TS Kamareddy Assembly Constituency: రంగు మారుతున్న రాజకీయం! ఎవరు, ఎప్పుడు, ఏ పార్టీలో ఉంటారో?
Sakshi News home page

రంగు మారుతున్న రాజకీయం! ఎవరు, ఎప్పుడు, ఏ పార్టీలో ఉంటారో?

Published Mon, Nov 6 2023 12:32 AM | Last Updated on Mon, Nov 6 2023 2:04 PM

- - Sakshi

సాక్షి, కామారెడ్డి: 'రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రధాన పార్టీలు వలసలను ప్రోత్సహిస్తుండడంతో నేతలు కండువాలు మార్చేస్తున్నారు. ప్రధాన నేతలు పార్టీలు మారుతుండడంతో ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతోంది.' 

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నాయకులు ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి, ఆ పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి మారుతున్నారు. ఆయా పార్టీలు చేరికల మీద దృష్టి సారించడంతో వలసలు జోరుగా సాగుతున్నాయి.

కాంగ్రెస్‌లోకి బీఆర్‌ఎస్‌ నేతలు..
కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మదన్‌మోహన్‌రావు వలసలపై దృష్టి సారించారు. ప్రధానంగా ఆయన బీఆర్‌ఎస్‌ మండలస్థాయి ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలను పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఫలించడంతో లింగంపేట జెడ్పీటీసీ సభ్యురాలు శ్రీలత, ఆమె భర్త సంతోష్‌రెడ్డితోపాటు ఇద్దరు ముగ్గురు సర్పంచ్‌లు ఆదివారం మదన్‌మోహన్‌ సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు.

నాలుగేళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి జెడ్పీటీసీగా గెలిచిన శ్రీలత.. తర్వాతి కాలంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. నిన్నమొన్నటిదాకా ఆ పార్టీలో కొనసాగిన శ్రీలత దంపతులు ఎన్నికల సమయంలో తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరారు. పలు మండలాలకు చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ నేతలు సైతం కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి అనుచరులూ మదన్‌మోహన్‌రావుకు మద్దతుగా నిలుస్తున్నారు.

కారెక్కిన కాంగ్రెస్‌ నేతలు..
స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ నియోజకవర్గంలో పలు మండలాలకు చెందిన కాంగ్రెస్‌, బీజేపీలకు చెందిన నాయకులను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే బి.జనార్దన్‌ గౌడ్‌ మంత్రి కేటీఆర్‌ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. వివిధ మండలాలకు చెందిన పలువురు నాయకులూ బీఆర్‌ఎస్‌లో చేరారు. తాజాగా లింగంపేట మండలాని కి చెందిన కాంగ్రెస్‌ జిల్లా కార్యదర్శి నల్లమడుగు షరీఫ్‌ బీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. పలు గ్రా మాలకు చెందిన కుల సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు.

చేరికలపై బీజేపీ ఫోకస్‌..
కాంగ్రెస్‌ టికెట్టు కోసం తీవ్రంగా ప్రయత్నించిన వడ్డెపల్లి సుభాష్‌రెడ్డి.. అవకాశం దక్కకపోవడంతో నిరాశ చెంది పార్టీకి రాజీనామా చేసి, బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ అభ్యర్థిగా ఎల్లారెడ్డిలో బరి లో ఉండే అవకాశాలున్నాయి.

సుభాష్‌రెడ్డి అనుచరులు చాలామంది ఆయన వెంటే బీజేపీలో చేరారు. ఆయన సైతం చేరికలపై దృష్టి పెట్టారు. వివిధ గ్రా మాలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో పాటు కుల సంఘాలను సంప్రదిస్తూ పార్టీలోకి చేర్చుకుంటున్నారు. మొన్నటివరకు తనతో కాంగ్రెస్‌లో కొనసాగిన నేతలందరిని బీజేపీలో చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కొందరు చేరారు. మరికొందరు ఊగిసలాటలో ఉన్నట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్‌లోకి జెడ్పీటీసీ..
లింగంపేట: లింగంపేట జెడ్పీటీసీ శ్రీలత బీఆర్‌ఎస్‌కు షాకిచ్చారు. ఆమె ఆదివారం మదన్‌మోహన్‌రావు సమక్షంలో కాంగ్రెస్‌లో చేరా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌ కార్యకర్తలు, నాయకులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆయన లింగంపేట మండలాన్ని అభివృద్ధి చేయకపోవడంతో కాంగ్రెస్‌లో చేరినట్లు తెలిపారు.

ఎల్లారెడ్డి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మదన్‌మోహన్‌రావును ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామన్నారు. శ్రీలతతోపాటు మోతె సర్పంచ్‌ రాంరెడ్డి, ఒంటర్‌పల్లి సర్పంచ్‌ బండి రాజయ్య, సురాయిపల్లి సర్పంచ్‌ రాజశేఖర్‌రెడ్డి, ఎక్కపల్లి సర్పంచ్‌ సతీష్‌ గౌడ్‌, మాలోత్‌ తండా సర్పంచ్‌ సునీత, కోమట్‌పల్లి ఎంపీటీసీ కమ్మరి కల్యాణి, లింగంపల్లి ఎంపీటీసీ బాగవ్వ తదితరులు కాంగ్రెస్‌లో చేరారు.
ఇవి చదవండి: 'పువ్వాడ' పూలు కావాల్నా..? 'తుమ్మల' ముల్లు కావాల్నా..? : సీఎం కేసీఆర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement