సాక్షి, హైదరాబాద్: తనపై లేనిపోని ఆరోపణలు చేసిన జనగామ కలెక్టర్ శ్రీదేవయానిపై సభాహక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అసెంబ్లీ స్పీకర్ ఎస్.మధుసూదనాచారికి ఫిర్యాదు చేశారు. కలెక్టర్ చేసిన ఆరోపణలపై వివరణ ఇస్తూ ఓ లేఖను అందజేశారు.
ఈ మేరకు అసెంబ్లీలో బుధవారం స్పీకర్‌తో సమావేశమై తన హక్కులకు భంగం కలిగించిన కలెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం, బాధ్యత తనపై ఉందని, 2,000 గజాల స్థలం తనపేరు మీద రిజిస్టర్ అయి ఉందన్న జనగామ కలెక్టర్ మాటలు అవాస్తవమని వివరించారు. తన పేరున గజం స్థలం రిజిస్టర్ అయి ఉంటే.. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా సిద్ధమేనని పేర్కొన్నారు. అది దేవాలయ ట్రస్ట్ భూమి అని, దానికి చైర్మన్‌గా ఎమ్మెల్యే ఉంటాడని చెప్పారు.