కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తున్న పెద్దమల్లారెడ్డి గ్రామ దళితులు
కామారెడ్డి: అధికార పార్టీ నాయకులు, వారి అనుచరులకే దళిత బంధు ఇస్తున్నారని భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన దళితులు ఆరోపించారు. గ్రామానికి చెందిన సుమారు 80 మంది దళితులు గురువారం కలెక్టరేట్‌కు తరలివచ్చారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్‌లోనికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో సర్పంచ్, ఎంపీటీసీలు దళితబంధు తీసుకోవడంతో పాటు వారి అనుచరులు, బంధువులకు ఇప్పించుకున్నారన్నారు. గ్రామంలో 500 దళిత కుటుంబాలు ఉన్నాయని 15 మందికే పథకం లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. లబ్ధిపొందినవారిలో ఒక్కరు కూడా అర్హులు లేరన్నారు.
ఇతర పార్టీల వారికి ఇవ్వబోమని బహిరంగంగానే చెబుతున్నారన్నారు. అధికారులు స్పందించి విచారణ జరిపించి, అర్హులకే దళితబంధు వచ్చేలా చూడాలని కోరారు. అనంతరం కార్యాలయంలో వినతిపత్రం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment