో కీలక విషయం బయటపడింది.
కోటపల్లి స్టేషన్ లో ఎస్సై సురేష్ రివాల్వర్ కానిస్టేబుల్ ప్రసాద్ దొంగతనం చేసినట్లు తేలింది. గత రాత్రి తుపాకీని దొంగిలించి.. తన వెంట హనుమకొండకు తీసుకెళ్లాడు ప్రసాద్. ఆ రివాల్వర్‌తోనే కమలను కాల్చి చంపాడు. దీంతో రివాల్వర్ చోరీ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. పోలీస్ స్టేషన్‌లోనే ఈ చోరీ ఘటనపై విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment