విషాదంలో రామాగౌడ్ భార్య, కూతురు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల : అన్యాయంగా అట్రాసిటీ కేసులో ఇరుక్కొని బలవన్మరణం పొందిన నెన్నెలకు చెందిన రంగు రామాగౌడ్ కేసులో పోలీసుల పాత్ర చర్చనీయాంశమైంది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఎస్టీ కాని పల్ల మహేష్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై అట్రాసిటీ చట్టాన్ని ప్రయోగించడంతోనే రామాగౌడ్ మనస్తాపంతో బలవన్మరణం పొందినట్లు నిర్ధారణ అయింది. ఫిర్యాదుదారు పల్ల మహేష్‌కు తహసీల్ధార్ సత్యనారాయణ జారీ చేసిన ఎస్టీ ధ్రువీకరణ పత్రం సరైనదో.. కాదో తేల్చేందుకు రామాగౌడ్ మృతి తరువాత జిల్లా కలెక్టర్ ఆర్‌వీ.కర్ణన్ బెల్లంపల్లి సబ్ కలెక్టర్ రాహుల్‌రాజ్‌ను విచారణాధికారిగా నియమించగా, ఆయన నిజాన్ని నిగ్గు తేల్చారు. పల్ల మహేష్ బీసీ అని, తహసీల్దార్ ఎస్టీ ధ్రువీకరణ పత్రం జారీ చేశారని ఈనెల 26న కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారు. ఈ మేరకు తహసీల్దార్‌ను రాత్రికి రాత్రే సస్పెండ్ చేశారు. తహసీల్దార్ సస్పెన్షన్‌తో రామాగౌడ్ ఆత్మహత్యకు తప్పుడు ఎస్టీ ధ్రువీకరణపత్రంతో నమోదైన అట్రాసిటీ కేసే కారణమని స్పష్టమైంది.
అయినా... తప్పుడు సర్టిఫికేట్‌తో ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేసిన వ్యక్తి మీద ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు. ఫిర్యాదు అందిన 24 గంటల్లో కేసు నమోదు చేయాలనేది నిబంధన. కానీ గొడవ జరిగిన రోజే తనపై పల్ల మహేష్ దాడి చేశాడని రామాగౌడ్ ఇచ్చిన ఫిర్యాదుపై ఎస్‌ఐ కేసు నమోదు చేయలేదు. అదే సమయంలో మరుసటి రోజు పల్ల మహేష్ నుంచి ఫిర్యాదు అందిన అరగంటలోనే ఆగమేఘాల ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్ దాఖలైన తరువాత 13 రోజులకు విచారణకు వచ్చిన ఏసీపీ బాలుజాదవ్ ఎస్టీ అయిన పల్ల మహేష్ అనే వ్యక్తిని కులం పేరుతో దూషించినట్లు నిర్ధారించారు. ఇందుకు ఆయన తహసీల్దార్ ఇచ్చిన ఎస్టీ సర్టిఫికేట్‌నే పరిగణలోకి తీసుకున్నారే తప్ప, పల్ల మహేష్ తండ్రి బీసీ అని, మహేష్ చెల్లెలుకు బీసీ కులం సర్టిఫికేట్ జారీ అయిందనే విషయాన్ని పట్టించుకోలేదు. ఈ పరిస్థితుల్లో అనాథలైన రామాగౌడ్ భార్య సరస్వతి, కూతురు వసుధలకు తాత్కాలికంగా కొన్ని హామీలు ఇచ్చి కేసును నీరు గార్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
గొడవ జరిగిన నాడే ఫిర్యాదు చేసినా... నో యాక్షన్
నెన్నెల పెద్ద చెరువులో అక్రమంగా శనగపంట వేశాడని పల్ల మహేష్‌పై రామాగౌడ్ పత్రికలకు ఎక్కిన తరువాత డిసెంబర్ 12న గొడవ జరిగింది. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు వాటర్ ట్యాంక్ నుంచి నీళ్లు తెస్తున్న రామాగౌడ్, సర్పంచి ఇంటి నుంచి వస్తున్న పల్ల మహేష్‌కు గొడవ జరిగింది. వెంటనే తనను మహేష్ కొట్టినట్లు రామాగౌడ్ డిసెంబర్ 12న సాయంత్రం 6.30 గంటలకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలిసి మహేష్ మరుసటి రోజు డిసెంబర్ 13న మధ్యాహ్నం 2 గంటలకు రామాగౌడ్ మీద ఫిర్యాదు చేశాడు. ‘సర్పంచి ఇంటి నుంచి వస్తున్న తనను రామాగౌడ్ అడ్డగించి, కులం పేరుతో ధూషించాడని’ ఫిర్యాదు చేయగానే ‘ప్రివెంటివ్ ఆఫ్ అట్రాసిటీస్ సెక్షన్3’ కింద అరగంటలో అంటే మధ్యాహ్నం 2.30 గంటలకు ఎస్‌ఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దీన్ని బట్టి కేసు నమోదు, తదుపరి చర్యల వెనుక నెన్నెల సర్పంచి భర్త, మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు ఇబ్రహీం ఉన్నట్లు రామాగౌడ్ భార్య సరస్వతి, గీత కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. కేసు నమోదు కాగానే రామాగౌడ్ అజ్ఞాతంలోకి వెళ్లగా డిసెంబర్ 26న విచారణ కోసం నెన్నెల వచ్చిన ఏసీపీ బాలుజాదవ్‌కు స్థానికులు పల్ల మహేష్ ఎస్టీ కాదనే విషయాన్ని చెప్పినా వినలేదని వారు ఆరోపిస్తున్నారు. అప్పుడే కేసును అట్రాసిటీ చట్టం నుంచి తొలగించినట్లయితే రామాగౌడ్ బతికుండేవాడనేది వారి వాదన.
తహసీల్దార్‌పై కలెక్టర్ చర్యతో సరా..?
రామాగౌడ్ మృతి తరువాత ఈ కేసు తీవ్రతను గమనించిన కలెక్టర్ ఆర్‌వీ.కర్ణన్ ఫిర్యాదుదారు పల్ల మహేష్‌కు జారీచేసిన ఎస్టీ ధ్రువీకరణ æపత్రంపై విచారణ జరపాల్సిందిగా బెల్లంపల్లి సబ్ కలెక్టర్ రాహుల్‌రాజ్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఈనెల 26న నివేదిక ఇస్తూ... పల్ల మహేష్ ఎస్టీ కాదని తేల్చి చెప్పారు. ఆ వెంటనే కలెక్టర్ నెన్నెల తహసీల్దార్‌ను సస్పెండ్ చేశారు. కలెక్టర్ చర్యతో ఈ కేసు తప్పడుదని తేలిపోయింది. అయినా తదుపరి చర్యలకు పోలీస్ యంత్రాంగం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తుందో తెలియని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో రాజకీయ జోక్యంతో చేసిన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నాల్లో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. తహసీల్దార్ ఇచ్చిన సర్టిఫికేట్ ఆధారంగానే కేసు నమోదు చేసినట్లు పోలీసులు తప్పించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అదే సమయంలో రామాగౌడ్ ఫిర్యాదుపై కేసు ఎందుకు నమోదు చేయలేదనే దానికి సమాధానం లేదు.
ఎమ్మెల్యేను న్యాయం చేయమన్న సరస్వతి...
కాగా రామాగౌడ్ భార్య సరస్వతి మంగళవారం రూ.50వేల ఆర్థిక సాయం అందించేందుకు వచ్చిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వద్ద తన గోడు వెల్లబోసుకుంది. తన భర్త చావుకు కారణమైన పల్ల మహేష్, మండల కో ఆప్షన్ సభ్యుడిపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు ఆయన కూడా హామీ ఇచ్చారు. ఏం చేస్తారో వేచిచూడాలి.
Comments
Please login to add a commentAdd a comment