TS Elections2023:‘హాత్‌ సే హాథ్‌ జోడో’ కార్యక్రమంతో దూకుడు పెంచిన హస్తం పార్టీ | - | Sakshi
Sakshi News home page

TS Elections2023:‘హాత్‌ సే హాథ్‌ జోడో’ కార్యక్రమంతో దూకుడు పెంచిన హస్తం పార్టీ

Published Sat, Oct 14 2023 1:44 AM | Last Updated on Sat, Oct 14 2023 10:34 AM

- - Sakshi

కామారెడ్డి: కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ ఊళ్లను చుట్టేస్తూ సర్కారు వైఫల్యాలను వివరిస్తున్నారు. అధికారంలోకి వస్తే అమలు చేయబోయే ఆరు గ్యారంటీ పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థి స్తున్నారు.

కామారెడ్డి నియోజక వర్గం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగిన మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ.. హాత్‌ సే హాథ్‌ జోడో పేరుతో ఇప్పటికే ఊళ్ల ను చుట్టేశారు. ఇక్కడినుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా బరిలో నిలుస్తుండడంతో.. ఆయనను దీటు గా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న షబ్బీర్‌ అలీ.. 1989 నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు.

కామారెడ్డి నియోజకవర్గంనుంచి ఏడుసార్లు బరిలో నిలిచిన ఆయన.. రెండుసార్లు గెలిచి ఐదుసార్లు ఓటమి పాలయ్యారు. ఎన్నికలలో ఓడిపోయినా నిరంతరం నియోజకవర్గంలో పర్యటిస్తూ కార్యకర్తలు, అనుచరులకు భరోసా ఇస్తూ వస్తున్నారు. ఈసారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. గతంలో కాంగ్రెస్‌లో పనిచేసి నాయకులుగా ఎదిగిన ఎందరో తర్వాతి కాలంలో గులాబీ కండువా కప్పుకున్నారు.

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా ఎన్నికై న వారు చాలామంది పార్టీ మారారు. ఉన్న నేతలతోనే పార్టీని ముందుకు నడిపిస్తూ వస్తున్నారు. వరుస ఓటములతో జనంలో ఉన్న సానుభూతికి తోడు నిత్యం జనం మధ్య ఉంటుండడంతో ప్రజలు తనను గెలిపిస్తారన్న నమ్మకంతో ఉన్నారు. అధికార పార్టీ నుంచి సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తుండడంతో పకడ్బందీగా వ్యూహాలు రచిస్తున్నారు. తన పార్టీ నేతలు జారిపోకుండా చూసుకుంటూ ప్రచారంలో స్పీడు పెంచుతున్నారు.

సర్కారు వైఫల్యాలను ఎండగడుతూ..
నిత్యం ఏదో ఒక ఊరిలో పర్యటిస్తున్న షబ్బీర్‌ అలీ.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఉద్యోగాలు, కాళేశ్వరం ప్యాకేజీకి నిధులు మంజూరు చేయకపోవడం తదితర అంశాలను ప్రస్తావిస్తున్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో నాణ్యతాలోపాన్ని ఎత్తి చూపుతున్నారు. దళితబంధు, బీసీ బంధు పథకాలను అర్హులకు కాకుండా అధికార పార్టీ వారికే ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు.

పథకాల అమలులో వసూళ్లపై ఆరోపణలు గుప్పిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాకు అండగా నిలవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరుతున్నారు.

సీఎం ఓడిపోతే బీఆర్‌ఎస్‌ దుకాణం బంద్‌
కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌ ఓటమితో రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ దుకాణం బంద్‌ అవడం ఖాయమని మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో విలే కరులతో మాట్లాడారు. బంగారు తెలంగాణ తీసుకువస్తామన్న కేసీఆర్‌ తాగుబోతు రాజ్యం తీసుకువచ్చారని విమర్శించారు. అచ్చేదిన్‌ తీసు కువస్తామన్న బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు.. జనం చచ్చే రోజులు తీసుకువస్తున్నారన్నారు.

కాంగ్రెస్‌ను గెలిపించాలని ప్రజలను కోరారు. ఫిర్యాదు చేయగానే స్పందించి, అధికారులను బదిలీ చేసి న కేంద్ర ఎన్నికల అధికారికి ధన్యవాదాలు తెలిపారు. నూతనంగా వచ్చిన అధికారులు పారదర్శకంగా పనిచేయాలని కోరారు. కామారెడ్డి పట్టణంలోని 32వ వార్డుకు చెందిన పలువురు, క్యాసంపల్లి తండా, రాఘవాపూర్‌ తండాకు చెంది న యువకులు కాంగ్రెస్‌లో చేరారు.

కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కై లాస్‌ శ్రీనివాస్‌, మండల అధ్యక్షుడు గూడెం శ్రీనివాస్‌, నాయకులు శ్రీనివా స్‌, పండ్ల రాజు, అశోక్‌రెడ్డి, మున్సిపల్‌ కౌన్సిలర్‌ శివకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement