ప్రభుత్వంపై ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది
వంద రోజులు దాటాక రంగంలోకి దిగుదాం
పార్టీ శ్రేణులతో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సాక్షి, కామారెడ్డి: ‘‘మొన్నటి ఎన్నికల్లో ఓటమి చేదు అనుభవం. జరిగిందేదో జరిగిపోయింది. ఓటమితో కుంగిపోవద్దు. భవిష్యత్తు కోసం కలిసికట్టుగా కసితో పనిచేసి విజయాలు సొంతం చేసుకుందాం’’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొ న్నారు. ఆదివారం.. జిల్లా కేంద్రంలోని సత్య కన్వెన్షన్ లో పార్టీ కామారెడ్డి నియోజకవర్గ కార్యకర్తల విస్తృ త స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అలవికాని హామీలు, అబద్ధపు ప్రచారాలు, మాయ మాటలతో మోసపోయామని తక్కువ సమయంలోనే ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు. కేసీఆర్ గెలుపు కోసం అందరూ కష్టపడ్డారని, అయితే తప్పుడు ప్రచారాలతో నష్టం జరిగిందని పేర్కొన్నారు.
కేసీఆర్ భూములు గుంజుకుంటడంటూ చేసిన తప్పుడు ప్రచారాన్ని మనం సరిగా తిప్పికొట్టలేకపోయామన్నారు. కేసీఆర్ గెలిస్తే కామారెడ్డిని వదిలి గజ్వేల్‌కు పోతాడంటూ జరిగిన ప్రచారంతోనూ నష్టం జరిగిందన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బాన్సువాడ, బాల్కొండలలో గెలిచామని, జుక్కల్, కామారెడ్డి, బోధన్‌లలో స్వల్ప తేడాతో ఓడిపోయామని పేర్కొన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీచేసే అభ్యర్థికి భారీ మెజారిటీ ఇవ్వడానికి కార్యకర్తలంతా కలిసి పనిచేయాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గంప గోవర్ధన్ నాయకత్వంలో పనిచేసినట్టే, ఎంపీ ఎన్నికల్లోనూ ఆయన నాయకత్వంలో అందరూ కలిసి పనిచేయాలని కేటీఆర్ కోరారు.
ఈనెల 15 నాటికి వంద రోజులు..
ఎన్నికలలో గెలవడానికి కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చిందని, వాటిని అమలు చేయకుంటే ఊరుకునేది లేదని కేటీఆర్ పేర్కొన్నారు. రూ. 2 లక్షల రుణ మాఫీ చేస్తామని, రైతుబంధు, పింఛన్ పెంచుతామని, మహిళలకు రూ.2,500 ఇస్తామని హామీలు ఇచ్చారని, ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించారు. రేవంత్‌రెడ్డి పాలనకు మార్చి 15 నాటికి వంద రోజులు నిండుతాయని పేర్కొన్నారు. వంద రోజుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజలతో కలిసి పోరాటాలు చేద్దామన్నారు. సిరిసిల్లలో రాజీనామా చేసి మల్కాజ్‌గిరిలో పోటీ చేయడానికి తాను సిద్ధమని, రేవంత్‌రెడ్డి కొడంగల్‌లో రాజీనామా చేసి, సీఎం సీటును వదులుకుని రావాలని సవాల్ చేస్తే సమాధానం లేదని విమర్శించారు.
కేటీఆర్ ముందే బయటపడ్డ విభేదాలు..
కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. పార్టీ సీనియర్ నాయకుడు తిర్మల్‌రెడ్డి తన ప్రసంగంలో గంప గోవర్ధన్ పేరును ప్రస్తావించకపోవడంతో మొదలైన గలాట కొంతసేపు ఉద్రిక్తతకు దారి తీసింది. అలాగే సీడీసీ మాజీ చైర్మన్ నర్స య్య వేదికపైన అడ్డుగా ఉన్నారంటూ పక్కకు జరిపిన సందర్భంలోనూ గొడవ చెలరేగింది. కాగా సమావేశానికి ముందు ఓ ఫామ్‌హౌజ్‌లో పార్టీ ముఖ్యనేతలతో కేటీఆర్ సమావేశమై విభేదాలను పక్కనపెట్టి కలిసి పనిచేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment